నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

10 Mar 2016

అంతిమం



రాధమ్మ చెంప చెళ్ళుమంది!
కింద పడిన ఆమె పైకి లేచి చీర సర్దుకుని తన ఆరేళ్ళ కూతురి గొంతుకి కత్తి పెట్టింది!!
“ఇదిగో ఇయ్యల్తో నీ ఆటలు కట్టిపెట్టు!యాతనైపోయ్యింది నీతో!అటో ఇటో తేలిపోవాలి నీ సంగతి సెప్తున్నా!నా కాడ డబ్బుల్లేవు! నీతో యాగలేకపోత్నాను. దీన్ని సంపేసి నానూ సత్తాను! పని సేసి నాలుగు డబ్బులు యనకేసుకొద్దావని లేదూ?పిల్లని బళ్ళో సేర్పియ్యాల.నీ డబ్బులూ,నా డబ్బులూ నీ తాగుడుకే తగలెడతావు తాగుబోతు సచ్చినోడా నీ జిమ్మడ!” భర్త సత్తిబాబుని మాటల్తోనే ఉతికి పారేసింది రాధమ్మ.
“ఏటే?ఏటి?ఇయ్యాల రొండో తేదీ! డబ్బులొత్తాయని నాకు తెల్దనుకున్నావా?ముండ కానా!ఇత్తావా సత్తావా?నిన్ను సంపేసినా పాపం లేదే ఎదవ కానా!తియ్యే డబ్బుల్తీ!” తూగిపోతూ అన్నాడు సత్తిబాబు.
అసలే తాగున్నాడు.అన్నంత పనీ చేయకపోయినా భార్యని చావబాదుతాడు.రాత్రంతా భార్యను కొట్టి పొద్దుటికి కాళ్ళు పట్టుకుంటాడు. పగలంతా చాలా మంచిగా ఉంటాడు కానీ సాయంత్రానికి మళ్ళీ మాములే!కురువృద్ధురాలైన తల్లంటే ప్రాణాలిచ్చేంత ప్రేమ అతనికి!ఈ వయసులో కూడా ఆమె సత్తికి అన్నం తినిపిస్తుంటుంది! కూతురు చిన్ని అంటే మహా ఇష్టం.తనని బళ్ళో చేర్పించాలని అతనికీ ఉంది.కానీ తాగుడుకి బానిస కావడం వల్ల డబ్బులు తగలేస్తున్నాడు.
అయితే, పెళ్ళాం దగ్గర అజమాయిషీ చెయ్యడానికి ముందే తాగి వస్తాడు!అతడి కూతురు చిన్నిది ఏమీ అర్ధం చేస్కోలేని వయసు!నాన్న ఎందుకు పగలంతా ప్రేమగా ఉంటాడో సాయంత్రం అయ్యే సరికి అమ్మనెందుకు కొడతాడో తెలీదు!రాధమ్మ ఆరిళ్ళలో రోజంతా పని చేస్తూనే ఉంటుంది.కానీ ఆ డబ్బంతా సత్తి బాబే దోచేస్తాడు.కూతుర్ని స్కూల్ యూనిఫాంలో చూడాలనీ,తమ బతుకులు మారాలనీ రాధమ్మ ఎన్నో కలలు కంటోంది.సత్తిబాబు సరిగ్గా ఉంటే అన్నీ బానే ఉండేవి!
“ఆ!దొరికాయి పోయే!నువ్వేటి ఇచ్చేది గోంగూర కట్ట!”
రాధమ్మ బొడ్లో దోపుకున్న డబ్బులు చటుక్కున లాక్కొని పారిపోయాడు సత్తిబాబు.ఇక రాధమ్మ ఏడవడం, కూతురు కళ్ళు తుడవడం షరా మాములే!
రాత్రి పది దాటుతోంది. సత్తిబాబూ అతడి స్నేహితులు నలుగురు తప్ప తాగి సారాయి అంగడి ముందు మట్టిలో దొర్లుతున్నారు.ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడుకుంటున్నారు.అంగడి మూసేస్తూ ‘ఎవరి దారిన వాళ్ళు పొండ్రా!’ అని అరిచాడు యజమాని.రోజూ ఆ కూత విననిదే సత్తిబాబుకీ అతడి స్నేహితులకి వెళ్లాలని తోచదు! మెల్లగా ఒకరిని పట్టుకుని ఒకరు పడుతూ లేస్తూ నిలబడ్డారు.అక్కడికి సగం పనైంది!ఇక కిలో మీటర్ దూరంలో ఉన్న ఇళ్ళకి చేరుకోవాలి.ఇది వారికి అలవాటైన పనే!కానీ రెండో తారీఖు కదా!ఒకటో తేదీ వచ్చిన జీతమంతా పీకల్లోతు తాగేశారు!తప్ప తాగిన తప్పటడుగులు అసౌకరాన్ని కలిగిస్తున్నాయి. బాగా చీకటి పడింది.దాదాపు ఎవరూ లేరు రోడ్డు మీద.అంతా నిర్మానుష్యం!నిశ్శబ్దం!
“వురే!ఇంకా ఎంత దూరం రా? ఇలొచ్చిందా?పోయిందా?” నడక ప్రారంభిస్తూ అడిగాడు ఒకడు.
“ఎల్లొచ్చింది!ఒచ్చి పోయింది” జవాబిచ్చాడు ఇంకోడు.
“నోర్ముయ్యండ్రా ఎదవల్లారా!నా ఎనకమాలే రండ్రా!నేను తీస్కెల్తాను”అన్నాడు సత్తి బాబు
“ఒరే సత్తిగా ఎదర సూడ్రా!ఏదో వత్తుంద్రా!!తెల్లగా!” తాగిన మైకంలో ఎదురుగా ఉన్న దాన్ని గుర్తుపట్టలేక అన్నాడు ఒకడు.
“ఎల్లెహే!ఏటీ లేదు!పిరికి నాయాలా!”
“అవున్రా ఎవరో మనిసిరోయ్!”
“ఆ!మనిసి కాదు రా!ఆడ మనిసి!!” కన్ను కొడుతూ అన్నాడు సత్తి బాబు.
“ఇంత రేత్రి కాడ ఆడమనిసి రోడ్డు మీద ఎందుకుంటది రా సోది నా కొడకా!”
“రేయ్!ఎందుకుందో అడుగుదాం పదండ్రా!” అన్నాడు సత్తిబాబు
ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని ఐదుగురూ ముందుకి నడిచారు.
“ఒరేయ్!పక్కనే తుప్పల్లోకి తీస్కెళ్ళి పని కానిచ్చేద్దాం!” ఎవడో అన్నాడు
సత్తిబాబుకి ఆ ఆలోచన మనసులో నాటుకుంది.
“అయినా ఇంత రేత్రి కాడ ఆడదానికి బైట పనేట్రా!? దాన్ని పాడుసేసి గుట్టు సప్పుడు కాకుండా ఇళ్ళకెలిపోదాం!ఎవలికీ సెప్పొద్దు!”
సత్తిబాబు అందరి మాటలూ వింటున్నాడు.అందరికన్నా ముందు నడిచాడు.ఆ ఆడమనిషి వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నాడు.
చిమ్మ చీకటి!ఎవరూ దరిదాపుల్లో లేరు!ఆమె నోరు గట్టిగా నొక్కి చీర లాగబోయాడు!ఇంతలో మిగతా నలుగురూ వచ్చి ఆమెనూ,సత్తి బాబునూ,రోడ్డు పక్క గుబురు గుబురుగా ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళారు.ఆమె విదిలించుకోడానికి ప్రయత్నం చేస్తోంది. ఐదుగురూ ఆమెను బలంగా పట్టుకున్నారు. సత్తిబాబు ఆమెను గట్టిగా కొడుతూనే ఉన్నాడు.ఆమె తెల్లని చీర మొత్తం రక్తమయమైంది. సత్తి బాబు ఆమెను పాడుచేసి మత్తుగా పడిపోయాడు. మిగతా నలుగురూ ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యం చేసి, ఆమె ప్రతిఘటించినందుకు చితకబాదారు!
ఆ నలుగురూ సత్తిబాబుని లేపి ఇళ్ళకి బయల్దేరారు. మార్గమధ్యలో వారంతా వేరే వేరే దారుల్లో వెళ్ళిపోయారు. సత్తిబాబు మధ్యలోనే నడవలేక పడిపోయాడు.
*          *          *
సూర్యోదయం!ఎండ సరాసరి సత్తిబాబు ముఖంపై పడుతోంది.
రోడ్డు మీద గోడ పక్కన చెత్తలో పడున్నాడు. అతడి కళ్ళు మెదిలాయి.నలుపుకుంటూ లేచే ప్రయత్నం చేశాడు. ఓ కుక్క అతని పక్కనే మల విసర్జన చేయబోతుంటే దాన్ని తరిమి ఒక్కసారిగా లేచాడు.ఒళ్ళంతా విరిచి పెద్దగా ఆవలిస్తూ ఇంటి బాట పట్టాడు.ఇంటి దగ్గర గుంపులు గుంపులుగా జనం కనపడ్డారు.సత్తి బాబు పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ల పేటలో ఏ చిన్న విషయం జరిగినా జనం పోగవడం సాధారణం.
జనంలోంచి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సత్తి బాబు దగ్గరగా వస్తున్నారు...
‘ఏటీ! కొంప దీసి నా ఇంటిది కానీ నన్ను పోలీసోళ్ళకి పట్టిత్తుందా?’ ఆశ్చర్యపోతూ అనుకున్నాడు సత్తిబాబు.
“ఏవయ్యా! నువ్వేనా సత్తిబాబంటే?” అతడి అవతారం చూసి ఎంతో జుగుప్సగా అడిగారు కానిస్టేబుల్స్.
“అవునండయ్యా!” చేతులు కట్టుకుని వినయంగా సమాధానమిచ్చాడు.
“పద పద” అంటూ గుంపులోంచి అతడి ఇంటి ముందుకి తీసుకెళ్ళారు.
సత్తిబాబు చూసింది నమ్మలేకపోయాడు! ఉన్న అరా కొరా మత్తు కూడా వదిలిపోయింది! నోటివెంట మాటలేదు! రాధమ్మ, తన కూతురు చిన్ని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తన పేట వాళ్ళే కాక, చుట్టుపక్క వాళ్ళు కూడా గుమిగూడారు. అందరూ సత్తిబాబునే చూస్తున్నారు. అతడు మాత్రం ఎదురుగా శవంగా పడి ఉన్న తన తల్లి పిచ్చమ్మనే చూస్తున్నాడు…
          “అమ్మా...!” ఒక్క అరుపుతో తల్లి శవం మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు సత్తిబాబు. చిన్ని ఆ అరుపుకి బెదిరిపోయింది! అతని ఆర్తనాదాలు అకాశాన్నoటాయి.
“ఒసేయ్ రాధమ్మ! ఏటైందే మాయమ్మకి? నిన్నటి దాకా బానే ఉంది కదేటే! నిన్న సందలడేకాడికి దుర్గమ్మత్త ఇంటిగ్గుడా నడిసేపోయింది కదే?” గుండెలవిసేలా ఏడుస్తూ అడిగాడు సత్తిబాబు.
“అంతా నీ వల్లే రా తుప్పాసెదవ!” రాధమ్మ కట్టలు తెంచుకున్న కోపంతో అరిచింది.
సత్తిబాబు అవాక్కయ్యాడు! ఓ పోలీసు సత్తిబాబుని పక్కకు పిలిచి...
“మీ అమ్మని కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారయ్య!”
“ఏటండి?” అర్ధంకానట్టు అడిగాడు సత్తిబాబు.
“అదేనయ్యా! కొంతమంది పాడు చేశారు!”
సత్తిబాబు తన తల్లికి ఏ గుండెపోటో, యాక్సిడెంటో అయ్యుంటుందని అనుకుంటున్నాడు. పోలీసు చెప్పిన సంగతి విని నిర్ఘాంతపోయాడు! మళ్ళీ రాధమ్మ దగ్గరకు పరుగెత్తాడు.
“ఏటే రాధమ్మ? మాయమ్మని పాడుసెయ్యడమేటే?” ఏడుస్తూ అడిగాడు.
“అవునయ్యా! అద్దరేత్రి కాడ రోడ్డు పక్క పొదల్లో పడుంటే యంకటేశు, రమేసు సూసి ఎత్తుకొచ్చారు! ఆసుపత్రికి తీస్కెల్తే  పోలీసుల్ని పిలిపించి ఏటేటో సేసారయ్యా” దు:ఖం పొంగుకొస్తుంది రాధమ్మకు.
“తప్పుడు మాటలాడకే రాధమ్మ! సీరేత్తాను! మా అమ్మ రేత్రి కాడ రోడ్లమ్మట ఎందుకే తిరుగుతది?”
“నీ వల్లేనయ్యా!! ‘ముదనష్టపోడు! యక్కడో తప్పతాగేసి పడిపోయుంటాడత్తా! పొద్దున్నే వత్తాడ్లే నువ్ నిద్రో.’ అన్నాను. నా మాట ఇనకుండా బయటికెల్లింది నిన్ను ఎతుకులాట్టాకి. నిన్ను  ఎవడన్న కొట్టాడో తెల్దు! లారీయో ఆటోవో గుద్దీసిందో తెల్దు! కంగారడి పోయిoది మీయమ్మ”
“ముసల్ది బయటికొత్తే నువ్వెవడితో కులుకుతున్నావే నెంజ!” రాధమ్మ మెడ వంచి వీపు మీద బాదాడు సత్తిబాబు.
పోలీసులు జనాన్ని తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
“నీ కూతుర్ని ఎవడు సూస్కుంటాడ్రా గుడిసేట్నాయాలా! పిల్లనిడిసి ఎల గెల్లమంటావ్? ఆళ్ళు మీయమ్మని ఇంటిదాకా మోసుకొచ్చేకాడికి కొనూపిరితోనుంది. ఆటోక్కూడా డబ్బుల్లేకుండా మొత్తం తగటాకట్టుకేల్లావ్! నానా తిప్పలు పడి తీస్కెల్లేక ఆడ సచ్చిపోయిందిరా యదవ! మీ అమ్మని నువ్వే పొట్టనెట్టుకున్నావురా! మాయదారి సచ్చినోడ థూ! నీ నోట్లో మట్టి గొట్ట!”
“అయ్యో! ఏటి సేసావ్రా దేవుడా!” సత్తిబాబుకి నమ్మశక్యం కావట్లేదు. తల్లి మరణానికి ఇంత దౌర్భాగ్యమైన కారణాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు! వెంటనే పోలీసు దగ్గరికి పరుగెత్తాడు.
“అయ్యా! నాకేటీ బుర్రకెక్కుతాలేదండయ్యా! మా యమ్మకి డెబ్బైనాలుగేళ్లoడయ్యా! ముసల్దాన్ని ఎవడు పాడు సేత్తాడయ్యా? రెండు సేతులు కలిత్తేనే కదండయ్యా తప్పట్లు? ఇంకేదో జరిగుంటదయ్య!”
శరీరమంతా తెల్లని గుడ్డతో చుట్టేసి మొహం మాత్రమే కనిపిస్తున్న తల్లిని చూసి రోదిస్తూ అడిగాడు సత్తిబాబు.
“నీ బాధ నేను అర్ధం చేస్కోగలను బాబు! మీ అమ్మకి అన్ని పరీక్షలు చేసాం. మొత్తం ఐదుగురి పళ్ళగాట్లు, గోటిగాట్లు, పాడు చేశారని ఆధారాలూ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. ఆమె ఎదురు తిరగడంతో వాళ్ళు బాగా కొట్టారు. మీ అమ్మ మర్మాంగo బాగా దెబ్బతింది. చాలా రక్తం పోయింది. బ్రతికే ఉంటే కనీసం పద్దెనిమిది కుట్లు పడేవి!! ఈ వయసులో ఆమెకంత కష్టం ఇవ్వకుండా దేవుడు మేలే చేశాడు. ఆమె వాళ్ళకంటే ముందు నిన్ను చూసినా బాగుండేది! ఎవరు చేశారో తెలీదు. చూసిన వాళ్ళు లేరు. బాధితురాలు చనిపోయింది. నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు. ఇంటి గుమ్మం నుంచే “ఒరేయ్ సత్తీ...” అని పిలుచుకుంటూ నిన్ను వెతకడం మొదలు పెట్టిందని నీ భార్య చెప్తుంది.”
సత్తిబాబుకి అంతా చీకటైనట్టుoది. ఏమీ వినిపించట్లేదు.
“ఒరేయ్ సత్తి... నేన్రా అమ్మని!”
“నువ్వు ఎవడికి అమ్మవైతే నాకేటే!?”
ఇవే మాటలు మారు మోగుతున్నాయి అతడి చెవుల్లో. ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి సత్తికి.
“నేన్రా అమ్మని! ఇంటికెల్దాం పద రా!” గుర్తొస్తున్న మాటలు...
సత్తిబాబు రక్త కన్నీరు కారుస్తునాడు!
*          *          *
శవాన్ని స్మశానానికి తరలించి, కట్టెలు, పిడకలపై పడుకోబెట్టారు. సత్తిబాబు చేయాల్సిన కార్యాలన్నీ చేస్తున్నాడు. అతడి మొహం నెత్తురు చుక్కలేకుండా ఉంది. కన్నీరు లేదు! కదలిక లేదు!
కర్రతో చితికి నిప్పంటించాడు...భగ్గున మండుకుంది. తన తల్లి కాలిపోతోంది. చుట్టు పక్కన ఏడుపులు, పెడబొబ్బలు వినిపించడం లేదు. అందరూ తిరిగు ప్రయాణం పెట్టారు. తన కూతుర్ని, భార్యని చూశాడు. ధారాళoగా ఏడుస్తున్నారు. స్మశానంలో పని వాళ్ళు చితికి ఆజ్యo పోస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సత్తి తన చేతిలో ఉన్న కర్రను కింద పడేసి ఒక్క ఉదుటున తల్లి చితిలోకి దూకేశాడు!




నల్లని పొగల్లోంచి వారి సత్తి బాబు ప్రాణం పైకి లేచింది...
చితి మీద సైతం ఘోర అవమానంతో తల్లి ఆత్మ విలపిస్తుంది!! అమ్మ ఆత్మను చూసి సత్తిబాబు ఆత్మ సిగ్గుతో చావలేక, మనిషై పారిపోలేక చావు తర్వాత అత్యాచారం లాంటి నరకాన్ని చూశాడు!
తల్లి శవంతో శవమై మంటల్లో బూడిదై ఆహుతైయ్యాడు…
*          *          *

“సుజీ! ఇవ్వాళ పేపర్ చూశావా?
‘తల్లి మరణం భరించలేక ఆమె చితిలోనే బూడిదైన కొడుకు! అనoతప్రేమకు నిదర్శనo!!’
నిన్న వెళ్లాను కదా...అదే కేసు! పాపం! మేo చూస్తుండగానే దూకేశాడు! మంటలు ఎగిసి పడడంతో కాపాడలేకపోయం! వాళ్ళమ్మoటే పిచ్చి ప్రేమ అతనికి. నిన్న చూడాల్సింది అతని బాధ! మాటల్లో చెప్పలేను!” కళ్ళు తుడుచుకుంటూ రోజు ప్రారంభించాడు పోలీసు ఆఫీసర్.
*          *          *          *          *          *
                                             - మానస ఎండ్లూరి   
                                                                                         అక్టోబర్-డిసెంబర్ 2015, చైతన్య మానవి
                 గురజాడ శత వర్ధంతి సందర్భంగా ఐద్వా నిర్వహించిన కథల పోటీల్లో మూడవ బహుమతి పొందిన కథ



https://www.facebook.com/manasa.evangeline.9/posts/739785559491909





4 comments:

  1. మానస గారూ కథ చదువుతుంటే గుండె బరువెక్కింది.మనసు మూగబోయిoది.

    ReplyDelete
  2. మానస గారూ కథ చదువుతుంటే గుండె బరువెక్కింది.మనసు మూగబోయిoది.

    ReplyDelete
  3. Thank u ravi garu and doctor ji

    ReplyDelete