నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

1 Apr 2016

మైదానంలో నేను!



చలాన్ని చదవాలి...
మణిరత్నం సినిమా చూడాలి...
ఇళయరాజా పాటలు వినాలి...
ఒకప్పుడు నా ధ్యాసంతా వాటి మీదే. అదో మైకం.
అసలు నా జీవితాన్ని, మరీ ముఖ్యంగా నా వైవాహిక జీవితాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు కాదూ?!
స్త్రీ స్వేచ్ఛ అనీ స్త్రీ చైతన్యం అనీ నన్ను అస్తిత్వంలో ముంచెత్తాడు ఒకాయన
ఆడపిల్ల అంటేనే ఉత్తేజమనీ ఆకాశపు అంచుల్లో నన్ను విహంగాన్ని చేశాడు ఇంకొకాయన
సంగీత పరిజ్ఞానం లేకపోయినా స్వరాలాపనలో మునిగి తేలిపొమ్మని నన్నో రాగమాలికను చేశాడు మరొకాయన! వాళ్ళంతా బానే ఉన్నారు! ఇటొచ్చి నేనే, పెళ్లికి ముందు వరకు వాళ్లు చూపించిన ప్రపంచం కోసం వెతికీ వెతికీ పెళ్లి తరువాత అదంతా ఒక బూటకమని తెలుసుకుని అగాధంలో కూరుకుపోయాను.
చలన చిత్రాలూ నవలలు చెడగొడతాయంటే ఏమో అనుకున్నాను గానీ అందుకు ఇప్పుడు నేనే ఓ నిలువెత్తు నిదర్శనం.
ఎంత నమ్మించారు నన్ను! తెర మీదలా శ్వేతాశ్వమ్మీద రాజకుమారుడు వచ్చి నన్ను రాజకోటకి తీసుకెళ్తాడని నమ్మబలికారు. రాజకుమారుడు ఎక్కడ వచ్చాడు? మా కాలేజి వీధి చివర హీరో సైకిల్ మీద నాగరాజు వచ్చాడు. ముందున్న ఇనప కడ్డీ మీద కూర్చోబెట్టుకుని గాంధీ పార్క్ కి తీసుకువెళ్తానని! ‘నేను రాజకుమారుడి కోసం చూస్తున్నాను, ఛీ పొమ్మన్నాను!’ మన కాలేజీలో రాజ్ కుమార్ ఎవడా అని తింగరి చూపులు చూసుకుంటూ వెళ్ళిపోయాడు నాగరాజు!
ఆడదానికో హృదయం, ఆ హృదయానికో అనుభూతీ ఉంటాయంటే ‘నిజమే కదా!’ అనుకుని
‘హరీష్! నీ మీసం చాలా బావుంది’ అని ఓ నవ్వు నవ్వాను. అంతే! సంవంత్సరం రోజులు ఖైదీలా ఇంట్లోనే గడపాల్సొచ్చింది!
పూర్తి పేర్లతో కాకుండా ముద్దు పేర్లతో ఏకవచనాలతో పిలవడం ప్రేమలో ఒక గొప్ప లక్షణమని నేర్పించారు...‘ఒరేయ్ శీను! ఓ ముద్దివ్వరా’ అని భుజం మీద చేయి వేశాను. మళ్ళీ శ్రీనివాసాచార్యులు కనిపిస్తే ఒట్టు! తను పెట్టలేదు నన్ను పెట్టనివ్వలేదు ముద్దు! 
రాజకుమారుడి కోసం ఎదురు చూసీ చూసీ రాఘవ బండెక్కాను. చిటపట చినుకులు, చల్లగాలి, కౌమార బిడియాలు, అతని భుజమ్మీద పడాలని నా చేతి వేళ్ళ మొహమాటాలు...గబుక్కున బండాగింది. చూస్తే పెట్రోల్ బంక్. కొంప దీసి ఇక్కడ కౌగిలించుకుంటాడా!? ‘పెట్రోల్ కి ఒక వందివ్వా!’ అనడిగాడు వెనక్కి చూడకుండా చేయి చాచి. అందుకే రాజకుమారుడైతే ఇలాంటి ఆర్ధిక ఇబ్బందులుండవ్! అమ్మో వద్దులే! అప్పుడు గుర్రo మీద వచ్చే వాడు. ఇదే నయమేమో. పర్స్ లోంచి డబ్బులు తీసి ఇవ్వొచ్చు. గుర్రానికి ఆకలేస్తుంది ఉలవ గుగ్గిళ్ళు తెమ్మంటే ఎక్కణ్ణుంచి తేను?
ఛీ! ఈ మగాళ్ళతో పెట్టుకోకూడదని నాలుగు రోజులు కుదురుగా ఉంటానో లేదో, ఏదోక సినిమా రిలీజ్ అవుద్ది! ఈసారి ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి ప్రేమ కథ-మత ఘర్షణల సినిమా. ఘర్షణలు పక్కన పెడితే నేను ముస్లిం అమ్మాయిని కాదు కదా! అయితే ఏమైందిలే మనం కథ మారుద్దాం అనుకున్నాను అష్రఫ్ ని చూడగానే! పెళ్ళొద్దు స్నేహం చాలంటాడు పెళ్ళొద్దు ప్రేమ చాలంటాన్నేను!
ఒక రోజు అష్రఫ్ ఓ గులాబీ పూవు తెచ్చి రొమాంటిగ్గా నా బుగ్గ మీద తట్టి..వెనుక నుంచి గట్టిగా వాటేసుకుని...నా కళ్ళు మూసి...మెల్లగా నా పెదవులపై తన వేళ్ళతో నిమిరి...చిన్నగా నా పెదవులు తెరుచుకున్నప్పుడు...చప్పున వేయించిన మాంసం  ముక్క పెట్టాడు! పగటి కల్లోంచి తేరుకుని చూస్తే గులాబీ పూలు కాదు మాంసం కూర తెచ్చిన హాట్ ప్యాక్ ఉంది అతని చేతుల్లో. ప్చ్! కల్లో రాకుమారుడు రాడు! గులాబీ పూలు తేడు ఏవీ తేడు! ఇదెందుకు వదులుకోవాలి? ఇద్దరం గోదారి గట్టున కూచుని రుచి లేని కబుర్లు చెప్పుకుంటూ అమోఘమైన మాంసం తినేవాళ్ళం.
అసలు మన్మథుడనే వాడు ఒక్కడైనా ఉన్నాడా? అన్న అన్వేషణ ఒక పక్క, చదువొక పక్క సాగుతున్నప్పుడు పరిచయమయ్యాడు లెవిన్! రాంగ్ కాల్లో అమ్మాయి కలిస్తే ఏ అబ్బాయైనా వదులుతాడా? వాళ్ళు వదలాలనుకున్నా మేం వదలనిస్తామా!?
వారం రోజులు ఎడాపెడా ఫోన్ లో మాట్లాడుకున్నాక కలుద్దామని అడిగాను. ఆదివారం రాత్రి పదింటికి చర్చికి రమ్మన్నాడు. ఆహా! దొరికాడు ఆడమ్...ఎంత రొమాంటిక్ ఫెలో! ఇంటి కన్నా గుడి పదిలమనుకున్నాడేమో! తొలి పరిచయం శ్మశానంలో జరిగితేనే అంతటి అద్భుతమైన ప్రేమ కథ పుట్టినప్పుడు, ఇక చర్చిలో పరిచయం ఎక్కడిదాకా తీసుకెళుతుందో! నేను ముందెప్పుడూ చర్చికి వెళ్ళింది లేదు. రాత్రి పది గంటలకి ఎవరూ ఉండని సమయం, ఏకాంతంగా ఏం మాట్లాడుతాడో చూడాలి. కొంపదీసి పెళ్ళీ గిళ్ళీ చేసుకుంటాననడు గదా!
తెల్లటి సల్వార్ కమీజ్, నీలాకాశంలాంటి దుపట్టా, లేత గులాబీ రంగు లిప్ స్టిక్, లీలగా గలగలలాడే పల్చటి గాజులూ కళ్ళల్లో ఎదురు చూపు. చర్చికి నాలుగడుగుల దూరంలో ఉన్నాను. ఫోన్ చేస్తే కట్ చేసి ‘లోపలికి రమ్మ’ని మెసేజ్ పెట్టాడు.
‘ఏంటి చర్చి లోపల ఏమైనా సర్ప్రైస్ ప్లాన్ చేశాడా?!’ అనుకుంటూ ముందుకి సాగాను...
లోపలికి వెళ్ళకముందే సర్ప్రైస్!! చర్చి నిండా జనం, గుమ్మం నిండా చెప్పులు, మైక్ సెట్ లోంచి అప్పుడే మొదలైన చర్చి పాటలు, కంజెర, తబలా, కాషియో వాయిద్యాల హోరు! ‘టప్’మని బుడగ లా పగిలిపోయింది నా ఊహా ప్రపంచం. డామిట్! మణిరత్నం మళ్ళీ మోసం చేశాడు! విసురుగా వెనుదిరుగుతుంటే ‘నేను డ్రమ్స్ వాయిస్తున్నాను. నాలుగు పాటలైయ్యాక చర్చి బయట కలుస్తాను’ అని లెవిన్ నుంచి మెసేజ్ వచ్చింది. గుమ్మoలోoచి ఎగిరి చూస్తే కనబడ్డాడు. నలుపు రంగు టీ షర్ట్, బ్లూ జీన్స్, లేటెస్ట్ హెయిర్ స్టైల్, తెల్లటి ముఖవర్చస్సు...చాలా అందంగా ఉన్నాడు. వెనుకున్న జనానికి నేను అడ్డుగా ఉన్నందు వల్ల ఒక్క తోపుతో లోపలికి పడ్డం,వాళ్లతో పాటు కూర్చోడం జరిగిపోయాయి! బిక్కుబిక్కుమంటూ చున్నీతో ముసుగు వేసుకున్నాను అందర్నీ చూసి. అందరూ భక్తిగా చేతుల్లో బైబిల్ పట్టుకుంటే నా చేతిలో తుంటరిగా సెల్ ఫోన్ ఉంది. ఏమనుకుంటారో ఏంటో! చర్చి పాటలన్నీ అయ్యేదాకా లెవిన్ మెసేజ్ చెయ్యడు! పోనీ వెళ్ళిపోదామా అంటే అంతమందిలో నిలుచోవాలంటేనే బిడియంగా ఉంది. ముసుగులోంచి తాబేల్లా తలపైకెత్తి చూస్తే కళ్ళు మూసుకుని తల ఆడిస్తూ తన్మయత్వంలో మునిగిపోయి మరీ డ్రమ్స్ వాయిస్తున్నాడు లెవిన్. అర్ధరాత్రి ఈ మద్దెల దరువేంటో అర్ధంకాలేదు నాకు!
“చర్చ్ ఎప్పుడైపోతుందండీ?” అని అడిగాను గుసగుసగా  పక్కామెను.
బైబిల్లోంచి మొహం బయటకు తీసి ఒక్క చూపు చూసింది...ఆమెకు శపించే శక్తుంటే నేను కుక్కనైపోయేట్టు!
“తెల్లవార్లు నిద్రాపుకోలేనిదానివి ఆల్ నైట్ ప్రేయర్ కి ఎందుకొచ్చినట్టు??” అనింది.
ఏంటి తెల్లవార్లూనా? చచ్చాన్రా దేవుడా! నన్ను మా హాస్టల్ వార్డెన్ రానిస్తుందా ఇక! ఈ లెవిన్ గాడి టాలెంట్ చూపించుకోడానికి నన్ను బలి చేశాడుగా! వాడి పుణ్యమా అని నా జీవితంలో ఓ రాత్రి ఓ అందగాడి ముచ్చట్లతో గడుపుతాననుకున్న దాన్నల్లా దైవసన్నిధిలో ‘ఎందుకో నన్నింతగా నీవూ ప్రేమించితివో ప్రభువా...’ పాటతో ఆరాధనలో మునిగాను.
నిజంగానే ఆడపిల్లందరూ రొమాంటిగ్గా ఉంటారా? లేక తామెలా ఉన్నా రొమాంటిక్ భావాలున్న వాడే కావాలని కోరుకుంటారా? ఈ విషయం మీద కూలంకషంగా తోటి స్నేహితులతో చర్చించే లోపే శ్రేయస్ తో పెళ్లి చేశారు నాకు.
మగాళ్ళందరూ పర్ఫెక్షనిస్ట్లో లేక మొగుళ్ళందరూ పర్ఫెక్షనిస్ట్లో లేక పెళ్లైయ్యాక ప్రతి మగాడూ పర్ఫెక్షనిస్ట్ అయిపోతాడో తెలీదు గానీ శ్రేయస్ మాత్రం సూపర్ పర్ఫెక్షనిస్ట్! నేనేమో ఫేక్ ట్రెడిషనల్ అండ్ రియల్ అనార్కిస్ట్. ధనవంతురాలు పేదవాడిని ప్రేమించి పెళ్ళిచేసుకోవడం చాలా సినిమాల్లో చూశాం కానీ మా కాంబినేషన్ ఏంటో నాకే అర్ధం కాలేదు! జంతువులo, పక్షులం కాదు కదా సహచరుల్ని మనమే కోరుకుని వారితో జీవించడానికి. కేవలం బతుకు సాగించడానికి తోడు ఎవరైతే ఏం!
ఆశగా దగ్గరకొస్తాడు శ్రేయస్...ఇంకా దగ్గరకు రాడేంటా అని దొంగ సిగ్గు వదిలిపెట్టి కళ్ళు పైకెత్తి చూసేసరికి పక్క గదిలో తిరిగే ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటాడు! ఇష్టంగా మధ్యాహ్నం ఫోన్ చేసి ‘కూర బావుందా?’ అంటే ‘పన్నీర్ ఎక్కువ తినకూడదు అందులో అవెక్కువుంటాయి, ఇవి తక్కువుంటా’యాని క్లాస్ పీకుతాడు!
పాప్ కార్న్ లేకుండా సినిమా అన్నా చూడగలమేమో గానీ ముద్దూ ముచ్చటా లేకుండా కాపురం చెయ్యడమెలా సాధ్యం? సాధ్యమేనని రోజూ నిరూపిస్తూనే ఉన్నాడు శ్రేయస్. ఒకవేళ అదీ తెలియకపోతే ఏ ‘మకా’శాస్త్రమో చదివించొచ్చు. సున్నితత్వం, లాలిత్యం తెలియాలంటే ఏం చదివిస్తాం నా మొహం! చలం ఏమైనా సాయం చేస్తాడేమో అని సంధ్య వేళ మైదానంలో తచ్చట్లాడాను. సరిగ్గా అప్పుడే నా స్నేహితురాలు దీపిక ఫోన్ చేసింది...
“ఏంటే కొత్త జీవితం ఎలా సాగుతోంది?”
“నా మొహంలా తగలడింది! ఏం మనిషో! ఓ ముద్దూ ఉండదు మురిపెం ఉండదు!”
“అంటే పెళ్లై ఆరు నెలలవుతున్నా...ఊహునా?”      
“అది ఊ( యే! అసల్దే ఊహు!”
“నువ్వింకా మారలేదా? చిన్నప్పటి నుంచీ చెపుతూనే ఉన్నాను కదా! పార్క్ లో పాటలు పాడుకోడం సినిమాల్లోనూ, సన్నజాజి పందిట్లో కబుర్లు చెప్పుకోడం నవలల్లోనే ఉంటాయని. నిజ జీవితం ఇలానే చప్పగా ఉంటది. మనమే మసాలాలు వేస్కోవాలి”
“కూరల్లో వేస్తేనే ప్రకృతి చికిత్సాలయ వైద్యుడిలా మసాలాలు తినకూడదని చెప్పి నా మెదడు మెంతికూరలా తినేస్తాడు! ఇక జీవితంలో మసాలా వేస్తే ఒప్పుకుంటాడా?”
“అయినా ఏదో అలా అంటావ్ గానీ...పెళ్ళైన కొత్తలో ఎంతో కొంత చిలిపి చేష్టలు చేస్తార్లేవే! నువ్వు పైకి చెప్పవు! వంట చేసేటప్పుడు నీ వెనుక నుంచీ...”
“ఆ...నా వెనుక నుంచే చూస్తుంటాడు. ఉప్పూ కారం ఎంత వేస్తున్నాను, అంట్లు సరిగ్గా తోముతున్నానా లేదా అని! అంతే! ఇంకేం ఊహిoచుకోకు”
“పోనీ...కలిసి జలకాలాడ్డం లాంటివేవీ...?”
“అదొక్కటే తక్కువ! ఏదో....జరుగుతుందనుకుని బాత్రూం లోపల గడియ వేస్కోకుండా స్నానం చేస్తుంటే బయట గొళ్ళెం పెట్టాడు. నేను మర్చిపోయానేమో అనుకుని! అయిపోయిందే అంతా అయిపొయింది! నా జీవితంలో ఇక మధురానుభూతులకు చోటు లేదు! ఏదో పేరూ మొహం బావుందని చేస్కుంటే ఇదేం జీవితమే నాకు?”
“అబ్బా! ఎందుకే అంత బాధ పడతావ్? ఏం చేస్తున్నావిప్పుడు?”
“మైదానంలో పచార్లు కొడుతున్నాను”
“మరింకే! ఆ రాజేశ్వరిని చూసి నేర్చుకో”
“ఏవిటే...? నానింకా పెళ్లై ఆర్నెలేనే అయ్యింది!”         
“అబ్బా! లేచిపొమ్మని కాదు. మీరాని ఎంత ఆప్యాయంగా లాలనగా ప్రేమిస్తుందో చూశావా! ప్రతి మగాడిలో ఓ మీరా ఉంటాడే! నువ్వే ప్రేమానుభూతులంటే ఏంటో తెలియజెయ్యి” అని ఓ ఉపాయం చెప్పింది దీపిక.
మరుసటి రోజు శ్రేయస్ కాలేజికెళ్ళగానే మళ్ళీ మైదానంలోకెళ్ళాను. ఆత్రంగా నేను అమీర్ గుడిసె వైపు అడుగులేస్తున్నప్పుడు ఫోన్ చేసింది దీపిక.
“ఏంటే! నేను చెప్పింది చేశావా?”
“చేశాను”
“వావ్! అయితే ప్రయత్నం ఫలించిందన మాట!”
“కాస్తాగు! విను ముందు. నువ్వు చెప్పినట్టే శ్రేయస్ బోర్లా పడుకున్నప్పుడు అతని వీపు మీద నా చూపుడు వేలితో నా పేరులోని మొదటి అక్షరం రాశాను”
“ఆ..ఏమైంది? అదేంటో చెప్పాడా? నిన్ను కౌగిలించుకున్నాడా? ముద్దుల్లో ముంచేశాడా??”
“ఆ..ఆ..అక్కడే! ఇంకొంచెం కింద..ఇటు ఇటు..ఆ అక్కడే గట్టిగా గోకు అన్నాడే!”
“ఛీ...! చలం కాదు. మిమ్మల్నా సింహాచలమే కాపాడాలి!”
“మొన్నేదో చెత్త సినిమాకి తీస్కెళ్ళాడే. పది సినిమాల్లోంచి డెబ్బై సీన్లు కాపీ కొట్టి తీశారా సినిమా. టికెట్స్ బ్లాక్ లో ఒకటీ మూడొందలు పెట్టి కొన్నాడు కాబట్టి తెగ నచ్చిందనీ, గొప్ప సినిమా అనీ అంటున్నాడే. ఏ మాత్రం నిజాయితీ మనస్సాక్షి లేకుండా చెప్తున్నాడో చూశావా! ఒట్టి డబ్బు మనిషి. ఛ! ఒక సంగీతం వినడు, సాహిత్యం చదవడు! ”
“పోన్లే అదంతా వదిలేయ్. మళ్ళీ ఎక్కడికైనా టూర్ వెళ్ళిరండి. ఈసారి ఎలా అయినా ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడు”
“సర్లే! హనీమూన్ కి కేరళ వెళ్ళాం కదా! అందరూ ఫొటోస్ దిగుతూ, ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ మైమరచి పోతుంటే ఈయన గారు మాత్రం నాకు కేరళ పంచకర్మ ఆయుర్వేద చికిత్సల గురించి, అక్కడి కొబ్బరి చెట్ల వ్యాపార లావాదేవీల గురించి, మతాచారాలు, ఆహారపు అలవాట్ల గురించీ నిలబెట్టి ఉపన్యాసాలిచ్చాడు! కొంతమంది తనని టూరిస్ట్ గైడ్ అనుకుని సందేహాలు కూడా అడిగారు!”
“హహ్హహ్హ! నవ్విoచకే బాబు! పొట్ట చెక్కలైపోయేలా ఉంది. బాబోయ్! మీయాయనంత మెకానికల్ మొగుణ్ణి ఎక్కడా చూడలేదే”
“మరి రాజేశ్వరిని చూసి నేర్చుకోమన్నావుగా. శ్రేయస్ తో పెట్టుకుంటే మైదానాన్నే మెకానికల్ చేసిపడేస్తాడు!”
“అంతలేదు గానీ మైదానంలోకి మీ ఆయన్ని కూడా తీస్కెళ్లవే. అమీర్ రాజీని ఎంత ఉన్మాదంగా ప్రేమిస్తాడో చూపించు”
“అదీ అయ్యింది! మొన్న రాత్రి మూడు గంటలకి ఎందుకో మెలకువొచ్చి కళ్ళు తెరచి చూసి కెవ్వున కేక పెట్టాను! గుండె ఆగినంత పనైంది!”      
 “ఏమైందే? మీ ఆయన గాని నిద్రలో నాట్యం చేస్తున్నాడా?”
“అంత పని చేసినా బావుడ్ను! గుడ్లప్పగించి దెయ్యoలా నన్నే చూస్తున్నాడు! నా గొంతు తడారిపోయి ‘ఏంటని’ అడిగితే ‘నువ్వే చెప్పావ్ కదా అమీర్ రాజీని ఇలాగే రాత్రంతా చూస్తుండేవాడని’ అన్నాడు”
అప్పుడు దీపిక నవ్విన నవ్వుకి ఆకాశం రెండు ముక్కలైంది!
“వామ్మో! ఇంకా నయం! మధ్య రాత్రి నిద్ర లేపి ‘పద! హుస్సేన్సాగర్ కెళ్ళి స్నానం చేద్దా’మనలేదు!”
“సరే! అమీర్, రాజీ ఇప్పుడే గుడిసెలోంచి బయటకొస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడుతా.”
‘రాజేశ్వరి ఎంత అదృష్టవంతురాలు! ఒకరికి ఇద్దరూ రొమాంటిక్ ఫెలోసే దొరికారు! మా ఆయనా ఉన్నాడు ఛ!’ అనుకుంటూ రాజీతో పాటూ నేనూ మీరాని వెతుకుతుండగా...
కాలింగ్ బెల్ మోగింది. చూస్తే గుమ్మం నిండా నిలువెత్తు గులాబీ పూల బొకే! ఆశ్చర్యపోయి ఎవరై ఉంటారా అని హడలిపోయాను! ఈయన లేడు కాబట్టి సరిపోయింది! పూల వెనుక నుంచీ ఎవరో వస్తున్నారు...ఎవరై ఉంటారా అని ఆత్రుతగా చూస్తుంటే శ్రేయస్ వచ్చాడు! సరాసరి అంగారకుడి మీద నుంచి దిగిన గ్రహాంతర వాసిలా ఉంది నా పరిస్థితి! ఏమీ అర్ధం కాలేదు. నోటి వెంట మాట లేదు. కనురెప్ప వేయలేదు!
“ఐ లవ్ యూ బేబీ!” ఆ బొకేలోంచి ఓ పూవు తీసిచ్చాడు శ్రేయస్.
“ఈ రోజు నా పుట్టిన రోజు కాదు!” అన్నాను. ‘ఐ లవ్ యూ టూ’ చెప్పే అలవాటు లేక!
“అంతకంటే ముఖ్యమైన రోజు. నా ప్రేమని నీకు వ్యక్తపరిచే రోజు! మన పెళ్లైన ఈ ఆరు నెలల్లో నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో ఇప్పుడిప్పుడే అర్ధమౌతోంది! కానీ నాకివన్నీ కొత్త. రోజూ పొగడ్తల్లో ముంచెత్తడం, వళ్ళో పడుకుని ఊసులు చెప్పడం నాకు తెలీదు”
‘మరి ఇదంతా ఏంటి? ఎవరో రాసిచ్చిన డైలాగులు బట్టీ బట్టి చెప్తున్నాడా?’ మనసులో అనుకున్నా.
“నువ్వు చదివినిపించిన ‘మైదానం’ అర్ధo చేసుకోడానికి నేను సొంతంగా మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. ప్రేమను బయట పెట్టడం ఎంత అవసరమో తెలుసుకున్నాను. ఇన్నాళ్ళూ నేను ప్రదర్శించిన పశుకామానికి సిగ్గు పడుతున్నా. క్షమించు! నీ జీవితంలో నేనొక ప్లీడర్ మొగుడిగా కాక అమీర్ గా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాను. సరే ముందు పద లోపలికి”
“అదేంటి ఆఫీస్ లేదా?”
“సెలవు పెట్టాను...నీ కోసం!” నన్ను గట్టిగా కౌగిలించుకుని చెవిలో మెల్లగా చెప్పాడు.
శ్రేయస్ నన్ను కౌగిలించుకోడం అదే తొలి సారి! తను నాకు దగ్గరయ్యే కొద్దీ మా పలుకులు పలుచబడ్డాయి...మాటలు మూగబోయినా, తనువులు బిగ్గరగా సంభాషించుకుంటున్నాయి స్పర్శ భాషలో. వగల వాక్యాలు, ముద్దు మాటలు, పరవశ పదాలు, పులకిoతాక్షరాలు...ఆ వ్యమోహపు వలపుల వ్యాకరణం మనసు మైదానాన్ని అభ్యసించే వారికే బోధపడుతుంది!
మొత్తానికి మెకానికల్ మైదానంలా ఉండే నా జీవితం మల్లెల మైదానంలా మారిపోయింది.
‘చలమే లేకపోతే నేనేమైపోయేదాన్నో!’ అని అనిపించే లోపే శ్రేయస్ నా వీపు మీద దబీ దబీ మని తట్టి నిద్ర లేపే చప్పుళ్ళకి మత్తు వదిలిపోయింది.
     
                                                                              
                                                                                                                  -మానస ఎండ్లూరి
                                                                   27 March 2016, ఆంధ్రజ్యోతి ఆదివారం










2 comments: