నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

4 Jun 2016

అమ్మకో లేఖ

ప్రియాతి ప్రియమైన అమ్మకు,
నీ సుచిత్ర వ్రాయుట. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. నువ్వూ నాన్నా చెల్లీ అన్నయ్యా క్షేమంగా ఉన్నారని తలచుచున్నాను. ఈ నెల ఎనిమిది వేలే పంపుతున్నాను. వచ్చే నెల పదీ పదిహేను వేలు పంపడానికి ప్రయత్నిస్తాను. వసంతక్క ఇక్కడ నాకు చాలా సాయం చేస్తుంది. అప్పుడప్పుడు ఆమె దగ్గరే అప్పు తీసుకుంటున్నాను. చెల్లి ఫీజు కట్టేశారా? నాన్న ఆరోగ్యం ఏమైనా కుదుటపడిందా? అన్నయ్య తాగుడు మానేశాడా లేదా? అన్నయ్యను ఏదోక పనిలో పెట్టించండి. వసంతక్క, బుజ్జక్కల సాయంతో నేను ఎలాగైనా సరే ప్రయత్నం చేసి బయటకొచ్చే సాహసం చేస్తాను. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే నెల్లోనే ఇంటికొచ్చేస్తానమ్మా! మనూళ్ళోనే కూలో నాలో చేసుకుని మిమ్మల్ని పోషిస్తాను. అందరినీ అడిగినట్లు చెప్పమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకి తిను.
ఉంటానమ్మా
సుచిత్ర.    

“ఏంటో వసంతక్కా! వాట్సాప్, ట్విట్టర్ అని ఏవేవో వచ్చి ఉత్తరాల్ని సంక్షిప్త సమాచారాలుగా మార్చినా, కాగితం పెన్నూ తీసుకుని లేఖ రాయాలంటే మాత్రం మనకు తెలియకుండానే పాత పద్ధతిలోనే రాసేస్తాం కదా! మరీ ‘ఉభయకుశలోపరి’ అని రాయలేదులే!” నవ్వుతూ వసంతక్క చేతిలో ఉత్తరం పెట్టి పోస్ట్ చేయమని చెప్పాను.
“పింకీ...”
“అదిగో నన్నే పిలుస్తున్నారు! ఈ పేరుకి అలవాటు పడడానికి ఆర్నెల్లు పైనే పట్టింది. వస్తానక్కా. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అప్పుడే ఎవడికి కొంప ముంచుకొచ్చిందో! అక్కా! ఉత్తరం ఈ రోజే పోస్ట్ చెయ్యి. డబ్బులు కూడా ఇవ్వాళే పంపించు. మర్చిపోకు” రహస్యంగా చెప్పి లోపలికి నడిచాను.
“సరె సరే!” అనుకుంటూ వెళ్ళిపోయింది వసంతక్క.
చీర కుచ్చిళ్లు సర్దుకుంటూ గదిలోకెళ్ళాను. దేవుడి దయ వల్ల మనిషి బానే ఉన్నాడు! ఆరోగ్యంగా...శుభ్రంగా! ‘హమ్మయ్య’ అనుకుని “గంటా?” అని అడిగాను.
“రెండు గంటలు” అన్నాడు.
‘రెండు గంటలు ఏం చేస్తావురా బాబు! ఒక పక్క ఆకలికి నకనకలాడుతుంటే’ మనసులో తిట్టుకుంటూ మంచమ్మీద కూర్చున్నాను.
“నీ పేరేంటి?” నా చేయి అతని తొడ మీద పెట్టుకుంటూ అడిగాడు.
“పింకీ”
“అసలు పేరు చెప్పొచ్చుగా!” నవ్వాడు.
‘వామ్మో! వీడు కబుర్లు చెబితే కానీ పని కానిచ్చే వాడిలా లేడు! వచ్చిన పని చూస్కొని వెళ్ళొచ్చుగా. ఈ సోది మాటలెందుకు?’ అనుకుని “నా పేరు పింకీనే! రండి” అని ఆహ్వానించాను.
“హ్మ్! నాకు చాలా టెన్షన్స్ రా ఆఫీసులోనూ ఇంట్లోనూ. ఆ టెన్షన్స్ తగ్గాలంటే ఇది కావాలి. కానీ మా ఆవిడ ఒప్పుకోదు. నేనంటే కోపం తనకి”
“మందు అలవాటు లేదా?”
“అందరికీ మందు పనిచేయాలని లేదు గా”
చెత్త కబుర్లు చెబుతూ మొత్తానికి రెండు గంటలు పూర్తి కాకుండానే వెళ్ళిపోయాడు.

కొద్ది సేపటికి నేనూ సోనీ ఇడ్లీ తింటుంటే వచ్చి పక్కనే కూర్చుంది మహిత. అలవాటుగా ఇడ్లీ తన నోట్లో పెట్టబోతూ చూశాను. పెదవి చిట్లి, ముట్టుకుంటే రక్తం కారేటట్టుంది!
“ఏంటే? కొరికాడా?” కంగారుగా అడిగాం నేనూ సోనీ.
“వాడి మొహం! అంత రొమాన్స్ ఏడ్చిందా మగాళ్ళకి! నిజం తెల్సుకుని గోడకేసి కొట్టాడు. మూతి పగిలింది! హహహ” ఆమె నవ్వుకి రక్తం ఉబికి బయటకు కారుతోంది!
“నిజం చెప్పేశావా?” ఆశ్చర్యపోతూ అడిగింది సోనీ.
“వాడి మంచి కోసమే తొడుగు వేస్కోమని చెప్పాను. ససేమిరా వేస్కోను అని నా మాట బయటకు రాకుండా నోరు నొక్కి బలవంతంగా చేశాడు గాడిద కొడుకు! నన్ను వదిలిపెట్టాక చెప్పాను, ఇక మీ ఆవిడతో కలవకు నాకు ఎయిడ్స్ ఉందని. హహ్హహ్హ!! ఒక్క దెబ్బ కొట్టి మొహం మీద ఊసిపోయాడు.” పకపకా నవ్వుతూ చెప్పింది మహిత.

ఇవి మాకు రోజూ ఉండే గాధలే! మేమేం మాట్లాడుకుంటామో, ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో అన్నీ దళారీ, కాపలాదురుల కనుసన్నల్లోనే జరుగుతాయి. పెద్ద భవనం...వందల మందిమి ఉంటాం. అయినా నిత్యం ప్రతి ఒక్కరి మీదా ఒక కన్ను వేసే ఉంచుతారు.

వసంతక్క రాక నాలుగు రోజులౌతోంది. ఉత్తరం పోస్ట్ చేసిందో లేదో తెలీదు. ఇక్కడ నుంచీ ఉత్తరం మా ఊరు చేరడానికి మూడ్రోజులు పడుతుంది. అందిన రోజే అమ్మ జవాబు రాసి పోస్ట్ చేసినా, నాకు చేరే సరికి మరో మూడ్రోజులు. అది వసంతక్క చేతిలోంచి నా చేతిలోకొచ్చే సరికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో! అమ్మ చేతి వ్రాత కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో చెప్పలేను. ఒకే కప్పు కింద ఉన్నా వసంతక్కని కలవడం మాట్లాడడం అంత సులువు కాదు. ఆమె దగ్గర్నుంచి అమ్మ రాసిన ఉత్తరం తీసుకుంటూ దళారీల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు!

వసంతక్క భర్త చిన్న మెకానిక్. ఇద్దరు కవల పిల్లలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్తితి. భర్తకి ఎవరింట్లోనో పనికెళుతున్నానని చెప్పి ఇక్కడకొచ్చి డబ్బులు సంపాదించుకుని ఇంటికెళ్ళిపోతుంది. బుజ్జక్క కథ కూడా అంతే. అలాంటి ఇల్లాళ్ళు చాలామంది ఉన్నారిక్కడ. ఆ గోవింద్ గాడు నన్ను కిడ్నాప్ చేయకుండా ఉండుంటే ఎన్ని కష్టాలు పడి అయినా సరే ఈపాటికి చదువుకుంటూ ఉండేదాన్ని! ఛ!

ఇవన్నీ ఆలోచించుకుంటుండగా ఇద్దరు రావడం పోవడం జరిగిపోయాయి. ఇంతలో బయటంతా హడావుడి, అరుపులు! గబగబా చీర కట్టుకుని వెళ్లి చూసే సరికి హారికని ముగ్గురు మనుషులు ఎత్తుకుని వరండాలో మంచమ్మీద పడుకోబెట్టారు. పరుగు పరుగున హారిక దగ్గరికెళ్ళాను. చలనం లేకుండా పడుంది. భోరున ఏడుస్తూ ‘ఏమైందని’ అడిగాను చుట్టూ మూగిన అమ్మాయిలని. ‘ఉరి పోసుకుందని’ చెప్పారు మల్లికా, అనురాధ.
నిన్న మధ్యాహ్నమే నాతో చాలా దిగులుగా మాట్లాడింది హారిక. ఈ రోజు విగతజీవిగా మిగులుతుందని అస్సలు ఊహించలేదు. అందరం విషాదంలో మునిగిపోయాం.
“సచ్చి మంచి పని చేసింది ముండ! దాని ఏడుపు కొట్టు మొహంతో యాపారమే లేదు. పైగా తిండీ నీడ దండగ!” హారిక చావునీ ఆమె శవాన్నీ చీదరించుకుంటున్నాడో బ్రోకర్.
“రోజూ వీళ్ళ తిట్లూ దౌర్జన్యం పడలేకే ఆత్మహత్య చేసుకుందేమో!” కన్నీటితో అనింది పల్లవి.
“హారిక చనిపోయింది అందుక్కాదు. డిప్రెషన్ వల్ల” ముక్కు చీదుతూ అన్నాన్నేను.
“అదే మేమూ చెప్పేది. వీళ్ళు పెట్టే కష్టాలు తట్టుకోలేక బాగా డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకునుండొచ్చు” ప్రసన్న.
“అందుక్కాదు”
“మరి?” షీల
“రోజూ ఇదే పని చెయ్యడం వల్ల”
“అందరం చేస్తున్నాంగా!” గాయత్రి
“అందరికీ ఎయిడ్స్ లేదుగా! అలాగే, ఎన్నో రోజులుగా కొందరమ్మాయిలు ఇదే పనిలో ఉండడం వలన డిప్రెషన్ కి లోనవుతుంటారు. అది కొన్ని సార్లు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది కూడా. మన హారికకూ అదే జరిగింది. అమ్మాయిలని బలవంతంగా నాలుగైదు రోజుల పాటు బంధించి ఎక్కువ సార్లు అత్యాచారం చేసినప్పుడు కూడా వస్తుంటుంది. హారికలో అదే దిగ్భ్రాంతిని చూశాను. కాని ఇంత పని చేస్తుందనుకోలేదు”

“ఇళ్ళల్లో ఇలాంటివి లేవనుకుంటున్నారా? రెండేళ్ళ పాటు నా మొగుడూ వాడి ఫ్రెండ్స్ నన్ను పాడు చేసి ఐదు లక్షలకి ఇక్కడ అమ్మేశారు. ఆ రోజు నుంచీ ఇక్కడ ఎంతోమంది నన్ను పాడు చేస్తూనే ఉన్నారు. మనకో న్యాయం లేదు, చట్టం లేదు! నేను కూడా ఏదో రోజు హారికలా...” కుమిలిపొతూ చెప్పింది జోత్స్న.
“ఊరుకోవే” మాధురి.
ఇక్కడ అంతకంటే ఓదార్చడం జరగదు. అందరిదీ అదే పరిస్థితి. సాధారణంగా చెప్పే ఓదార్పు మాటలు ‘నీకు చాలా భవిష్యత్తుoది, నువ్వింకా జీవితంలో ఎన్నో మెట్లెక్కాలి...’ లాంటివేవి ఇక్కడ పనికి రావు.
“అందుకే! ఏదేమైనా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి!” కసిగా అన్నాను నేను.
“రాధికనేం చేశారో తెలీదా? పారిపోయిన దాన్ని తీస్కొచ్చి మూడ్రోజులు అన్నం పెట్టకుండా రోజుకి నలభై మందిని పంపారు! చావు దాకా వెళ్లి బతికింది. అయినా మనం ఇంటికి వెళితే స్వాగతం చెప్పడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు! మనం మాత్రం ఏం మొహం పెట్టుకుని వెళ్తాం? మనకున్న రోగాలు తెలిస్తే గుండాగి చస్తారు మనవాళ్ళు” స్రవంతి.
“మా అమ్మ నన్ను కచ్చితంగా రానిస్తుంది” కళ్ళు తుడుచుకుంటూ అన్నాను.
అందరూ నన్ను చూసి ఘొల్లున నవ్వారు!
“మా అమ్మ మీద నాకా నమ్మకముంది” పౌరుషంగా అన్నాను.
“అదే జరిగితే మాకూ సంతోషమే కదే!” హసీనా.

ఉన్నట్టుండి ఓ గదిలోంచి బేబీ మీద రంకెలు వేస్తున్న అరుపులు వినబడుతున్నాయి. మాకు ఇవేం కొత్త కాదు కాబట్టి విన్నా పట్టనట్టు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు గుర్తొచ్చింది బేబీకి రాత్రి జ్వరమొచ్చిందని! దానికి ఆరేళ్ళ వయసన్న చేదు నిజం మర్చిపోయేది కాదు కాబట్టి ప్రత్యేకంగా గుర్తుచేసుకోనవసరం లేదు! వెంటనే బేబీ దగ్గరకి వెళ్ళాను. ఓపిక లేక నిలబడలేకపోతుంది. దాన్ని బండ బూతులు తిడుతూ గదుముతున్నాడో దళారీ.
“ఏంటన్నా! పసిపిల్లకి జ్వరమొచ్చినా వెళ్ళమంటావ్. నిద్రపోనీ అన్నా. నేను వెళ్తాను”
“నీలాంటి దున్నపోతులు ఆయనకి పనికిరారు. దీనిలాంటి లేగ దూడలే కావాలి. పో ఇక్కడ్నుంచి”
“అన్నా! పాపమన్నా! చిన్న పిల్లన్నా! పోనీ వర్షని పంపించన్నా” బతిమాలాను.
“వర్షా? అది మొన్నే చాపెక్కింది కదే! అదీ పని చెయ్యదు. పో”
ఏ దేవుడికి మొక్కితే ఏ అద్భుతం చేసి బేబీని కాపాడుతాడు? జ్వరం వచ్చిన పసిపాప పడే వేదన చూసే కంటే శవమైన ముప్పైయేళ్ళ హారిక విముక్తిని పొందిందన్న ఆనందాన్ని ఆశ్వాదించడం నయమనిపించింది!

బేబీని గదిలోకి పంపాడతను…

ఆకలితో ఉన్న కౄర మృగాలు చిట్టెలుకను సైతం వదిలిపెట్టవు
కడుపు మాడిన రాబందు అంగుళం వానపామునీ వదిలిపెట్టదు
దాహంతో ఉన్న సింహం చీమ రక్తాన్నీ పీల్చగలదు
డొక్కలెండుకుపోయిన ఊరకుక్కకి చెత్తకుప్పలో పసికందైనా ఒకటే...పాడైన అన్నమైనా ఒకటే!
కానీ కామంతో మదమెక్కిన మగాడు అంతకు మించే హింసించగలడు!

ఏం జరగబోతుందో బేబీకి తెలుసు. ఇప్పటికీ ఎన్నో సార్లు అనుభవమే! నేను ఏడేళ్ళ వయస్సులో మురికివాడల్లో వరద పాములతో ఆడుకునేదాన్ని. బేబీ ఆరేళ్ళకే కోడెనాగుల్తో కాటేయించుకుంటుంది! నా మనసంతా స్తబ్దుగా నిలిచిపోయింది. దొంగ చాటుగా కిటికీలోంచి చూశాను. గౌను విప్పేసి బేబీని పడుకోబెట్టాడు. అతనికి నలభై ఐదేళ్ళ పైనే ఉంటాయి. మొహం పరీక్షగా చూశాను. రోజూ టీవిలో కనబడే మహానుభావుడు!
బేబీ జ్వరంతో వణికిపోతుంది...కళ్ళు తెరవడం లేదు. అతనూ నగ్నంగా బేబీని హత్తుకుని పడుకున్నాడు. ఈ నగ్న సత్యం చూడడం కంటే రోజూ అతను చెప్పే శ్రీరంగ నీతులు వినడం మేలేమో! సల సల కాలే  బేబీ ఒళ్ళంతా జ్వరం ముద్దులు పెట్టాడు. అలా కాసేపు కావలించుకుని పంపేశాడు. అప్రయత్నంగా మనసులో ఆ ‘ఘనుడి’కి దండం పెట్టి బేబీకి మాత్రలు వేసి పడుకోబెట్టాను.

చేతికి మందు రాసుకుంటూ వచ్చింది వసంతక్క ఇరవై రోజుల తరువాత.
“ఏమైoదక్కా? అరెరే సిగరెట్టా!”
“అవును రా!”
“మరి ఇంట్లో ఏం చెప్తావ్?”
“రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా??”
ఇద్దరం నవ్వుకున్నాం.
వసంతక్క ఇక్కడ నుంచీ నన్ను బయటకు తీసుకొచ్చే మార్గం గుసగుసగా వివరిస్తూ అమ్మ పంపిన ఉత్తరం నా చేతిలో పెట్టింది ఎవరూ చూడకుండా. అమ్మ ఇంత త్వరగా ఉత్తరం రాస్తుందని అస్సలు ఊహించలేదు. ‘నేను కూడా హారికలా చనిపోకూడదు! నా కుటుంబాన్ని పోషించాలి’ అనుకుంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆశగా ఉత్తరం చదవడానికి బాత్రూములోకెళ్ళాను.

ప్రియమైన సుచిత్రకి అమ్మ వ్రాయునది.
ఎలా ఉన్నావు తల్లీ? నాన్నకి రక్త పరీక్ష చేయించమన్నారు. ఆయన ఆరోగ్యం బావుండట్లేదు. అన్నయ్య నువ్వు పంపిన డబ్బుతో ఎవతినో తీసుకుని పారిపోయాడు. చెల్లి కాలేజీ ఫీజు కట్టనందు వల్ల పరీక్షలు రాయనివ్వలేదు. ఇంటి దగ్గరే సాయంత్రాలు పిల్లలకి పాఠాలు చెబుతోంది. కుట్టు మిషను అమ్మేసి కొంత వడ్డీ కట్టి, నాన్నకి మందులు, ఇంట్లో సరుకులు కొన్నాను. నువ్వొచ్చేస్తానని రాశావు. అది చదివిన దగ్గర్నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వొచ్చేస్తే చుట్టు పక్కలందరికీ ఏమని చెప్పాలి? కూలి పనితో ఎంతని సంపాదిస్తావమ్మా? పూట కూడా గడవదు! చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. నాన్నకి వైద్యం చేయించాలి. అప్పులు తీర్చాలి. నిన్ను ఎత్తుకెళ్ళిన వాడు ఒక రకంగా మనకి మంచే చేశాడు! మమ్మల్ని క్షమించి ఈ జన్మకింతే అనుకుని అక్కడే ఉండి డబ్బులు పంపించమ్మా! వచ్చే నెల పదిహేను వేలు పంపుతానన్నావు మర్చిపోకు. ఉంటానమ్మా.
ప్రేమతో,
అమ్మ.

ఉత్తరం భారంగా మడత పెట్టి చించేసి ఫ్లష్ చేశాను. ‘ఉత్తరం’ అనేది మన చేత ‘ప్రియమైన’ , ‘ప్రేమతో’ అనే పదాలను యాంత్రికంగా రాయిoచేస్తుంది. నిజంగా మనసులో అనుభూతి ఉన్నా లేకపోయినా.

నిస్సహాయంగా బయటకొచ్చి రహస్యంగా దాచిపెట్టిన డబ్బు తీసి వసంతక్క చేతిలో పెట్టాను. ఈ లంకంత భవనంలో  డబ్బు దాయడం మా అందరికీ పెద్ద సవాలు! జాకెట్టులో దాస్తే రోడ్డు మీద నోట్ల కట్టలు పరిచినట్టే. ఎవడు పడితే వాడు చేతులు పెట్టి వెతుక్కుంటాడు! అందుకే డబ్బులు పరుపులో పెట్టి కుట్టేస్తాను.

“అదేంటి? వచ్చే నెలలో ఎటూ మీ ఇంటికి వెళ్ళిపోతానన్నావు!? ఈ లోపే డబ్బు పంపించడం ఎందుకు?” అడిగింది వసంతక్క.
“నేను రావట్లేదక్కా. ఇక ఇక్కడే..!” శూన్యంలోకి చూస్తూ చెప్పాను.

నా ముఖంలో దిగులు చూసి అమ్మ ఉత్తరంలో ఏం రాసుంటుందో అర్ధం చేసుకుంది వసంతక్క. వచ్చిన పని పూర్తైపోయింది కాబట్టి స్వేచ్ఛగా ఇంటికి బయలుదేరింది. రోడ్డు మీదకు వెళ్ళిన వసంతక్క వెనక్కి తిరిగి మేడ మీదున్న నన్ను చూసింది. అవి జాలి చూపులనుకుంటానని అనుకుంటుందేమో వసంతక్క. ఇన్నాళ్ళూ ఆమె కేవలం నన్ను బయటకు తెస్తానని మభ్య పెడుతుందని నాకు తెలుసు! నన్ను అమ్మే అమ్మేసిందన్న పచ్చి నిజం కూడా నాకు తెలుసు!! కానీ ఏ మూలో కన్న ప్రేమ కరిగి నాకో అవకాశం ఇస్తుందని ఆశించి అమ్మకో లేఖ రాశాను. కాని అమ్మ కరగలేదు.

కన్న వెంటనే ఏ చెత్త కుప్పలో పారేసినా నేను చచ్చాక కుక్కలూ పందులూ పీక్కుతినేవి. ఈ మానవ కుక్కలకి అమ్మేశావు అమ్మా! రోజూ నన్ను బతికుండగానే చీల్చుకు తింటున్నారు! మురికి నీళ్ళతో నాకు లాల పోసి, నా ఆకలి కేకలకి జోల పాడి, నీ చీకిపోయిన చీర చింపి నాకు పైటేసినప్పటి నుంచీ ఉన్న పేదరికాన్ని ఒక్కసారిగా వచ్చిన నా వయసుతో కొనేశావమ్మా!

అమ్మ రాసిన ఉత్తరంతో ఈ సుచిత్ర మరణించింది! ఆ పేరు కేవలం మా అమ్మకు నేను రాసే ఉత్తరాల్లోనే కనిపిస్తుంది. ఇక ఎప్పటికీ వినిపించదు! నా చెల్లిని ఇక్కడ పొరపాటున కూడా చూడకూడదంటే నేను ఇక్కడే ఉండి తీరాలి.
“పింకీ...! ఎక్కడున్నావ్? త్వరగా రా! నీ గదిలో ఎదురు చూస్తున్నారు”
కాటుక చెరిగిపోకుండా కన్నీళ్ళని కళ్ళతోనే మింగి శాశ్వతంగా లోపలికి వెళ్ళిపోయాను...

                                    *****************
                -ఎండ్లూరి మానస

                            ‘చినుకు’ మాస పత్రిక
             జూన్ 2016















1 comment: