నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

22 Jul 2016

నటీనటులు

 రాంకుమార్ ఇంటి ముందు బండి ఆపి భారంగా గేటు వైపు అడుగులు వేశాడు మాధవ్.
నిరాసక్తిగా తలుపు కొట్టాడు. రాంకుమార్ భార్య ప్రజ్వల తలుపు తీసి నిండైన నవ్వుతో మాధవ్ ని లోనికి ఆహ్వానించింది...
మౌనంగా లోపలకొచ్చి కూర్చున్నాడు మాధవ్. తన ముoదిప్పుడు ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితిలో లేడు. కానీ నట్టింట్లో అదీ భార్య ముందే మందు సీసాలు, గ్లాస్లు, ఐస్ క్యూబ్స్, మంచింగ్ కి చిప్స్, చికెన్ ఫ్రై పెట్టుక్కూర్చున్న రాంకుమార్ ని చూసి ఒకింత ఆశ్చర్యపడకుండా ఉండగలడా మాధవ్!
“ఆ...రారా! ప్రజ్జూ...నే చెప్పాను కదా! నా చిన్ననాటి మిత్రుడు మాధవ్. వీడే. మళ్ళీ ఇన్నాళ్ళకి, నా ట్రాన్స్ఫర్ వల్ల కలుసుకున్నాం. ఓ సారి వీడి కుటుంబాన్నంతా మనింటికి భోజనానికి పిలవాలి”
నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకున్నారు ప్రజ్వల, మాధవ్.  
“తప్పకుండా! అసలు వదినగారిని కూడా తీసుకొని రావాల్సింది అన్నయ్య గారూ” అంది ప్రజ్వల.
“లేదమ్మా! బాబుకి పరీక్షలు...చదివిస్తోంది. ఈసారి తప్పకుండా తీసుకు వస్తాను” మాధవ్ కి ఓ స్త్రీ ముందూ మందు ముందూ ఒకేసారి కూర్చోవడం ఇదే ప్రధమం! అతని ఇబ్బందిని గమనించిన ప్రజ్వల ఏదో పనున్నట్టు లోనికి వెళ్ళిపోయింది.
వెంటనే రసపిపాసైన రాంకుమార్ గ్లాస్ లో బ్లెండర్స్ స్ప్రైడ్ ఓ సిక్స్టీ ఎంఎల్, నాలుగు ఐస్ క్యూబ్స్, కొద్దిగా సోడా వేసి లార్జ్ పెగ్ ఫిక్స్ చేస్తున్నాడు.
“ఏరా! నీ భార్య ముందే...! ప్రజ్వల గారు ఏమీ అనరా నిన్ను?” రెండు చేతులూ మోకాళ్ళ మధ్యలో నొక్కుకుంటూ అడిగాడు మాధవ్.
“మేం స్నేహితుల్లా ఉంటాం రా. ఒకరి ఇష్టాలకి ఒకరు అడ్డు చెప్పుకోం. ప్రజ్వల నాకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. కాకపోతే ఆరోగ్యరీత్యా చిన్న చిన్న హెచ్చరికలు జారీ చేస్తుంది అంతే”
“అదృష్టవంతుడివిరా! మీ దాంపత్యం చూస్తుంటే ముచ్చటేస్తోంది”
“ఏo? షామిలి నిన్ను ఇంట్లో తగనివ్వదా?” చికెన్ ఫ్రై నోట్లో పెట్టుకుంటూ అడిగాడు రాo.
“షామిలి ఎవర్రా బాబు? నా భార్య పేరు కోమలి”
“ఆ! అదే అదే. ఏడాదికోసారి ఫోన్ చేసేవాడివి. ఎక్కడ గుర్తుంటాయి పేర్లు”
“ఏమన్నా అంటే ఇలా అంటావ్. నువ్వేమో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటూ బిజీగా ఉంటావ్. పద్దాకా ఏo చేస్తాo”
“మరి కస్టమ్స్ లో సూపరింటెండెంట్ అంటే అంతేరా” రెండో పెగ్ ఫిక్స్ చేస్తూ అన్నాడు రాo.
మాధవ్ చేసే చిరుద్యోగం మీద చురకలు వేసినట్టుగా ఉన్నాయి రాo మాటలు. మాధవ్ మొహం చిన్నబుచ్చుకున్నాడు. నెలకోసారి తన వీధి చివరి బెల్టు షాప్ లో భార్యకి తెలియకుండా చీప్ లిక్కర్ కొనుక్కొని రోడ్డు మీదే గడగడా సీసా ఖాళీ చేయడం కంటే ఇలా అవమాన పడుతూ దర్జాగా సంపన్నుడింట్లో ఖరీదైన మందు తాగడం లోలోపల సంతోషంగానే ఉంది మాధవ్ కి.
“ఇంతకీ ఎలా సాగుతోంది రా నీ ఉద్యోగం, సంసారం, పిల్లలు...వగైరా?” చిప్స్ తింటూ అడిగాడు రాo.
“బానే ఉందిలే. కొడుకు రెండో తరగతి”
“ఒక్క కొడుకేనా? మళ్ళీ ఏం ఆలోచించలేదా?”
“కోమలికి సిజేరియన్ అయ్యింది రా. ఇక వద్దంది”
“అయితే? ప్రజ్వల కూడా మా ముగ్గురు పిల్లల్ని సిజేరియన్ మీదే కనింది. నేనంటే చాలా ప్రేమనుకో తనకీ! అయినా నువ్వు తిన్నగా ఏడవలేదా? మనకింకో పాపో బాబో ఉండాలని. ఇంట్లో అంతా ఆవిడ పెత్తనమేనా?”
మాధవ్ కి తనలోంచి ఏదో పోతున్నట్టు అనిపించింది...అదే పరువు! మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలి.
“నువ్వంటే పెద్ద ఉద్యోగస్తుడివి. నాకు ఒక్కడితోనే ఇబ్బంది”
“ఓ అదా! అలా అయితే పర్లేదు. ఈ మందు పార్టీ కూడా మీ ఇంట్లో వద్దన్నావుగా! నేనింకా నువ్వెక్కడ పెళ్ళాం కొంగుబట్టుకు తిరిగేవాడివో అని హడలి చచ్చాను”
“ఛీ..నేనెంత చెప్తే అంతే! నా ముందు మాట్లాడడానికే భయం దానికి. కాకపోతే ఇలాంటి ‘మందు పాతరలు’ ఇంట్లో  పేల్చాంటే నాకే ఇష్టం ఉండదు. కొడుకుంటాడు కదా”
“హహ్హహ్హ! అవున్లే. బంగారం...ఆమ్లెట్స్ పట్రా” వంటగది లో ఉన్న ప్రజ్వలకి వినబడేలా పెద్దగా చెప్పాడు రాం.
“చికెన్, చిప్స్ ఉన్నాయ్ కద రా! మళ్ళీ ఎందుకు పాపం శ్రమ పెడతావ్”
“పర్లేదు లేరా”
ప్రజ్వల అరక్షణంలో తీస్కొచ్చింది.
“బంగారూ! నిన్ను శ్రమ పెట్టేస్తున్నాని అంటున్నాడు మాధవ్” చిరు నవ్వుతో ప్రజ్వలని చూస్తూ అన్నాడు రాం.
“ఏంటమ్మా?చేయి కాలిందా?” తెచ్చిన ఆమ్లెట్ టీపోయ్ మీద పెడుతున్నప్పుడు ఆమె వేళ్ళు చూస్తూ అడిగాడు మాధవ్.
“అవునన్నయ్య గారు! వంటింట్లో” జవాబిచ్చి వెళ్ళిపోయింది ప్రజ్వల.
“ఏరా?నువ్వు గాని వాత పెట్టావా?” భుజాలూగి పోయేలా నవ్వుతూ అడిగాడు మాధవ్.
“హహ్హహ! అవును. మొన్నోసారి విడాకులిస్తానంది. అప్పుడు” పరిహాసం చేశాడు రాం.
ఇప్పుడు రాంకి నాలుగో పెగ్, మాధవ్ కి ఐదో పెగ్ నడుస్తోంది. మాధవ్ కి ఒక్కో గుటకా పడేకొద్దీ సమయం ఎలా గడిచిపోతోందో తెలియట్లేదు. ఇంటికి ఆలస్యంగా వెళితే బండ బూతులు తిట్టి, పది జన్మలకు సరిపడా శాపనార్ధాలు పెట్టే భార్య గుర్తుకు రావడంలేదు! వచ్చేవారం ఆమె తెమ్మన్న డైనింగ్ టేబుల్ గానీ, తేకపోతే నడి బజార్లో నిలబెట్టి పరువు తీస్తానన్న బెదిరింపు గానీ, తనను గృహహింసకు గురి చేస్తున్నాడని పెట్టిన తప్పుడు కేసు వెనక్కి తీస్కోవాలంటే పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలన్న షరతు గానీ, తాను కేవలం ఒక చిరు నెలజీతగాడిననే చేదు నిజం గానీ గుర్తుకు రావడం లేదు. ప్రాణానికి ప్రాణమైన కొడుకూ గుర్తుకు రావడం లేడు. ఎదురుగా రాం ఉన్నా, మాధవ్ ఇప్పుడో ఒంటరి వాడు. సీసాలు, గ్లాసులతో పాటు మనసూ ఖాళీ అవుతోంది...
“వచ్చే ఆదివారం అందరూ భోజనానికి రావాలి రా” రాం మాటలు తడబడుతున్నాయ్. మందెక్కువైంది.
ఎర్ర బడిన కళ్ళతో మొహం పైకెత్తాడు మాధవ్. రాం కంటే ముందు అతని వెనుకున్న గోడ గడియారం చూశాడు. ఒంటి గంట అవడానికి పది నిమిషాలుంది!! చివాలున లేచి నిలబడ్డాడు మాధవ్.
“ఏంట్రా? ఏమైంది?” తూగుతూ అడిగాడు రాం.
“రేయ్! చాలా టైం అయ్యింది. నేను బయల్దేరుతాన్రా” జేబులోంచి బండి తాళాలు తీస్తూ కంగారుగా అన్నాడు మాధవ్.
“ఉండరా! ఈ రౌండ్ పూర్తి చేసి వెళ్ళు. నీ వాలకం చూస్తుంటే పెళ్ళాం చేతిలో తన్నులు తినేవాడిలా ఉన్నావే” తాగిన మైకంలో వెక్కిలిగా నవ్వుతూ అన్నాడు రాం.
“దానికంత లేదు గానీ నేను వెళ్తాన్రా బాబు!” పరుగు పెట్టబోయాడు మాధవ్.
“ఆగరా! రేపు మా ఫ్రెండ్ ఒకడు అమెరికన్ విస్కీ ‘జాక్ డేనియల్స్’ తెస్తున్నాడు. రేపు సాయత్రం వచ్చేయ్”
పెళ్ళికి ముందు నుంచీ నిన్నటి వరకు మాధవ్ తాగిన అతి ఖరీదైన మందు మాన్షన్ హౌస్ బ్రాందీ. ఓం ప్రధమంగా తాగిన సీసాని ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టుకున్నాడు. పేరు వినడం తప్ప కానీసం మొహం కూడా చూడని ‘జాక్ డేనియల్స్’ని కలుసుకోవాలని, కళ్ళారా చూసి, మనసారా హత్తుకుని, నోరారా తాగాలని ఉవ్విళ్ళూరుతూ వెళ్ళిపోయాడు మాధవ్.
చిన్నప్పుడు జీలుగ కల్లు, ఇప్పసారాతో మొదలైన పాన ప్రయాణం ఇప్పటికి విస్కీ దగ్గరకొచ్చింది. ఇక ఏంటిక్విటీ దాటి బ్లూ లేబుల్ స్కాచ్ దగ్గరికి ఎప్పుడు చేరుకుంటాడో! జీతం కటింగ్స్ చూస్తే నాటు సారాకి పడిపోయే రోజు వస్తుందేమోనని భయం పట్టుకుంటుందతనికి. ఎక్కడ్నుంచి ఎక్కడికి పడ్డా ప్రయాణం మాత్రం ఆగదు!
రాం కుమార్ తలుపులేసి, బెల్టు తీస్తూ లోపలికి నడుస్తుండగా బెల్ మోగింది. చూస్తే మాధవ్!
“ఏంట్రా మళ్ళీ వచ్చావ్?”
“ఒరేయ్! కొంచెం సాయం చేయరా. ఇంత రాత్రి వెళ్ళాలంటే భయంగా ఉంది. చాలా ఎక్కువ తాగేశాను. అసలే దారి దోపిడీలు కూడా ఎక్కువయ్యాయి. నా బండి రేపొచ్చి తీస్కెళతాను. నన్ను ఇంట్లో దిగబెట్టరా”
మాధవ్ మాటలు పూర్తయ్యేలోపే రాం కళ్ళల్లో అతనొక పురుగయ్యాడు.
“ఛీ యదవ! మగ పుట్టుక ఎలా పుట్టావ్ రా? భయమంట భయం! ఇంట్లో కూర్చోక ఎందుకొచ్చావ్ మరి? ఇప్పుడు నా వల్ల కాదు కానీ, వచ్చి పడుకో. మీ ఆవిడకి ఫోన్ చేసి రేపొద్దున్నొస్తానని చెప్పు”
“అమ్మో! వద్దు. ప్లీజ్ రా రా” బతిమిలాడాడు మాధవ్”
“నాకేదో అనుమానంగా ఉంది. నీ పెళ్ళాం నిన్ను బాగా కాల్చుకు తింటుందని”
“నువ్వెళ్ళి పడుకో. నేను వెళ్తాలే” బండారం బయటపడే లోపే వెళ్ళిపోవడం మంచిదనుకుని బిక్కు బిక్కుమంటూ ఇంటికి చేరుకున్నాడు మాధవ్.
ప్రజ్వల ఒంటి మీద బెల్టు దెబ్బలు వాతలుగా పడుతున్నాయి!! తట్టుకోలేక ఆర్తనాదాలు పెడుతోంది. భయంతో వారి ముగ్గురు పిల్లలు ఒకరినొకరు పట్టుకుని వణికిపోతున్నారు…
ఇంటి నిండా లైట్లు, గుమ్మం బయట జనం మధ్యలో కోమలి పెడుతున్న పెడబొబ్బలు చూసి మాధవ్ గుండె గుభేలుమంది! రాత్రి ఒంటి గంట దాటే సమయంలో తన ఇంటి ముందు ఈ గలాటా రేపు ఏం విపత్తు సృష్టిస్తుందో ఊహించుకోడానికే ఆందోళనగా ఉందతనికి. అయినా మాధవ్ ని తొక్కి నార తియ్యడానికి కోమలికి ఏ వేళైనా శుభసమయమే!
“ఏమే? ఆమ్లెట్లు క్షణంలో ఎలా తెచ్చావే? ముందే వేసి పెట్టావు కదూ!” నేల మీద కూలబడిన ప్రజ్వల వీపు పై కాలితో తన్నాడు రాం.
“అవునండీ!” దుఃఖంతో మిళితమైన స్వరంతో అస్పష్టంగా చెప్పింది ప్రజ్వల.
“నా మొగుడు దేన్నో తగులుకున్నాడు బాబా...య్! ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు! నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను! పెళ్లైన్నాటి నుంచీ సుఖసంతోషాలకి నోచుకోలేదు పిన్నీ” కోమలి అరుపులు, ఏడుపులు మిన్నంటుతున్నాయి…
“సరిగ్గా చెప్పవే! వాడితో తెగ తిప్పుకుంటూ వాగావు కదా” ప్రజ్వల గొంతు పిసుకుతూ అడిగాడు రాం.
“మీరు అడుగుతారని, ముందే వేసి పెట్టానండీ” అతి కష్టం మీద మాటలు కూడబలుక్కుని చెప్పింది ప్రజ్వల.
“ఒకవేళ నేను అడక్కపోతే?”
“ప్రతిసారీ అడుగుతారు కదండీ”
“నోర్ముయ్! పీక తెగ్గోస్తాను” ప్రజ్వల నుదురుని గోడకేసి కొట్టాడు రాం.
“రోజూ తాగేసి పక్కలోకొస్తాడండీ అతను. మొగుడే కదా అని సర్దుకుపోతున్నాను. ఇప్పుడు తాగేసి దేం దగ్గరికో వెళ్ళొచ్చాడు” ఏడ్చి ఏడ్చి కోమలి గుండెలవిసిపోతున్నాయ్.  
“ఏవయ్యా? ఇంత రాత్రి వరకు పెళ్ళాన్నీ పిల్లోడ్ని వదిలేసి ఎక్కడికెల్లావ్? భార్య మీద కాకపోయినా పిల్లోడి మీదన్నా ధ్యాస ఉండాలి కదా?” ఓ లోకి.
“నిజం చెప్పు! నేను లేనప్పుడు వాడొచ్చాడు కదూ”  సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు రాం.
“ఛీ! లేదండీ. ఆయన్ని ఇందాకేనండి మొదటిసారి చూడ్డo”
“మరి అంతలోనే నీ వేళ్ళు కాలాయని ఎలా అడిగాడే? నేనే కాల్చానని చెప్పావ్ కదూ”
ప్రజ్వల జుట్టు రాం అరచేతి మొత్తం చుట్టుకుంది. కుదుళ్ళలోంచి వెంట్రుకలు వేరయ్యేంతగా పట్టుకు పీకుతున్నాడు...ఆమె చేతి వేళ్ళు అతని కాలి కింద విరిగిపోతున్నాయి. అతను మోకాళ్ళతో పొడిచే పోట్లకి  ఆమె వెన్నెముక తాళలేకపోతోంది. సిగరెట్ పొగ సూటిగా ఆమె ముఖం మీదకి వదిలాడు.
“చెప్పవే వాడితో కలిసావ్ కదూ? వాడు నీకు ముందే తెలుసు!” రాం రాక్షసుడయ్యాడు.
భార్యను ఇంట్లోకి లాక్కొచ్చి తలుపులు వేశాడు మాధవ్.
“నన్ను అందరి ముందు నుంచీ ఈడ్చుకొచ్చి తలుపులేస్తావా? అంత ధైర్యం వచ్చిందా నీకు! దేంతో తిరిగొచ్చావ్ ఇప్పటి దాకా?” కోమలి అబద్ధపు కన్నీళ్ళు అరక్షణంలో ఆవిరైపోయాయి.
మధుపానాన్ని తప్ప ఏ ప్రేయసినీ ఎరుగడు మాధవ్. అతను సుశీలుడని ఎంత వాదించుకున్నా కంఠశోష తప్ప ఉపయోగం ఉండదు. నిశ్సబ్దంగా వెళ్లి పడుకున్నాడు. ఇలాంటి గొడవలు, కేకలు అలవాటే అతనికి. అందుకే ఒక్క నిమిషంలో నిద్ర పట్టేసింది. కానీ రెండో నిమిషంలో బకెట్ నీళ్ళు సరాసరి నెత్తి మీద పడడం మాత్రం కొత్తే! గబుక్కున లేచి చేతుల్తో ముఖం తుడుచుకుని శాంతంగా కోమలి వైపు చూశాడు.
“రావే లోపలకి” ఈడ్చుకుంటూ ప్రజ్వలని పడగ్గదిలోకి లాక్కెళ్ళాడు రాం.
ఏనుగు కాలి కింద చీమని నలిపినట్టు ఆమెను ఘోరంగా అత్యాచారం చేసి నిద్రలోకి జారుకుంటూ పెద్దగా గురకపెట్టడం మొదలుపెట్టాడు రాం. ప్రజ్వల గాయాలతో బాధగా లేచి జాకెట్ సర్దుకుని, చీర కుచ్చిళ్లు పెట్టుకుంటుండగా అసహ్యమైన కంపుతో పెద్ద శబ్దం వినబడింది. రాం నిద్రలో మంచం మీదే ఒంటికీ రెంటికీ వెళ్ళాడు.
కోమలి మాధవ్ మీదకి విసిరిన బకెట్ కిందపడి రెండు ముక్కలైంది.
“ఉన్న ఒక్క బకెట్ కూడా విరగ్గొట్టావ్ దరిద్రుడా! కొడుక్కి ఫీజు కట్టలేవు నీకెందుకురా పెళ్లి, సంసారం? రేపు పొద్దున్నే వాడ్ని తీస్కొని నా దారి నేను చూస్కుంటాను. నిన్ను వదిలిపెడతాననుకోకు! రెండు రోజుల్లో నిన్ను బొక్కలో తోయించకపోతే నా పేరు కోమలే కాదు” చక చకా కొడుకు బట్టలు, తన బట్టలు సర్ది పడుకుంది కోమలి.
కోమలి బెదిరింపులు పాతవే అయినా ఈ సారి ఆమె గొంతులోని కాఠిన్యం తన నిర్ణయం ఎంత దృఢంగా ఉందో తెలియజేసింది. భార్య బాధపెడుతున్నా, కొడుకులో ఆనందం వెతుక్కుంటూ కాలం వెళ్ళదీస్తున్న మాధవ్ ని జైలు ఊచల కన్నా, కన్న కొడుకు దూరమైతే ఇంకెవరి కోసం బతకాలన్న ఆలోచనే ఊపిరాడనివ్వడం లేదు. కిందటేడాది కొడుకుని ఏడు నెలలు కలవనివ్వలేదు కోమలి! కొడుకు ఎలా ఉన్నాడో తెలియక, వాడ్ని చూడకుండా ఉండలేక ఆ ఏడు నెలలు మాధవ్ పడ్డ నరకం వర్ణనాతీతం!
ఆసుపత్రి పడక మీద జబ్బు పడ్డ మొగుడి వాంతిని దోసిట్లో పట్టుకున్నంత సులువు కాదు తాగిపడున్న వాడి మల మూత్రాల్ని శుభ్రం చేయడం! అప్పటిదాకా ఊపిరి బిగబట్టుకున్న ప్రజ్వల ముక్కూ నోరూ మూసుకుని బయటకు పరుగెత్తి ఒక్కసారిగా కక్కుకుంది. నోరు కడుక్కుని వంటగదిలోకెళ్ళి పై అరలోంచి మాత్రలు తీసింది. అవి వాంతులు ఆపేవి కావు, ప్రాణాలు తీసేవి!
మాధవ్ ఫ్యాన్ కి ఉరితాడు బిగించి సిద్ధం చేసుకున్నాడు! అతని ఆఖరి శ్వాస తీసుకునే ముందు కొడుకుని మనసారా చూసుకుని, వాడి పాదాలని గుండెలకు హత్తుకుని, ముద్దు పెట్టుకుందామని వెళ్ళాడు.
ప్రజ్వల చేతినిండా మాత్రలు తీసుకుని మంచి నీళ్ళ సీసా మూత తీసి గొంతులో నీళ్ళు పోసుకుని తన దేహ వృక్షాన్ని ఆఖరి సారి తడుపుకుంది. మాత్రలు ఒక్కొక్కటిగా ఆమె నోటిలోకి వెళుతున్నాయి...
మాధవ్ కొడుకు తల్లి నడుం మీద ఓ కాలు, భుజం మీద ఓ చేయి వేసి ఆమె గుండెల్లో మొహం దాచుకుని నిద్రపోతున్నాడు. వాడ్ని తాకడం కష్టం! పోయేముందు కూడా కోమలి శాపాలు విని పోవడం ఇష్టం లేదు మాధవ్ కి. తిరిగి తన మరణ ద్వారానికి వచ్చాడు. అతని కాళ్ళూ చేతులు వణకడం లేదు. స్థిరంగా ఉన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. గుండెల్లో ముళ్ళు దిగుతున్నా కళ్ళల్లో కన్నీళ్ళు లేవు.
మగాడు కదా! ఏడవకూడదు, భయపడకూడదు, సిగ్గుపడకూడదు అని తల్లిదండ్రులూ, కుటుంబం, సమాజం నేర్పిస్తూ వచ్చాయి. అతని చావుకి వాళ్ళు కూడా బాధ్యులవుతారన్న వాస్తవాన్ని మటుకు ఎప్పటికీ వారు తెలుసుకోలేరు. తెలిసినా ఒప్పుకోలేరు!
‘మగాడంటే బాగా చదువుకోవాలి! ఆడపిల్లకి చదువెక్కకపోయినా చదువుకున్న వాడికిచ్చి కట్టబెట్టొచ్చు. మరి మగపిల్లోడే చదువుకోకపోతే ఎలా?’ ఇదే మాధవ్ కి ఎదురైన మొదటి వత్తిడి.
‘కౌంటర్ దగ్గరకెళ్ళి ఏ ట్రైన్ ఏ టైంకుందో కనుక్కోడానికి భయమేంట్రా ఆడపిల్లలా!?
కొత్త వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గు పడతావేరా? మగాడిలా ధైర్యంగా ఉండాలి!
ఛీ! సినిమాలు చూసి ఏడుస్తున్నావా? ఆడంగివాడంటారు రా!
నీలో ఎన్ని ‘మార్పు’లొచ్చినా నిక్కరు తర్వాత ప్యాంటు మాత్రమే వెయ్యాలి. నీకు పొరపాటున ‘గే’లిగింతలు ఉన్నా చచ్చినట్టు ఆడదాన్నే పెళ్ళిచేసుకు చావాలి!
మగాడంటే బాగా సంపాదించాలి. కుటుంబాన్ని ఓ మోస్తరు హీమాన్ లా సంరక్షించాలి!
కుళాయి రిపేర్ వస్తే పెళ్ళాన్ని పంపించి ప్లంబర్ ని పిలిపిస్తావేరా చవట!
పద్దాక నీరసం, నడుం నొప్పి ఏంటి? ఆడదానిలా నెల నెలా అవుతావా ఏం?!
కుటుంబానికి యజమాని అంటే ఏవిటనుకున్నావ్ మరి! గంభీరంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అయినా మగవాడు అమాయకంగా ఉండడమేంట్రా విడ్డూరం కాకపోతేను
ఎలా అయితే మగాడుండాలని చెపుతూ పెంచారో మాధవ్ ప్రవర్తన, ఆలోచనలు దానికి వ్యతిరేకంగా పెరిగాయి. భయస్తుడయ్యాడు, సిగ్గరి అయ్యాడు, కంగారుపడతాడు, తికమకపడతాడు, తడబడకుండా మాట్లాడలేడు, వీధికుక్కలని చూసి జ్వరం తెచ్చుకుంటాడు, తెలివి తక్కువ పనులు చేస్తాడు, ప్రేమిస్తాడు కాని వ్యక్తపరచలేడు, నిజాయితీగా ఉంటాడు కాని సంతోషపెట్టలేడు, కొడుకంటే ప్రాణమిస్తాడు కానీ తనువు చాలించకుండా ఉండలేడు!
ఏడుపొస్తే ఏడవలేక, భయమేస్తే చెప్పుకోలేక ప్రతిరోజూ మరణిస్తూనే ఉన్నాడు మాధవ్! ప్రతి పరిచయం తనొక ‘పోకిరీ వెధవ’ కాదని నిరూపించుకోడంతోనే మొదలైయ్యేది! వయసులో ఉన్నప్పుడు కొంటె వేషాలేసిన ఆడపిల్లల తండ్రుల సైతం సాటి మగపిల్లోడ్ని ఉత్త పుణ్యానికే ‘చెత్త నా కొడుకు’ అని అక్షితలు వెయ్యందే ఊరుకోరుగా! ‘మగవాడి అధైర్యం చూసి పుట్టాల్సింది జాలి కాదు, ఎగతాళి!’ అని ఉద్దేశించే సమాజం ముందు తానొక సూడో మేల్ షావనిస్ట్ లా అబద్ధాలతో నటిస్తూ బతకడం అలవాటు చేసుకున్నాడు మాధవ్!    
ప్రజ్వల నోట్లోని మాత్రలు గొంతులోకి కాక చెతకుప్పలోకి ఎగిరిపడ్డాయి! అరచేతిలోని మాత్రల్లో తన ముగ్గురి పిల్లల ముఖాలు కనబడ్డాక ఇక ఎలా మింగగలదు?
మాధవ్ గొంతు చుట్టూ ఉరి బిగుసుకుంది. విలవిలాకొట్టుకుంటూ తన పాత్రను పోషించలేని నటుడిగా ఈ రంగస్థలం వదిలి కన్ను మూశాడు.  ‘జాక్ డేనియల్స్’ ని కలవకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
లోకం ముందు మొగుడితో పాటు కలిసి ప్రదర్శించే నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది ప్రజ్వల. ఆ క్షణమే ఇతరుల ముందు రాం కుమార్ ఎంతో ప్రేమగా చూసుకునే భార్య పాత్ర ముగింపుకొచ్చింది!   
పిల్లల సామాను, తన బట్టలు, సర్టిఫికెట్స్, ఐడి కార్డ్స్, తన విలువైన వస్తువులు, సర్దుకుని తన ముగ్గురు పిల్లలతో అర్ధ రాత్రి రోడ్డెక్కింది. ఒంటరిగా పిల్లలను చూసుకోగల మనోధైర్యం, తెగింపు ఉన్న ప్రజ్వలగా కొత్త పాత్ర పోషించడానికి సిద్ధపడింది.                                                                                  
***********                        -మానస ఎండ్లూరి
జూలై 2016                             
కహానియా తెలుగు వెబ్ వేదిక




4 comments:

  1. Thank-you very much manasagaru..for your unbiased writing.cruelity,bad behavior exists in both genders .as a man of teetotaler I often wonder how women of any culture bare the drunkard husbands on their bed.socitey feel very shy to discuss those things but its very important to develop proper manners in bedroom too. Coming to that madhav wife's character too exists in our society but unfortunately because of the generalisation theory any women is getting sympathy irrespectively of the behavior and attitude but you showcased two charactes very well.a ll the best for your further writings

    ReplyDelete