నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

11 Mar 2016

మెర్సీ పరిశుద్ధ పరిణయం

"విక్టర్ అను నీవు; మెర్సీ అను ఈ స్త్రీ ని; వివాహము చేసుకొనుటకు దేవుని యెదుట సమ్మతించుచున్నావా?”

“సమ్మతించుచున్నాను!”
“మెర్సీ అను నీవు; విక్టర్ అను ఈ పురుషుని; నీ భర్తగా స్వీకరించి, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించెదవా?”
“......”
“జీవించెదవా?”
“జీవిం...చెదను”
పాస్టర్ గారు వరుడు విక్టర్ చేతికి పవిత్ర మంగళ సూత్రాన్ని అందించి మూడు ముళ్ళు వేయిస్తూ పెళ్లి ప్రమాణాలు చెప్పిస్తున్నారు...
“విక్టర్ అను నేను, మెర్సీ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైననూ, కీడుకైననూ, కలిమికైననూ, లేమికైననూ, ఆరోగ్యమందును, అనారోగ్యమందునూ, నిన్ను ప్రేమించి, సంరక్షించుటకై, నా భార్యగా చేసుకొనుచున్నాను.”
చర్చి గంటలు నవ దంపతులను దీవిస్తూ లయాత్మకంగా మొగుతున్నాయి...
సంఘస్తులందరూ లేచి నిలబడి వధూవరులను ఆశీర్వదిస్తూ పెళ్లి పాట అయిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఆలపిస్తున్నారు...
“మంగళమే యేసునకు...మనుజావాతారునకు...మనుజావాతారునకు శృంగారా...ప్రభువునకూ...శృంగారా ప్రభువునకూ...క్షేమాధిపతికి మంగళమే...”
***              ***              ***              ***   
కొన్ని వారాల క్రితం ఓ ఆదివారాన...
‘శిలువ బెల్టు’ పాస్టర్ గా పేరు పొందిన కృపానందం గారు వాక్యం మొదలుపెట్టారు. ఆయన పెద్ద పొట్ట కింద కనీ కనబడకుండా దాక్కున్న బెల్టు బకెల్ మీద ఉండే శిలువ బొమ్మే ఆయన ఆహార్యంలోని ప్రత్యేకార్షణ! అందరూ ఆయన్ని  ‘శిలువ బెల్టు పాస్టర్ గారు’ అని పిలవడం అలవాటు చేస్కోడంతో ఆయన అసలు పేరు మరుగున పడింది!
ఆయన ఇంటి మేడ మీద టెంట్ వేసి, దాన్నే ప్రార్ధనా మందిరంగా మలిచి దైవసేవ చేస్తున్నారు. అక్కడికి వచ్చేవారంతా పేద క్రైస్తవులు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులు. ముందు వరుసలో సంఘ పెద్దలు, తరువాత వయో వృద్ధులు, వారి వెనుక మధ్య వయస్కులు, ఆఖరిగా యౌవనస్తులు కూర్చుంటారు. స్త్రీలు ఎడమ వైపు, పురుషులు కుడి వైపున కూర్చుని మొత్తంగా పాతిక మందికి మించని సంఘం అది!
మైకు కూడా అవసరం లేని మందిరంలో శిలువ బెల్టు పాస్టర్ గారు గట్టిగా
“మూడవ కీర్తన, ఏడవ వచనము చూసినట్లైతే...” అని అలా అన్నారో లేదో ఇలా సంఘస్తులందరూ గబగబా బైబిలు పేజీలు తిరగేయడం మొదలు పెట్టేశారు. పాస్టర్ గారికంటే ముందే ఆ వాక్యాన్ని అందుకోడం ప్రతి ఒక్కరికీ ఓ గెలుపు! గర్వం! పోటాపోటిగా అధ్యాయాలూ, వచనాలు వెతుకుతున్నారు...ఆఖరిలో కూర్చున్న విక్టర్ అందరినీ ఓడించి వాక్యం పెద్దగా చదవడం మొదలుపెట్టాడు.
“యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరిని దవడ యెముక మీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టు వాడవు నీవే”
సాధారణంగా మధ్యవయసులో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ‘పోటీ’లో పాల్గొనడం, గెలవడం జరుగుతుంటుంది. కానీ వయసులో ఉన్న విక్టర్ అందరిముందూ సిగ్గుపడకుండా చదివాడంటే...ఎవరి మెప్పు కోసమో అయ్యుంటుందన్న మాట!! 
అందరూ ఏక కంఠంతో “హలే...లూయ!” అని అరిచిన వెంటనే శిలువ బెల్టు పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెట్టారు.
విక్టర్ విజయ గర్వంతో రెండడుగుల దూరంలో కూర్చున్న మెర్సీ ని చూశాడు!
బక్క పలుచని శరీరం...లోతు కళ్ళు, సన్నని పెదవులు, రింగుల జుట్టు, బోసి మెడ, పుల్లల్లాంటి చేతుల్లో బైబిలు పట్టుకుని, భుజాల పై నుంచి తల మీదుగా తెల్లని చున్నీతో ముసుగు వేసుకుని, వంచిన తలతో పాస్టర్ గారి ప్రసంగం వింటూ ముఖ్యమైన బైబిలు వాక్యాల కింద ఎర్ర సిరాతో గీతలు గీస్తోంది.   
విక్టర్ కి ఆమె ముఖం సరిగ్గా కనబడడం లేదు. సంవత్సరం కిందట ఆమెను ఈ చర్చిలో చూసింది మొదలు ఒక్క ఆదివారం కూడా వదలకుండా వెళుతూనే ఉన్నాడు. ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా మాట్లాడదు. మెర్సీ కి తల్లి దండ్రులు లేరు. అమ్మమ్మే పెంచుతోంది. ఎన్నో కష్టాలు పడుతూ డిగ్రీ చదువుతోంది మెర్సీ. విక్టర్ ఓ చిరుద్యోగి.
మెర్సీ ఆమె ముసుగులోంచి రహస్యంగా విక్టర్ ని చూసింది! చూపుల వరకే! ఏమీ మాట్లాడదు. పక్కన కూర్చున్న ఆమె అమ్మమ్మ సగం నిద్రపోతూ సగం వింటూ గుర్తొచ్చినప్పుడు ‘హలేలూయ!’ ‘యేసు రక్తం జయం!’ అంటూ గాల్లోకి చేతులు లేపుతూంటుంది!
విక్టర్ కి కోపం, దూకుడు ఎక్కువ! మెర్సీ తనని చూసి కూడా ఎందుకు మాట్లాడదో తేల్చుకోడానికి చిన్న కాగితం ముక్కలో ‘అందరికంటే ముందు నేనే వాక్యం చదివాను చూశావా! నాతో ఎపుడు మాట్లాడతావు?’ అని రాసి ఆమె బైబిల్ మీదకి విసిరాడు! అది విక్టర్ నుంచే వచ్చిందని ఆమెకు తెలుసు!
ఆ కాగితం మడతలు విప్పి చదివింది. వెంటనే అదే కాగితం మీద బదులు రాసి అతని దగ్గరలో విసిరింది మెర్సీ. ఈ తతంగమంతా ప్రసంగిస్తున్న శిలువ బెల్టు పాస్టర్ గారితో సహా నలుగురైదుగురు పెద్దలు గమనిస్తూనే ఉన్నారు!
విక్టర్ ఆమె రాసిన బదులు చదివి ముఖం మాడ్చుకున్నాడు!
‘స్మార్ట్ ఫోన్ లో ఉన్న బైబిల్ అప్లికేషన్ లో క్షణం కూడా పట్టదు ఏ గ్రంధం తీయడానికైనా! అందరిలా బైబిల్ పేజీలు  తిప్పి, వెతికి, అప్పుడు చూపించు నీ గర్వం! అయినా నువ్వు చదివిన వాక్యం నీ గురించేగా!’ అని రాసింది.
వీరి కోపతాపాల మధ్య ఆరాధన ముగింపుకొచ్చింది.
“ఆశీర్వాదంబుల్మామీద...వర్షింప జేయు మీశ...ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము...” ముగింపు గీతం పాడుతూ కానుకలు, దశమ భాగాలు సమర్పిస్తున్నారు సంఘస్తులు. దాదాపు పాతిక మంది పాడుతున్నా ఒక్క స్వరంగానే వినబడుతోంది!
                             ***              ***              ***              ***  
అదే రోజు సాయంకాలం అదే గుళ్ళో యౌవనస్తుల కూటానికి విక్టర్ అందరి కంటే ముందొచ్చి కూర్చున్నాడు. నిస్సందేహంగా మెర్సీ కోసమే! కొద్ది నిమిషాలకి మెర్సీ తన స్నేహితులతో వచ్చింది. సాధారణంగా పాస్టర్ గారు కూటాలకి కాస్త ఆలస్యంగా వస్తారు.
“మెర్సీ! నా ప్రేమ సంగతి ఏం చేశావు? ఎన్ని రోజులు నీ వెంట పడాలి?”
“దేవుని సన్నిధిలో ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు?”
విక్టర్ కి వెర్రి కోపం వచ్చింది.
“బయటకి రమ్మంటే వస్తావా? వారంలో ఈ ఒక్కరోజే నిన్ను కలిసేది! ఇంకెక్కడ మాట్లాడమంటావ్? నీ కోసం ఏం సాహసాలు చేయాలి? శిలువేసుకోవాలా?”
మెర్సీకి విక్టర్ ధోరణి బొత్తిగా నచ్చదు. మాటలు కటువు! ఏ మాత్రం నెమ్మదిలేని మనిషి, నోటికెంతొస్తే అంతా అనేస్తాడు! ‘తనకు తల్లిదండ్రులుంటే ఇలా వెంటపడి వేధించే వాడా?’ అని లోలోపల మధనపడుతుంటుంది. మెర్సీకి దేవుడి మీద, చదువు మీద తప్ప దేని మీదా ధ్యాస లేదు. విక్టర్ మీద అసలే లేదు! అతని ముక్కు సూటి మాటలకీ కోపిష్టి చేష్టలకీ ఏ అమ్మాయీ అతని మీద ఆసక్తే చూపదు! అలాంటిది మెర్సీకి అతని పక్కన నిలబడ్డానికే అనిష్టం!
విక్టర్ కోపంగా ఫోన్ నేలకేసి కొట్టి బయటకు వెళ్లిపోయాడు! మెర్సీ భయపడిపోయి, వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని అతని క్షేమం కోసం, తన రక్షణ కోసం కన్నీటి ప్రార్ధన చేసింది.
                              ***             ***              ***              ***  
మరుసటి ఆదివారం...
గుళ్ళో ఆరాధన ప్రార్ధనతో ప్రారంభిస్తున్నారు శిలువ బెల్టు పాస్టర్ గారు. స్త్రీలంతా తమ కొంగులతో ముసుగు వేసుకుని, పురుషులంతా తలలు వంచుకుని, కళ్ళు మూసుకుని ప్రార్ధనకి సిద్ధపడ్డారు. ఎప్పుడూ ముందొచ్చే విక్టర్ ఆ వేళ ఇంకా రాలేదు! మెర్సీ తనకు తెలియకుండానే ఆ విషయాన్ని గ్రహించింది! ‘కోపంలో చేసుకోరానిదేది చేసుకోలేదు కదా!!’ అన్న సందేహమూ వచ్చింది!
కళ్ళు మూసుకుని తలవంచి ప్రార్ధిస్తున్న మెర్సీ భుజం పై వెనుక నుంచి ఓ చెయ్యి పడింది. చటుక్కున ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. కచ్చితంగా విక్టరే ఇలాంటి అమర్యాద పనులు చేస్తాడనుకుంటూ తిరిగి చూసింది.
ఊహించని ఆ మొహాన్ని చూసి కంగారుపడి ‘ఏంటి?’ అని అడిగింది మెల్లగా. అతను మెర్సీ చదువుకునే కళాశాలలో పని చేసే అటెండర్! బయటకి రమ్మని సైగ చేసి అతనూ బయటకి నడిచాడు. మెర్సీ అతడి వెంట నడిచింది. అందరూ ప్రార్ధనలో నిమగ్నమయ్యున్నారు. ఎప్పట్లాగే మెర్సీ అమ్మమ్మ సగం నిద్ర, సగం ప్రార్ధనలో మునిగుంది.
సంఖ్యాకాండములో బిలాములాంటి అటెండర్ కి కాలేజీలో అంత మంచి పేరు లేదు. విద్యార్ధుల దగ్గర లంచాలు తీసుంటాడనీ, ఆడపిల్లల్ని ఏడిపిస్తాడని ప్రిన్సిపల్ కి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి అతని మీద. కానీ హఠాత్తుగా అతను చర్చికి రావడమేంటో మెర్సీ కి అంతుబట్టడంలేదు.
“అమ్మా మెర్సీ! మీ సురేఖ మేడంగారు నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. కారు కూడా పంపారు. రామ్మా వెళదాo!” హడావుడిగా చెమటలు కక్కుతూ చెప్పాడు అటెండర్.
మెర్సీ అయోమయంగా అతని వైపూ వీధిలో ఎదురుగా ఉన్న కారు వైపూ చూసింది. చర్చికి వచ్చే వారు మెర్సీని పలకరిస్తూ “ప్రైస్ ద లార్డ్” చెప్తున్నారు.
“అదేంటి? ఇప్పుడు రమ్మనడమేంటి? మేడం గారికేమైంది??” కంగారుగా భయంగా అంది మెర్సీ.
మెర్సీకి సురేఖ మేడమ్ అంటే ఎంతో మక్కువ. ఆమె కూడా మెర్సీ కి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటుంది. అలాంటి సురేఖ గారు ఆపదలో ఉన్నట్టూ ఆ మాటా ఈ మాటా చెబుతూ మెర్సీ ని కారు వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. అది ఫలించింది! కారు దగ్గరకు వెళ్ళగానే అద్దాల్లోంచి ఇద్దరు కొత్త వ్యక్తులను చూసి హడలిపోయి అరిచేలోపే ఆమెను అటెండర్ వెనుక నుంచీ కార్లోకి తోసి అతనూ ఎక్కాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా కారు కదిలింది...
యేసు రెండవ రాకడప్పుడు దొంగ వలె వస్తాడని, తెగుళ్ళుoటాయని కొన్ని సూచనలున్నాయి...కానీ ఈ నీతి మాలిన పనులకు పాల్పడే వాళ్లు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు?   
శత్రువులు సియోనులోని కన్యకలను చెరిపినట్టు...
తామారను అమ్నోను బలాత్కారం చేసినట్టు...
కారెక్కిన మెర్సీ ని అరక్షణంలో వివస్త్రను చేశారు ఆ ముగ్గరు రాక్షసులు! ఆమె అరుపులు వినబడకుండా ముందే కిటికీ అద్దాలన్నీ మూసేశారు. ఆమెకు ఏం జరుగుతోందో తెలిసే లోపు అతి జుగుప్సగా ఆమె నోట్లో నోరుపెట్టి జుర్రాడు ఒకడు. ఆమె మర్మాంగాన్ని చీల్చి సుఖపడుతున్నాడు అటెండర్! మరొకడు కసిగా ఆమె శరీరాన్ని కొరుకుతూ రక్తం తాగుతున్నాడు! ఆమె సిగ్గు మెల్లగా చచ్చిపోతోంది...ఒక్కొక్కరూ అమెలోకి దూసుకుపోయే కొద్దీ ఒళ్ళు మొద్దుబారిపోతోంది! ఆమె మనసు శూన్యమవుతోంది. వాళ్ళు తాకుతుంటే తన ఒంటి నిండా యెహోవా దేవుడు ఫరో మీద కురిపించిన కప్పల వర్షం పడుతున్నoత అసహ్యంగా ఉంది!! మెర్సీ ఆలోచనలు మరణిస్తున్నాయి...అంతరంగం నిశ్శబ్దమౌతోంది. శరీర బాధంతా కన్నీరుగా కారుతోంది...
కారు తిరుగుతూనే ఉంది...ఎటు పోతుందో ఆమెకు తెలీదు. డ్రైవర్ తన వెనుక జరిగేది సర్వ సాధారణమైన సంగతిలా తనకేం పట్టనట్టు హుందాగా తన పని తను చేసుకుపోతున్నాడు. ఆ నీచులు ఎంతో దుర్మార్గంగా చెరచిన మెర్సీ నగ్న శరీరాన్ని చూసి కౄరంగా నవ్వుకుంటున్నారు.
యెహోవా నామమున ఎలీషా తనని అపహాస్యం చేసిన బాలురుని శపించిన వెంటనే అడవిలోంచి రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి నలభైరెండు మంది బాలురను చీల్చినట్టుగా తనను ఈ మనుషుల నుండి రక్షించడానికి ఏ మృగమైనా వస్తే బాగుండని దేవునికి మొర పెట్టుకుంటోంది మెర్సీ. 
వాళ్లు పెట్టే బాధను భరించలేక మెల్లగా ఆమెకి స్పృహ తప్పుతోంది. అది గమనించిన అటెండర్ జేబులోంచి అగ్గిపెట్టి తీసి ఓ పుల్ల వెలిగించి మెర్సీ మానాన్ని భగ్గుమనిపించాడు!!
“యేసయ్యా...!!!” కర్ణ కఠోరంగా అరించింది మెర్సీ.
ఆమె ఆర్తనాదానికి ఉలిక్కిపడి సడెన్ బ్రేక్ వేశాడు డ్రైవర్! వెంటనే అటెండర్ ఆమె నగ్న దేహాన్ని బయటకీడ్చి రోడ్డు మీద పడేశాడు!
కారు కులాసాగా ముందుకి కదిలిపోయింది.
నగర శివార్లు! మెర్సీ ఒంటి మీద నెత్తుటి గాయాలు తప్ప మరేమీ లేవు!! కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. మెల్లగా ఆమె ప్రాణం శరీరాన్ని విడిచి దూరంగా పోతున్నట్టుగా అనిపిస్తోంది మెర్సీకీ...
                   ***              ***              ***              ***  
విక్టర్ స్పర్శకి అతి కష్టం మీద కళ్ళు తెరిచింది మెర్సీ! చుట్టూ డాక్టర్లు, నర్సులు, ఇద్దరు పోలీసులు, రోదిస్తూ ఓ మూల కూర్చున్న అమ్మమ్మ ఆమె పక్కనే సురేఖా మేడం కనిపించారు. ఆసుపత్రిలో ఉందని అర్ధమయ్యింది మెర్సీకి. ఎన్ని రోజులు స్పృహ లేకుండా పడుందో తెలీదు. డాక్టర్ల సైతం కంటతడి పెట్టిన ఉదంతమది! స్థానికులు మెర్సీని ఆసుపత్రికి తీసుకురాగానే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న ఆమె శరీరాన్ని చూసి వైద్యులు వాళ్ల కళ్ళని వారు నమ్మలేకపోయారు!
మెర్సీకి వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసు కంప్లైంట్ తీసుకుని ఇంటికి పంపారు. మెర్సీ ని చంటి పాపలా చేతుల్లోకెత్తుకుని ఆటోలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు విక్టర్.
కొన్ని రోజుల వరకు మెర్సీ నోటి వెంట మాట లేదు! పోలీసులు ఇంటికొచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా సహకరించలేదు. విక్టర్ రోజూ మెర్సీ ఇంటికి వచ్చి పోతూ ఆమెకు అన్ని పరిచర్యలూ చేస్తున్నాడు. మెర్సీ మనసులో ఏముందో అతనికీ బోధపడడం లేదు.
దాంతో విక్టర్ రెండు రోజుల తరువాత  స్థిర నిశ్చయంతో మెర్సీ ముందుకొచ్చాడు!
“మెర్సీ! నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను”
మెర్సీలో కదలిక లేదు. అనుభూతి లేదు. ఆశ్చర్యం లేదు. ఆమె అమ్మమ్మ, చుట్టు పక్క వాళ్ళు ‘విక్టర్ చాలా మంచివాడని, జరిగినదానికి ఎంతో బాధ పడుతున్నాడనీ’ ఇంకా ఏవేవో చెప్పి ఆమె అనుమతి లేకుండానే వివాహం జరిపించేశారు!
                               ***              ***              ***              ***  
“మహోన్నతమైన దేవా పరిశుద్ధాత్మా! నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభువా! మరి ఈ దినమున ఉదయకాలములో తండ్రీ, మెర్సీ మరియు విక్టర్ ల పరిశుద్ధ వివాహము జరిపించుటకు అంగీకరించి, మాకందరికీ శక్తినీ, ధైర్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు నాయనా! మరి తండ్రీ, వివాహము అనగా విడి విడిగా ఉన్నవారు హత్తుకుని, ముడి పడి, యెహోవా నామమున కలిసుండాలని చెప్పావు దేవా! అదే మార్గములో ప్రభువా, ఈ ఇరువురినీ ఏక శరీరముగా నడిపించుటకు నీవే సహాయపడాలి తండ్రీ! నీ బిడ్డలైన మెర్సీ విక్టర్ ల దాంపత్య జీవితంలో శాంతి సమాధానం కొరకు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకము, ప్రేమ, స్నేహము బలపరచుటకు, ఘనమైన గర్భ ఫలము కొరకు మిమ్మును కోరుచున్నాము ప్రభువా! మీరు చూపే కృపను బట్టి మీకు స్తుతులు, వందనాలు తండ్రీ! మెర్సీ విక్టర్ ల నూతన జీవితానికి వారిని సిద్ధపరచండి దేవా! ఎటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు వారి దరి చేరనీయక, వారిని జీవితకా...లమంతయు ఆశీర్వదించి, కాచి, కాపాడుమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నా...ము పరమ తండ్రీ...ఆమెన్!! యేసు రక్తమే ఝయం! శిలువ రక్తమే ఝయం! యేసు రక్తమునకే సంపూర్ణ విజయం! అపవాది క్రియలు లయమగును గాక...ఆమెన్ ఆమెన్ ఆమెన్!!!”
ప్రార్ధన ముగించి మెర్సీ చేతికి పాలగ్లాసు అందించి, పాస్టరమ్మ పద్మరాగం గారు దంపతుల్ని దీవించి శోభన గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు. వెంటనే విక్టర్ గది తలుపులు వేసొచ్చి మెర్సీ చేతిలోని గ్లాసు టేబుల్ మీద పెట్టి ఆమెను పూల పాన్పు పై కూర్చోబెట్టాడు. ఆమె ముఖంలో నిశ్శబ్దం, కళ్ళల్లో అదే మౌనం.
“మెర్సీ..!” విక్టర్ స్వరంలో సన్నని వణుకు.
తల వంచుకున్న రాతి బొమ్మలా కూర్చుంది మెర్సీ. కదలదు. మాట్లాడదు.
అరచేతుల్లో మొహం దాచుకుని ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు విక్టర్. మెర్సీ చలించిపోయింది! కళ్ళు బరువుగా పైకెత్తి విలపిస్తున్న విక్టర్ ని చూసింది.
పాత జ్ఞాపకాల్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆమెకు...కోపంగా చూసే విక్టర్, చర్చి పాటలు, స్నేహితుల కబుర్లు, కాలేజీ పాఠాలు, సురేఖ మేడం...అటెండర్..!! ఆ దుర్ఘటన కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. ‘కెవ్వు’మని అరిచి గుండెలవిసేలా రోదిస్తోంది మెర్సీ. విక్టర్ ఆమెను గట్టిగా హత్తుకుని తానూ ఏడుస్తూ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె విక్టర్ విశాల బాహువుల్లో గువ్వలా ఒదిగి ధారాపాతంగా దుఃఖిస్తోంది. ఒకరి రోదన ఒకరికి ఓదార్పైంది!
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి శోకం తాళలేకపోతున్నాడు విక్టర్. తనని తాను తమాయించుకుని మెర్సీ ముఖాన్ని గుండెలకు అదుముకున్నాడు. క్రమంగా మెర్సీ ఆవేదనకి తాత్కాలిక ఉపశమనం దొరికింది అతని స్పర్శలో!
“నన్ను జాలి పడి పెళ్లి చేసుకున్నావు కదూ!?” గద్గద స్వరంతో మెర్సీ.
నిర్మలమైన మనసుతో దైవ మందిరంలో ప్రార్ధన చేసుకుంటున్న ఇరవైయ్యేళ్ళ పేద పిల్లని అత్యాచారం అటెండర్ రూపంలో కాటేసింది! బైబిల్ వాక్యాలు కంఠస్తం వచ్చినా పాత నిబంధన మొదటి గ్రంధం ఆదికాండంలో లోతు కూతుళ్ళకు సంతాన ప్రాప్తి ఎలా కలిగిందో తెలియని అమాయకురాలు మెర్సీ! సినిమా పాట విన్నా, టీవీ చూసినా మహా పాపమనుకునే పిచ్చిది! అయిన వాళ్లు దూరమైనా, కష్టాలు దిగమింగుతూ విద్యలో ఎప్పుడూ ముందుండే చదువుల తల్లి మెర్సీ!
ఏ పాపమునెరుగని మరియ లాంటి మెర్సీ ఈ రోజు కొందరు నీచుల వల్ల నరకం అనుభవిస్తోంది! దేహం ఆమెది, దోషం వాళ్ళది!
సమాధానం కోసం విక్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది మెర్సీ...
“నా ప్రేమని ఇప్పుడు కూడా నమ్మట్లేదా మెర్సీ? నా మాటా, తీరు కటువుగా ఉండొచ్చు. నా మనసు సున్నితం మెర్సీ! నిన్ను మొదటిసారి చూసిన క్షణం నుంచీ ఆరాధించడం మొదలుపెట్టాను. నీ అమాయకత్వం, నీ నెమ్మది, వినీ వినబడని నీ మాటలు, చూసీ చూడనట్టు నీ చూపులు, దేవుని మీద నీ భక్తి నన్ను కట్టి పడేశాయి! నీ తోనే నా జీవితమని ఊహించుకున్నాను. ఆ ఆదివారం నేను ఊళ్ళో లేను మెర్సీ. నేనే ఉండి ఉంటే ఇంత అనర్ధం జరగనిచ్చే వాడ్నే కాదు! నన్ను క్షమించు మెర్సీ!”
విక్టర్ మొహమంతా కన్నీటితో తడిసిపోయింది. గొంతు జీరపోతోంది.  మళ్ళీ ఏడుస్తూ అగ్ని పర్వతంలా ఎగిసిపడ్డాడు.
“ఈ దొంగ నాయాళ్ళు తక్కువ కులం అని మనల్ని దూరం పెడతారు. మన ఆడవాళ్ళని ఉంచుకున్నప్పుడు, పాడు చేసేటప్పుడు మాత్రo అంటరానితనం పని చెయ్యదు! వాళ్ల ఆడబిడ్డల్ని కన్నెత్తి చూసినా గుడ్లు పీకి నాలుకలు తెగ్గోస్తారు! మన మీద ఎన్ని దాడులు జరిగినా క్షమాగుణం కలిగుండమనే మతం మనది! మన చట్టాలు కూడా మనకి  ఆ విషయంలో ఎంతో సాయం చేస్తాయి! ప్రేమించిన  పిల్లకి అఘాయిత్యం జరిగితే వదిలేసేంత దగుల్బాజీని కాను మెర్సీ!”
విక్టర్ దుఃఖం కట్టలు తెగి కోపం, ఉక్రోషం పొంగుకొస్తున్నాయి.
“ఆ సైతాన్ నా కొడుకుల్ని నరికి ముక్కలు ముక్కలుగా కోసేశేవాడ్ని! కానీ నిన్ను ఆసుపత్రిలో అటువంటి దుస్థితిలో చూసి నా కోపమంతా ఆవిరైపోయింది మెర్సీ! నేను ఖూనీ చేసి జైలుకెళితే నీకు తోడెవరుంటారు? ఆ వెదవలకి శిక్ష పడాలని ఎవరు పోరాటం చేస్తారు? అందుకే నా నిర్ణయం ఇంట్లో చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను.”
“నేను గాయపడ్డదాన్ని విక్టర్! నా జీవితం, నా శరీరం రెండూ పాడైపోయాయి!” మొహం చూపించలేకపోతోంది మెర్సీ.
మెర్సీ అరచేతిని తన గుండెల మీద పెట్టుకున్నాడు విక్టర్...
“ఇక మీదట మనిద్దరిదీ ఒకే జీవితం! పెళ్ళికి ముందు నీ శరీరానికి ఏం జరిగిందో నాకు మాత్రమే కాదు నీక్కూడా అనవసరం! ఎందుకో తెలుసా? నువ్వు నా దానివి కాబట్టి! నువ్వు నా ప్రాణం మెర్సీ! నీకు భర్తను మాత్రమే కాదు. అమ్మానాన్నని కూడా! నీ చదువు, ఉద్యోగం, ఉన్నతిలో నా పూర్తి సహకారం, తోడు ఉంటాయి. ఆ దుర్మార్గులకి కఠిన శిక్ష పడేంత వరకూ నీతో కలిసి పోరాడుతా!”
విక్టర్ బుగ్గన చిరునవ్వుతో అతిమెత్తని అంగీకార చుంబన అందచేసింది మెర్సీ.
                                      ******************   
-మానస ఎండ్లూరి

 ఫెబ్రవరి 21 2016, నమస్తే తెలంగాణా, ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’ 
https://www.facebook.com/kandukuri.rameshbabu/posts/1006628226076231

5 comments: