నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

13 Mar 2016

దొంగ బొట్టు

అది ప్రభుత్వ పాఠశాల...
ఉపాధ్యాయుల గదిలో ఎవరికి వారు హడావుడిగా పరీక్షా పత్రాలు దిద్దే పనిలో ఉన్నారు. మా లెక్కల పంతులు ప్రసాద్ మా అందరికంటే ముందే కాగితాలన్నీ దిద్దేసి తన బల్ల మీద తల వాల్చి నిద్రకీ మెలకువకీ మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు.
“ఏవండీ ప్రసాద్ గారు! ఈ వారం కథేవిటి? ప్రతి సోమవారం ఈ పాటికి మీరు మా అందరికీ కథంతా చెప్పేయడం, అందరం దాని మీద చర్చ చేసుకోవడం కూడా అయిపోయేది కదా! ఈ వేళ ఇంకా మొదలుపెట్టలేదేవిటో!” అన్నాడు రామశాస్త్రి దిద్దే కాగితాలలోంచి ముఖం పైకెత్తి.
“అవున్నిజమే! పనిలోపడి మర్చేపోయాం. ఈ వారం కథేంటి ప్రసాద్ గారు? ఎవరు వ్రాశారు?” అడిగింది సువర్ణ కుమారి.
పరిక్షా పత్రాలు దిద్దుతూ అడగలేకపోయాను గానీ, నాకూ కూతూహలంగానే ఉంది ఆయన చెప్పే కథ వినాలని!
ఆదివారం పత్రికల్లో వచ్చే ఏదోక కథ సోమవారం భోజన సమయంలో మా అందరికీ చెప్తాడు ప్రసాద్. ఆ కథ మీద చర్చ, వాదన, అభిప్రాయాలు, కొట్లాటలు, అలకలు సాగుతూనే ఉంటాయి మళ్ళీ తరగతి గంట కొట్టే దాకా.
“ఈ వారం కథ నాకు నచ్చలేదులెండి! వదిలేయండి!” విసుగ్గా అన్నాడు ప్రసాద్.
“అదేంటి? ఇన్ని రోజులగా ఎప్పుడూ ఇలా అనలేదే! ఏం కథ అది?” మల్లికార్జున రావు.
“ఏదో! పిచ్చి కథ. ఏం బాలేదు” ప్రసాద్
“హహ్హహ్హ! ఏ సరస కథో అయ్యుంటుంది! సిగ్గు పడుతున్నాడు ప్రసాద్” జగదీశ్వర్
“కాదు కాదు! విప్లవ కథ అయ్యుంటుంది. ఆయనకవి అస్సలు నచ్చవుగా” తులసి కుమారి
“చెప్పండి ప్రసాద్ గారు! మీకు నచ్చకపోయినా ఇక్కడ ఎవరోకరికి నచ్చుతుందేమో చూద్దాం” ఆత్రంగా నేను.
“దళిత కథలెండి. ఎవరో జోసెఫ్ కోడూరి అట! ఇప్పటికీ దళితులు వివక్ష అనుభవిస్తున్నారని, అవకాశాలు లేవని, మొహానికి బొట్టు లేకపోతే తక్కువగా చూస్తారని, మొహం మీదే కులం అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని...ఎప్పుడో తాతల కాలం నాటి కష్టాలు నేటి కాలంలో ఉన్నట్టు రాసుకొచ్చాడు. అసలు ఇంకా ఈ రోజుల్లో కులమెక్కడుందండీ!?”
ప్రసాద్ చెప్పింది విని అప్పటిదాకా ఆ గదిలో గలగలమన్న మాటలన్నీ మౌనాసనం వేశాయి! ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా వారి వారి పనుల్లో పడ్డారు.
“కోడూరి జోసెఫ్ అంటే...ఆయన కాకినాడలో ప్రొఫెసర్ కదా! ఆయన ఎప్పుడో రాసిన క్రైస్తవ పాటలు ఇప్పటికీ చర్చిల్లో పాడుతుంటారు! ఆయన మేనకోడలు చంద్రకుమారీ నేనూ, చిన్నప్పుడు ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళం! ఈ ఊళ్లోనే పెద్ద ఆఫీసర్ ఆమె. ప్రసాద్ గారూ! మీరు ఇంటికి వెళ్ళాక, కథ చివర్లో ఆయన ఫోన్ నెంబర్ ఉంటే నాకు కాస్త పంపండి.” అన్నాను ఉత్సాహంగా.
“ఆ...అదిగో చూశారా! ఆయన ప్రొఫెసర్! మేనకోడలు ఆఫీసర్! ఇంకేం కష్టాలుంటాయండి వీళ్ళకి?” అసహనంగా అన్నాడు ప్రసాద్.
ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. సువర్ణ కుమారి అసలు వంచిన తల ఎత్తట్లేదు. ఆమె కాళ్ళకి కేజీడు పసుపు, నుదురంతా నిండేలా రూపాయకాసంత కుంకుం బొట్టు పెట్టుకున్నది దళితురాలిగా దాక్కోడానికి కానీ పోరాటం చేసి ప్రశ్నించడానికి కాదుగా!
ప్రతి కథ మీదా పోటీలు పడి చర్చించే వారంతా తరగతి గదిలో టీచర్ గారు ఎవర్ని లేపి ఏం ప్రశ్నలేస్తారో అని భయంతో నక్కి నక్కి దాక్కునే పిల్లల్లా ఉండిపోయారు. నాతో సహా!
వాతావరణం తేలిక చేయడానికి కాబోలు, సరస్వతి గొంతు సవరించుని “తోటకూర వడలు తినండి సువర్ణ గారు” బాక్స్ అందిస్తూ అంది.
“వద్దండి! సోమవారాలు తోటకూర అవీ తినను” బాపూ బొమ్మలా నవ్వుతూ సున్నితంగా తృణీకరించింది సువర్ణ కుమారి.
“నాకివ్వండి! నేను లాగించేస్తాను” ఆబగా బాక్స్ లాక్కున్నాడు రామశాస్త్రి.
*** *** *** ***
“హలో సార్! జోసెఫ్ గారు బావున్నారా? నేను రాజమండ్రి నుంచీ నిర్మలని! మీ కథ చదివాను సార్. చాలా బాగా రాశారు. ఆధునిక కాలంలో దళితులు పడే అవమానాలను బాగా చెప్పారు” ఫోన్ చేసి ఉద్వేగంగా అభినందించాను.
“థాంక్స్ అమ్మా! అర్ధమయ్యే ఉంటుందిగా అవన్నీ రోజూ నేనూ నా సోదరులూ పడే అవమానాలే. ఎన్ని చదువులు చదువుకుని, ఎంత సంపాదించినా పై కులస్తుడైన ఒక ప్యూన్ ముందు దళితులమేగా!”
“అలా ఎందుకు అనుకుంటారు సార్” ఓదార్పుగా అన్నాను.
“నేను అనుకోను. వాడనుకుంటాడు! కావాలని ఎంత పిలిచినా రాడు. చెబితే గానీ నా గది తుడిపించడు, సమాధానాలు సరిగ్గా చెప్పడు. ముఖ్యమైన విషయాలు నాకు తప్ప అందరికీ చెప్తాడు. వాడి అహంకారమంతా వాడి చూపుల్లోనే ఉంటుంది...అదీ నాకే కనబడుతుంటుంది! ఇంకా చాలా ఉన్నాయిలే. చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగదు”
“చాలా మందికి ఇవి కష్టాల్లా కనబడవు సార్. మా సహోద్యోగుడు ఒకడు ఉన్నాడు లెండి ప్రసాద్ అని! ‘ఇలాంటివేవీ ఇప్పుడు లేవు’ అని విసుక్కుంటున్నాడు మీ కథ చదివి. పైగా మనోడే!”
“హ్మ్...నిద్రకీ మెలకువకీ మధ్యలో ఉండేవాడిని బాగుచెయ్యడం చాలా కష్టం! చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇంతకీ మా మేనకోడలు చంద్రకుమారిని కలుస్తుoటావామ్మా? మీ ఊళ్లోనేగా ఉంటుంది.”
“చదువుకునే రోజుల్లో కలవడమే! మళ్ళీ కలుసుకోలేదు సార్. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. రేపు పొద్దున్న తనని ఆఫీసులో కలిసిన తరువాత బడికెళతాను...”
“అలాగే మంచిదమ్మా! ఉంటాను”
*** *** *** ***
మరుసటి రోజు చంద్ర కుమారి ఆఫీస్ రూమ్ ఎదురుగా బెంచ్ మీద కూర్చుని తన కోసం ఎదురు చూస్తున్నాను. పదిహేను నిమిషాలలో వస్తానంది. చాలా కాలం తరువాత ఈ రోజు కలుసుకుంటున్నాం.
చిన్నప్పుడు ఓ సారి...చర్చిలో ఉన్నప్పుడు మా పాస్టర్ గారి కొడుకు...అతని పేరు ఏదో ఉండాలబ్బా...ఆ...మోషే! ఆ మోషే గాడు ఎవరికీ తెలియకుండా చంద్రకుమారి బైబిల్ లో ప్రేమలేఖ పెట్టాడు! ఆ ప్రేమలేఖ చంద్రకుమారి కంటే ముందే ఆమె అమ్మమ్మ కంట పడింది! దాన్లో ‘నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాను’ అని రాశాడు ఊరు పేరూ లేకుండా. అంతే! అమ్మమ్మ సాక్షాత్తూ యేసు ప్రభువే రాసి పెట్టాడనుకుని అందరికీ చూపించి చర్చిలో రెండు గంటలు కన్నీటి సాక్ష్యం కూడా చెప్పేసింది! చాలా కాలం అదే విషయం గుర్తు చేసుకుని పడీ పడీ నవ్వుకునే వాళ్ళం చంద్ర కుమారీ నేనూ.
ఆ జ్ఞాపకంతో నా ముఖం పై చిన్న నవ్వు మెరిసే లోపే అటెండర్ వచ్చి చంద్రకుమారి గది తాళం తీసి శుభ్రం చేస్తున్నాడు.
కొద్ది నిమిషాలకి చంద్రకుమారి వచ్చే అలికిడి వినబడింది. దారిపొడవునా ఉద్యోగులందరూ ఆమెకు వినయంగా ‘గుడ్ మార్నింగ్’ చెబుతున్నారు. హుందాగా నడుచుకుంటూ వచ్చి ఆప్యాయంగా నన్ను వాటేసుకుంది. అదే స్వచ్ఛమైన నవ్వు, కల్మషం లేని మనసు.
నా భుజం మీద నుంచి తన ముఖం తీసి నా మొహంలోకి చూస్తూ నవ్వింది చంద్రకుమారి. ఒక్కసారిగా హతాశురాలినయ్యాను! పెద్దగా...ఎర్రగా...గుండ్రంగా...తన నుదుటన బొట్టు!! గొంతులో మాట ఆగిపోయింది నాకు! నన్ను తన గదికి తీసుకెళ్ళింది. అటెండర్ ఇంకా లోపలే ఉన్నాడు. చంద్రకుమారి టేబుల్ మీద వస్తువులన్నీ తుడుస్తున్నాడు. అప్పటికే గదంతా అద్దంలా శుభ్రం చేసేశాడు. ఫిల్టర్ లో మంచినీళ్ళు నింపాడు. కంప్యూటర్ కూడా ఆన్ చేసి పెట్టాడు.
గదిలో ఓ మూల దేవుడి విగ్రహం, పూలు, పూజా సామగ్రి, అగరబత్తి వెలిగించి పెట్టున్నాయి. వెళ్లి గంట కొడుతూ ఏదో శ్లోకం చదువుతూ దేవుడికి హారతి ఇచ్చింది చంద్రకుమారి. అటెండర్ ని హారతి తీస్కోమంది. నాకేదో రంగస్థలం మీద పద్యనాటకం చూస్తున్నట్టుంది! అటెండర్ ఏసి ఆన్ చేసి వెళ్ళిపోగానే తన సీట్లో కూర్చుంటూ నన్నూ కూర్చోమంది. నా మతి ఎలాగూ పనిచెయ్యట్లేదు కాబట్టి నడుం కైనా పని చెబుదామని మెల్లగా కూర్చుంటూ ఒకే ఒక్క ప్రశ్న వేయగలిగాను అతి కష్టం మీద.
“ఏంటి చంద్రా ఇదంతా?”
“పోరాడలేక!” ఆమె సమాధానం.
అటెండర్ ఇద్దరికీ చల్లని బాదంపాలు తీస్కొచ్చాడు..!
*** *** *** ***
ఎందుకో ఈ సాయంత్రం చాలా నిర్లిప్తంగా ఉంది. వేడి వేడి నీటితో స్నానం చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్ళాను. పార్క్ ఎప్పటిలా రద్దీగా లేదు. అందుకే పదిమంది ఉన్న గుంపులో కూర్చున్నా చటుక్కున కనిపెట్టాను మా కుటుంబానికి సన్నిహితుడైన జాన్సన్ గారిని. అందరూ మగవాళ్ళే. వెళ్లి పలకరిస్తే బావుంటుందో లేదో అని చూసీ చూడనట్టు ముందుకి నడిచాను. కానీ ఆయనే నన్ను పిలిచి పలకరించారు. దగ్గరికి వెళ్లి కాసేపు పిచ్చాపాటీ మాట్లాడాను. ఆయన చుట్టూ కూర్చున్న స్నేహితులందరికీ నన్ను పరిచయం చేశారు.
‘ఇక బయల్దేరుతాను’ అనే సమయానికి జాన్సన్ గారు ఇటీవలే తను రాసిన కవితా సంపుటి మొదటి పేజీ మీద సంతకం పెట్టి ఇచ్చారు. ముచ్చటగా పుస్తకం తెరిచి చూశాను.
‘చిరంజీవి నిర్మలకి...ప్రేమతో యార్లగడ్డ జనార్ధన్’ అని రాశారు! ‘అదేంటి? ఈయన పేరెప్పుడు మార్చుకున్నారు!?’ అని అదిరి పడ్డాను! కానీ ఇంటి పేరు మారలేదు. మార్చనవసరం లేదు కూడా! రెండో పేజీ తిప్పి చూశాను. పుస్తకం అంకితం ఇచ్చిన దంపతులు కనబడ్డారు. ఇప్పటిదాకా ఈ గుంపులో ఉన్న ఆయనే! ఫోటోలో భార్యతో సహా ఉన్నాడు.
పుస్తకంలోంచి తల పైకెత్తే సరికే జనార్ధన్ గా మారిన జాన్సన్ గారు తన మనుషులతో దూరంగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు...
ఎందుకో ఈ సాయంత్రం త్వరగా చీకటి పడుతున్నట్టుoది!
*** *** *** ***
“అమ్మా నిమ్మీ! మన స్వీటీ మెచ్యూర్ అయింది. వెంటనే బయల్దేరి హైదరాబాద్ రావాలి నువ్వు. ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం ఎల్లుండి”
“ఓణీల ఫంక్షన్ మనమెప్పుడూ చెయ్యలేదు కదా మావయ్యా? ఏదో మన పాస్టర్ గారిని పిలిచి చిన్న ప్రార్ధన పెట్టుకుంటే పోయేదానికి ఎందుకివన్నీ?!”
“అబ్బే! అదేం కాదులేవే...ఏదో పిల్ల మీద ముచ్చట తీర్చుకోవాలిగా! అందుకే...”
ఎప్పుడూ లేనిది ఈ కొత్త ముచ్చట్లేమిటో అర్ధం కాలేదు నాకు. అయినా మావయ్య దగ్గరికెళ్ళి రెండేళ్ళవుతోంది. అందుకోసమైనా తప్పకుండా వెళ్లి తీరాలి.
*** *** *** ***
“అబ్బా..!! బైటికెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళమని ఎన్ని సార్లు చెప్పాలి నీకు!”
అప్పటికే మా మేనమామ ఇంట్లో ప్రతి గోడ మీదా కొత్త పటాలను చూసి నివ్వెరబోయిన నేను ఆయన మాటలకి ఉలిక్కిపడ్డాను!
“నో డాడీ ప్లీజ్! జీన్స్ మీద బొట్టు పెట్టుకోడం నా వల్ల కాదు! అయినా అలవాటు లేని పని ఎలా చేస్తారు? ఇంకా నయం జడగంటలూ పట్టీలు పెట్టుకోమనలేదు!” హడావుడిగా తన బ్యాగ్ లో సెల్ ఫోన్, చిన్న వాటర్ బాటిల్, పెన్స్, పేపర్స్ పెట్టుకుంటూ అంది స్వీటీ.
“ఏది ఉన్నా లేకపోయినా బొట్టు ఉండాలమ్మా, పెట్టుకుని వెళ్లు” ఆదేశించాడు మావయ్య
“నేను వెళ్లేది పేరంటాలకి కాదు డాడీ! నిన్న ఒక దళిత్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసా అసలు?! మా స్కూల్ లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. అక్కడికే వెళుతున్నా. బై!”
వెంటనే టీవీ పెట్టాను. ‘ఆ అబ్బాయిది ఆత్మహత్య కాదు! కుల వివక్ష, కుల రాజకీయాలు చేసిన హత్య అనీ, మనిషి ఎంత ఘనత సాధించినా కులానికి బలౌతున్న దళితులు, మైనారిటీలూ ఎంతోమంది ఉన్నార’ని ఉద్యమకారులూ, విద్యార్ధి సంఘాలూ పదే పదే చెప్తున్నారు. దేశం నలుమూలల నుంచీ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. వందలమంది విద్యార్ధులు, విద్యావేత్తలూ, సంఘాలూ వీధుల్లో భైఠాయించి ఆ కుర్రాడి కుటుంబానికి న్యాయం జరగాలని దీక్ష చేస్తున్నారు.
న్యూస్ చానల్స్ అన్నీ తిప్పుతూ ఎవరివో తెలిసిన మొహాల్లా కనబడి చప్పున ఆగాను. మా ఊరు వాళ్ళూ...మా స్కూల్ స్టాఫ్! వందలమంది ప్లకార్డ్స్, బానర్స్ పట్టుకుని ర్యాలీ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. వారిలో మొదటి వరుసలో ఖాళీ నుదురులతో ఉన్న చంద్రకుమారి, సువర్ణ కుమారి కనబడ్డారు!! దళితుల న్యాయం కోసం మీడియాతో మాట్లాడుతూ తన అసలు పేరును చెప్పిన జాన్సన్ గారు!
“మా దళితుల చావుకి విలువ లేదా?” అని నిలదీస్తూ మొద్దు నిద్ర లోంచి మేల్కొన్న మా లెక్కల ప్రసాదు!!
అతని మరణం లోకమంతట్లోని కుల హీనులనే కాదు, దైనందిన జీవితాల్లో పైకులాలతో పోరాడలేక నిద్రని నటిస్తున్న నా అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళలని కూడా తట్టి లేపింది! మమ్మల్ని ఏకం చేసింది!!

ఎన్ని యువ తారలు నింగికెగిరితే గానీ నుదిటి మీంచి ఈ దొంగ బొట్లు కిందికి రాలవేమో! ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే గానీ ఈ కుల జాడ్య సమాజం తెరలు తొలగించుకుని నగ్నంగా కనబడుతుందో!
ఏదో చప్పుడవుతున్నట్టు అనిపించి టీవీ మీద నుండి కళ్ళు మరల్చాను. మా మావయ్య ఇంట్లో గోడలూ, భరిణెలు కూడా ఖాళీ అవుతున్నాయి...
-మానస ఎండ్లూరి
https://www.facebook.com/manasa.evangeline.9/posts/745914338879031

6 comments: