నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

11 Mar 2016

అవిటి పెనివిటి


గిన్నెలు కడుగుతున్న శబ్దానికి నిద్ర లేచింది దుర్గ.
ఆరేళ్ళ కొడుకు పండుగాడు ఇంకా గాఢ నిద్ర లోనే ఉన్నాడు. టైం చూస్తే ఆరవుతోంది...కళ్ళు నలుపుకుంటూ జుట్టు ముడేసుకుంటూ గుడిసెలోంచి బయటకొచ్చింది. ఆమె భర్త రాజు గుమ్మం పక్కన కూర్చుని రాత్రి తిన్న కంచాలూ, అన్నం గిన్నె, కూర మూకుడూ కొబ్బరి పీచూ బూడిదతో పట్టి పట్టి తోముతున్నాడు. అన్నం మెతుకుల కోసం వస్తున్న పిల్లులూ కుక్కల్ని తరుముతున్నాడు మధ్య మధ్యలో.
“ఏవయ్యా!? ఏటంత ఆరాటం నీకు? నేను లేసి తోంకుంటాను కదా!”
“ఏటైందిప్పుడు? రోజంతా పని సేత్తానే ఉంటావ్! ఇంట్లో కూకుని బుట్టలల్లడమేగా నా పని! అదిగో పిల్లోడు లేత్తాడు! ఎల్లి పాలు, ఇడ్లీ అట్టుకు రా !బెగేల్లు!!”
అంట్లు తోమడం పూర్తి చేసి, అర చేతులు భూమ్మీద ఆన్చి పోలియో వల్ల చచ్చుబడిన రెండు కాళ్ళూ, నడుం పైకి లేపి దేక్కుంటూ గుడిసెలోకి వెళ్ళాడు రాజు. కొడుకు తల నిమిరి పొయ్యి దగ్గరకెళ్ళి, కట్టెలు పేర్చి, పాల గిన్నె పెట్టి సిద్ధం చేశాడు. పాలకెళ్ళిన దుర్గ తోమిన అంట్లు లోనికి తెచ్చి చిన్న పాల ప్యాకెట్, ఇడ్లీ పొట్లం రాజు చేతికిచ్చి మొహం కడుక్కుని పనికి బయల్దేరుతోంది.
“ఇడ్లీ తినేసేల్లే దుర్గ!” అన్నాడు రాజు పాలు కాస్తూ
“వద్దు రాజూ! అక్కడేదోటెడతారు. మీరిద్దరూ తినండి!” చెప్పి బయల్దేరింది దుర్గ.
కొద్దిసేపటికి పండుగాడు లేచాడు. వాడికి పళ్ళు తోమించి, పాలు తాగించి, స్నానం చేయించి, ఇడ్లీ పెట్టి, చిరుగులు పడ్డ యూనిఫాం వేసి తోటి పిల్లలతో బడికి పంపాడు రాజు.
వాస్తవానికి దుర్గ రాజుని పెళ్లి చేస్కోడం ఎవరికీ ఇష్టం లేదు. అలా అని ప్రేమ వివాహం కాదు. దుర్గ పేదరికాన్ని వెక్కిరించడానికి ఆమె సొంత మేనమామే తెచ్చిన సంబంధం అది. ‘అవిటోడైతే మనిసి కాదా?’ అని మొండిగా రాజునే చేస్కొని సంతోషంగా కాపురం చేస్తోంది.  అప్పుడు నవ్విన వాళ్ళంతా ఇప్పుడు దుర్గా రాజుల ప్రేమను చూసి ఈర్ష్య పడుతున్నారు!
***     ***     ***
“ఏవే! నా మొహాన కాఫీ కొట్టే ఉద్దేశముందా లేదా?” దినపత్రిక తిరగేస్తూ అరిచాడు విష్ణువర్ధన్.
“ఆ తెస్తున్నానండీ!” చురుక్కుమన్న వేలిని నోట్లో పెట్టుకుని వెంటనే కుళాయి కింద కడుక్కుని కాఫీ ఇచ్చింది పద్మావతి.
స్నానం చేసి తయారైన కూతురు బుజ్జి తన చేతిలో దువ్వెన, రిబ్బన్లు పట్టుకుని పద్మావతి చుట్టూ తిరుగుతోంది జడలు వెయ్యమని. ఒక పక్క కూర మాడిపోతుంది, అన్నం పొంగిపోతుంది. ఇంకా పెసరట్లేయ్యాలి!
ఎప్పట్నుంచో నాలుగు బర్నర్లున్న స్టవ్ కొనుక్కుందామంటే విష్ణువర్ధన్ వినకపోగా “ఉండే ముగ్గురికీ నాల్లుగు పోయ్యిలవసరమా?” అంటాడు! పోనీ మూడు బర్నర్లున్నవి కొంటాడా అంటే అదీ లేదు! ఈ చికాకుకి తోడు అట్ల పెనం ఎంత వెతికినా కనబడదు!
“ఉండవే! చంపేస్తున్నావ్! ఇంత వయసొచ్చాక కూడా నేను జళ్లు వెయ్యడమేంటి?” కూతురి నెత్తి మీద కోపంతో ఒక్క మొట్టికాయ వేసింది పద్మావతి. అంతే! కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని మంచమెక్కింది బుజ్జి!
అట్ల పెనం ఇంకా దొరకలేదు! వస్తువులన్నీ టపాటపా చప్పుళ్ళు చేస్తూ పెనం కోసం వెతుకులాడుతోంది పద్మ.
“అబ్బబ్బా! చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి! ఆపుతావా గోల??” భర్త అరుపులు.
టక్కున నిశ్సబ్దం ఆవరించింది వంటగదిలో. అంతలోనే వచ్చింది దుర్గ.
“వచ్చావా! గదులు తర్వాత ఊడుద్దుగానీ ముందు గిన్నెలు కడిగెయ్ దుర్గా! అబ్బా! ఇక్కడుందా పెనం! ఇందాకట్నుంచీ వెతకలేక చచ్చిపోతున్నా. ముందు ఇది కడిగిచ్చేయ్. పిల్లకి స్కూల్ టైం అయిపోతుంది!”
అన్నం వార్చి, కూరలో చింతపండు పులుసు పోసి బుజ్జిని బుజ్జగించడానికి వెళ్ళింది పద్మ. బుజ్జి దాన్ని ఓదార్చి జళ్ళేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది!
గబగబా పెసరట్లు వేస్తూ మిక్సీలో పచ్చడి చేస్తూ, లంచ్ బాక్స్ రెడీ చేసింది. ఓ ప్లేట్లో మూడు పెసరట్లు వేసి బుజ్జికిస్తే పచ్చడి వేస్కొని టీవీ ముందు కూచుని తింటుంది. ఈ లోగా పద్మ నైటీ మార్చి చీర కట్టుకుని బుజ్జి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ పట్టుకుని బుజ్జి తినేదాక కాచుక్కూచుని బుజ్జిని పక్క వీధిలో స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది.
“కానీ కానీ! టిఫిన్ తీసుకురా త్వరగా!” జిల్లా పత్రిక చదువుతూ అన్నాడు విష్ణు.
మళ్ళీ పెనం పెట్టి చకచకా తన వైరాగ్యమంత విశాలమైన పెసరట్టు వేసి దాని పైన తన బతుకులో కనీ కనిపించని ఆనందమంత చిన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేడి వేడి పెసరట్టు ఇచ్చింది. విష్ణు అది తినేలోపు ఇంకో ఆరు వెయ్యాలి! మూడు మొగుడికీ మూడు దుర్గకి! ఆఖర్లో ఓపిక నశించి, రుచి మీద ఆసక్తి చచ్చి చాలీ చాలని పిండితో ఏ ఆర్భాటాలు లేని సాదా పెసరట్లు తనకి!

వెంటనే తయారయ్యి, మొగుడికీ తనకీ లంచ్ బాక్స్ పెట్టేసి దుర్గను పంపించి ఇంటితాళాలు తీసుకుని బయల్దేరింది పద్మావతి. ఆఫీసుకెళ్ళేటప్పుడు చెప్పులేసుకోడానికీ, భర్తకి వెళ్ళొస్తానని చెప్పడానికీ పెద్ద తేడా ఉండదు. రెండూ అనుభూతుల్లేకుండా యాంత్రికంగా చేసే పనులే! విష్ణు తీరిగ్గా ఓ గంట తర్వాత బయల్దేరాడు ఉద్యోగానికి.
  ***   ***     ***
పద్మా విష్ణులిద్దరూ అటూ ఇటుగా ఒకే సమయానికి ఇంటికి చేరుకుంటారు. ఎవరు ఎప్పుడొచ్చినా టీ పెట్టాల్సిన బాధ్యత మాత్రం పద్మదే! అంతేనా!? పకోడీలో, నూడిల్సో, అటుకులుప్మానో చేయడం కూడా! ఆ రోజు వేడి వేడి టీ తో పాటు కరకరలాడే అరటికాయ బజ్జీలు కూడా వచ్చాయి విష్ణు ముందుకి.
“ఏవండీ! మా అన్నయ్య ఫోన్ చేశాడు. చిట్టిది పెద్దమనిషి అయ్యిందంట! రేపట్నుంచీ మూడ్రోజులు మనందరికీ సెలవులే కదా! వెళ్ళొద్దామండి!” పెదవంచున టీ ఊదుకుంటూ చెప్పింది పద్మ.
“ఆహా! సరిగ్గా రేపట్నుంచీ సెలవులనే ఇవ్వాళ అయ్యిందా?”
“నిన్నే అయ్యిందంట! ఇవ్వాళ కూర్చోబెట్టారంట...”
“మరి మీ అన్నా వదినా నాకు ఫోన్ చేసి చెప్పలేదే?”
“మీకు ఫోన్ చేశారండి! తీయలేదంట!”
“అయితే మళ్ళీ చేయాలి! ఆహ్వానించాలి!!”
ఎన్ని సార్లు ఫోన్ చేసినా విష్ణు మాట్లాడ్డన్న విషయం తెలిసిందే! ‘రాను!’ అని చెప్పడానికి వాదన లేవనెత్తుతున్నాడు విష్ణు. ఆ వాదన విని ఖండించి ఒప్పించగలిగే ఓర్పూ, ఉబలాటం పద్మకి లేవు! అందుకే పిల్లని తీసుకుని వెళ్లాలని అనుకుంది. అదే విషయం చెప్పింది.  
“నువ్వెల్తే నాకు వంటా వార్పు ఎవరు చేస్తారు? ఏం వెళ్లక్కరలేదు. ఇంట్లో ఉండు!”
“మా అన్నయ్య పెద్దకూతురండీ అది! నేను లేకపోతే ఎలా? పోనీ కాఫీ టీలు బుజ్జి పెట్టిస్తుంది. రెండ్రోజులు బయట నుంచీ భోజనం తెచ్చుకోండి. పనమ్మాయి వచ్చివెళుతుంది కాబట్టి ఇబ్బందేం ఉండదు!”
“సరేలే! వెళ్ళాక వాళ్ళూ వీళ్ళూ ఉండమన్నారని ఉండిపోకు! ఎల్లుండి రాత్రికల్లా వచ్చేయ్!”

‘నాకు బయట భోజనం ఎక్కదు!’ అని అతని అంతరార్ధం! అంతేతప్ప పొరపాటున కూడా భార్య లేకుండా ఉండలేకపోవడం కాదు! జీతం తీసుకునే పనిమనిషైనా శెలవు పెడుతుందేమో కానీ ఉద్యోగం చేస్తూ వంటమనిషిగా స్థిరపడ్డ భార్యకి శెలవు పెట్టే అవకాశం ఉంటుందా!?
***     ***     ***
దుర్గ పని మధ్యలోంచి ఇంటికెళ్ళే సరికి రాజు పేడ తో ఇల్లంతా అలుకుతున్నాడు.
“ఏటి రాజూ! బుట్టలన్నీ అల్లేసావా? ఏ పనీ జెయ్యాపొతే తోచదేటి?” పొట్లంలోంచి గారెలు తీసి రాజు నోట్లో పెట్టింది.
“నాకెందుకే! నువ్వూ పండు గాడు తినండి”
“తింటాంలే! యామలత గారిచ్చారు గార్లు. కూసేపన్నా నిదరోవేటీ? ఎప్పుడూ ఏదోక పనెట్టుకుంటావ్! సరే నేనెల్త్నాను. గారేలిద్దారని పని మజ్జెలోంచొచ్చాను!”
దుర్గ రెండిళ్లలో పని పూర్తి చేసుకుని సాయంత్రానికి పద్మావతి ఇంటికెళ్ళిoది. బుజ్జి పాలు కాచి, కప్పులో కాఫీ పొడి, రెండు చెంచాలు పంచదార వేసి జాగ్రత్తగా వేడి వేడి పాల గిన్నెను మసిగుడ్డతో పట్టుకుని కప్పునిండా పోసి ఇచ్చింది తండ్రికి. అమ్మ ఇచ్చిన శిక్షణ బానే పని చేసింది! ప్రస్తుతానికి చేతులు కాల్చుకోకుండా కాఫీ పెట్టేసింది.
“ఏంటమ్మా ఇది? కాఫీ నేను సాయంత్రాలు తాగను! టీ మాత్రమే తాగుతాను! అందుకే చెప్పాను మీ యమ్మకి. ఎక్కడికీ తగలబడొద్దని! ఛ!” కాఫీ వాసన పసిగట్టి కనీసం కప్పు వంక కూడా చూడకుండా చిందులు తొక్కాడు విష్ణు.
బుజ్జి బెదిరిపోయింది! తండ్రితో చనువు తక్కువ. అమ్మ బాగా గుర్తొచ్చింది. ఇదే మాట అమ్మ అనుంటే వెంటనే మంచం పైనో కిందో పడుకుని రెండు గంటలు ఏడ్చేది! ఆ తర్వాత అమ్మ రావడం, బుజ్జగించడం, వళ్ళో పడుకోబెట్టుకుని లాలించడం, అన్నం తినిపించడం...అవన్నీ గుర్తొస్తున్నాయి...
బుజ్జి కాఫీ కప్పు తీస్కెళ్ళి టీ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అమ్మ చెప్పిన సూచనలన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తుచేసుకుంటూ వేరే కప్పు తీసింది. దుర్గ అంతా గమనిస్తూనే అంట్లు తోమడం, గదులు ఊడవడం చేస్తుంది. బుజ్జి టీ పెట్టి విష్ణుకిచ్చింది. ఒక్క గుటక తాగిన వెంటనే మొహం చిట్లించి కప్పు టేబుల్ మీద పెట్టేశాడు. అంటే ఇహ తాగడని అర్ధం!
“ఇంకా పనులు రాకపోవడమేంటమ్మా? నానమ్మ నీ వయసులో ఎంత పని చేసేదో నీకు చాలా సార్లు చెప్పింది కదా!” గదిమాడు విష్ణు.
బుజ్జి చిట్టి కళ్ళల్లో జరజరా నీటి బొట్లు రాలాయి. ఏదో పరాయి మనిషితో ఉoటున్నట్టుంది బుజ్జికి. సరదాకి చేసిన చపాతి అమీబాను తలపించినా అమ్మ ఎంత మెచ్చుకునేదో! ఏడ్చి ఏడ్చి బుజ్జి నిద్రలోకి జారుకుంది.
విష్ణు ఆకలికి నకనకలాడుతున్నాడు. పిలిస్తే పళ్ళెంలో భోజనం తెచ్చివ్వడానికి పెళ్ళాం లేదని గుర్తొచ్చి హోటల్ కి ఫోన్ చేసి హోం డెలివరీ కి ఆర్డర్ ఇచ్చాడు. బుజ్జి ని లేపాడు. పళ్ళెం తెచ్చి, కూరలు గిన్నెల్లో వేయడానికి!! కానీ బుజ్జి లేగలేదు. తప్పదనుకుని కిందా మీదా పడేసుకుంటూ భోజనం ముగించి పడుకున్నాడు విష్ణు. పద్మ నుంచి ఫోన్ రావడం కంటే ముందే!
పద్మ కూతురెలా ఉందో...టీ కాఫీలు పెట్టిచ్చే అలవాటు లేని పనులు ఎలా చేయగలుగుతుందో అని బెంగతో తినకుండా నిద్రపోకుండా హైరానా పడుతోంది అక్కడ!
  ***     ***   ***

 “దుర్గా! ఏటే నిదరట్టట్లేదా? మెదుల్తానే ఉన్నావ్?” కొడుక్కి జో కొడుతూ అడిగాడు రాజు.
“ఇయ్యాలొక అవిటిపెనివిటిని సూసానయ్యా!”
“తప్పే! నీ మొగుడూ ఒక అవిటోడే! ఎవల్నీ అలా అనకు!”
“సెప్పిచ్చుక్కొట్టేత్తాను ఎవడన్నా నిన్నా మాటంటే! అవిటోడంటే సేతులు కాళ్ళూ లేనోళ్ళు కాదయ్యా! ఉండీ ఆటిని ఉపయోగించుకోలేనోళ్ళు!”
“దుర్గా! ఏటైందే? ఏటా కోపం!?”
“అపార్మెంట్లో పని సేత్తాను కదా! పద్మమ్మ గారింట్లో...”
“ఆ! ఏటైంది? నిన్నేటన్నా అన్నారా?”
“నన్ననేంత మొగాడింకా ఎవడూ పుట్టలేదు గానీ! ఆయమ్మ పని మీద ఊరేల్తా పిల్లని అయ్యగార్కి టీలు, కాపీలు ఎడతాకి ఒదిలిలెల్లారయ్యా!”
“అయితే?”
“ఏటి అయితే గియితే అంటావ్!? అంత సిన్న పిల్ల నేర్సుకుని పనులు సేయ్యడమేటి?ఆయమ్మ పిల్లకి నేర్పించే బదులు మొగుడికే నేర్పించలేకపోయిందా?! ఒక్క రోజు పెళ్ళాం లేకుండా ఆడి తిండి ఆడు తినలేనోడ్ని అవిటోడనక ఇంకేటంటారు రాజు?”  
“అయ్యో! ఆయనకీ నాలాగే అవిటితనముందని ఎప్పుడూ చెప్పలేదేటి మరి?!”
“ఎల్లెహే! నీ తెలివి సంతకెల్ల! పచ్చ కావెర్లోడికి లోకమంతా పచ్చగుందనీ! పని సెయ్యని పతోడు కాళ్ళూ సేతులు లేనోడేనేటి?నువ్వు శాలా పని సేత్తావ్ కదా మన ఇంట్లో! మరి ఆయనేటి? ఒల్లంతా తిన్నంగా ఉన్నా ఆయన పనులు కూడా పెళ్ళాంతో సేయించుకుంటాడు!?తానానికి నీళ్ళెడ్డం కాడ్నుంచి, బట్టలుతికి ఇత్రీ సేసి, టిపినెట్టి, కాపీ ఎట్టి, అన్నం పళ్ళెంలో ఎట్టి నోటి కాడకిచ్చి, పడుకునే టైయానికి మజ్జిగిచ్చీ దాకా ఆయన పనులు, ఆవిడి పనులూ, పిల్ల పనులు ఆయమ్మే సేత్తది!”
“అదేటి? బట్టలు నువ్వు ఉతకవా?”      
“ఆయనగారికి పనోళ్ళు ఉతికితే నచ్చదంటయ్యా!”
“ఓహో! మళ్ళీ ఇదోటేటీ?”
“మరేటనుకున్నావ్!”
“సర్లేవే! మనకెందుకు ఆళ్ళ గోల! పడుకో!”
“థూ! ఆడిదీ ఓ బతుకేనా? సిన్న పిల్లతో పని సేయించుకుంటన్నాడు! ఒకేల మగ పిల్లోడైతే ఏం సేసేవోడూ?”
“ఏదోటి సేసేవోడు. మనకెందుకే. పడుకో”
“అంత ఒల్లు ఒంగనోడికి పెల్లీ, పిల్లా, సంసారం ఎందుకూ? మళ్ళీ ఆడ్ని ‘మీరూ’, ‘గారూ’ అని పిలాలి! నేనే నయం మొగుడ్ని పేరెట్టి పిలుత్తాను!”
“హహ్హహ! అందరూ మంచి మొగుళ్ళే ఉండరే! పెళ్ళాలే సెప్పుకోవాల ఆళ్ళ మొగుళ్ళకి! సాయం సేయమనో లేపొతే ఆడి పనులు ఆడ్నే సేస్కోమనో!”
“అబ్బ శా!మొగుళ్ళకి బుర్రల్లేవేటి? కల్ల ముందు పెళ్ళాలు గొడ్డు సాకిరీ సేత్తుంటే ఓ సెయ్యియ్యాలనిపించదూ? ఆడోళ్ళకేవన్నా నాలుగు సేతులుంటాయేటీ కాళీ మాతలాగా?”
“ఆడదానికెన్ని సేతులున్నా నోరుండదు కదే!”   
“ఒకేల నోరున్నా! ఇన్నేళ్ళ నుంచీ పనులు సేయించుకోటాకి అలవాటు పడ్డావోళ్ళు షడన్ గా పని సెయ్యమంటే సేత్తారoటావా రాజు?”
“ఓసి ఎర్రి మొకవా! ఇది పనిసెయ్యడం, సేతనవ్వాపోడం గురించి కాదే! మొగోడి బుద్ది గురించి! టీవీ కాడ్నుంచి లేసి అన్నం కూరలు ఏసుకుని తిండం సేతకాక అనుకుంటన్నావా? మోగోడి పనులు ఆడదే సేయ్యాల అని ఒక గర్వం! అది అమ్మైనా, పెళ్లావైనా, కూతురైనా, కోడలైనా!
అసలే పెళ్ళాం కూడా మొగుడితో బాటు దీటుగా ఉజ్జోగం సేసి సంపాదిత్తుoది! డబ్బులు ఐతే కావాలి కానీ, పెళ్ళాంతో సమానం అంటే మొగాడెలా ఒప్పుకుంటాడే? ఇంక ఆడదాంతో పాటు ఇంటిపనులు కూడా సేత్తే పెళ్ళానికీ ఈడికీ తేడా ఉండొద్దూ!? ఒకేల సేసినా ఏదో సిన్నా సితకా సాయం సేత్తారు గానీ పెళ్ళాం లాగా పొద్దున్నే లేసి పనులు మొదలెట్టరు కదా! ఎన్నో ఏళ్ళ తరబడి ఆడదాన్ని అట్టా తయార్సేసారు! కానీ...ఏదైనా ఆడోళ్ళకే సేతనౌద్దే! ఇది మొగోళ్ళ రాజ్జెం కాబట్టి ఆడది పెతీ నిమిసం పోరాడతానే ఉండాల! నోర్మూసుకుని ఉండాలో? ఎదిరించి గౌరం కాపాడుకోవాలో? ఆడదే నిర్ణయించుకోవాల! మీ పద్మగారేటి సేత్తారో!”
                                     ***      ***     ***

మరుసటి రోజు పొద్దున్నే దుర్గ పద్మావతిoటికి పనికెళ్ళింది. వంటగదిలో ఏదో గాజు సీసా భళ్ళున పగిలిన శబ్దం విని లోనికి పరుగెత్తిoది. బుజ్జికి ఏదైనా గాయమయ్యిందేమోనని! విష్ణువర్ధన్ విష్ణుమూర్తిలా సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నాడు. దుర్గ వంటగదిలోకి వెళ్ళే సరికి పద్మ పగిలిన గాజు పెంకులు ఎత్తుతోంది!
“అదేటమ్మా! రేపొత్తానన్నారు కదా!?”
“వంటకిబ్బందవుతుందని తెల్లవారే వచ్చేశాను దుర్గా!”
ఆడది నోరెత్తితేగానీ మొగాడిలో మార్పు రాదని రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దుర్గకి. పద్మ నోరెత్తకపోగా ఎదురు సేవలు చేస్తుంటే మొగుడికి అసలు మార్పు రావాలన్న అవగాహనేలా వస్తుందనుకుంది దుర్గ!    
పద్మ మొహం నలతగా ఉంది. సన్నగా వణుకుతుంది కూడా.
“ఏటమ్మా?జొరం గానీ ఒచ్చిందా?”
“ఔను దుర్గా! రాత్రి ప్రయాణం, అలసట, పైగా విపరీతమైన చలి గాలి కదా! నేను పడుకుంటాను. నువ్వు పని చేసుకుని వెళ్ళు”
పద్మ చలి జ్వరంతో రగ్గు కప్పుకుని వణికిపోతోంది. దుర్గ విష్ణువర్ధన్ కి విషయం చెప్పిన అరగంటకు చుట్టం చూపుకన్నట్టు వెళ్ళాడు.
“టాబ్లెట్ ఏమైనా వేస్కోపోయావా? ఆ సొరుగులోనే ఉంది కదా!” అన్నాడు రెండడుగుల దూరం నుంచే.
“అమ్మ గారేమీ తినలేదనుకుంటానయ్యగారూ! ఏడిగా పాలు కాసిత్తాను” అని హడావుడిగా వంటిoట్లోకెళ్ళబోయింది దుర్గ.
“ఆగు దుర్గా! ఆమే కాచుకుoటుందిలే! నువ్వు నీ పని చూస్కో చాలు!” చికాకు ప్రదర్శిస్తూ బుజ్జి ని పిలవబోయాడు విష్ణు.
“పని సేతకాని పిల్లెట్టిన టీ అయినా తాగుతారు గానీ, మాలాటి తక్కువ జాతోళ్ళు ఎట్టిన కాపీలు, టీలు, పాలు ఎందుకు తాగుతారండీ మీరు? మీరు ఒండుకుని తిన్న కంచాలు, సామాలు కడగతాకి పనికొత్తాం గానీ, కడిగిన గిన్నెలు అంటుకోటాకి పనికిరాం! పక్కనున్న సొరుగులోంచి మాత్రలు తీసివ్వలేని మొగుడికి సేవసేసి జొరం తెచ్చుకున్న పెళ్ళాం!! బా సరిపోయేరు ఇద్దరికిద్దరూనీ!ఛీ! మళ్ళీ ఈ గుమ్మం తొక్కితే మీ ఎడం కాలి సొప్పిచ్చుక్కొట్టండి!!”
విష్ణువర్ధన్ కొయ్యబారిపోయాడు ఆమె మాటలకి!!!
దుర్గ వెనుతిరగగానే వాకిట్లో రాజు కనబడ్డాడు రెండు కర్రల మధ్యలో.
“ఏటి రాజూ?ఇలగొచ్చావేటీ?” కంగారుగా అడిగిoది దుర్గ.
“ఆలెస్సమయింది కదా! ఇంకా రాలేదేటా అని యామలతమ్మ గారింట్లో, సీదేవమ్మ గారింట్లో సుసాను లేవు, ఇoక ఇక్కడికొచ్చాను” చమటలు కక్కుకుంటూ చెప్పాడు రాజు.
తన భార్య కోసం ఆందోళన పడుతూ నాలుగు కాళ్ళతో వచ్చిన రాజునే చూస్తున్నాడు విష్ణు.
ఓ కర్ర తీసేసి తన భుజం ఇచ్చి, రాజు నడుం పట్టుకుని నడిపించుకుంటూ వెళుతోంది దుర్గ...
జ్వరంతో వణుకుతున్న భార్యని రెండడుగులు ముందుకేసి నుదురు పట్టుకుని చూడ్డానికి బద్దకించిన విష్ణు తొలిసారి ఆలోచించడం మొదలు పెట్టాడు...‘అవిటిపెనివిటి’ ఎవరా అని!!       
                                      **********************
                                                                                      -మానస ఎండ్లూరి
                                                                             March, 2016 ‘మాతృక’ మాస పత్రిక

https://www.facebook.com/manasa.evangeline.9/posts/741525995984532

  

3 comments: