నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

11 Mar 2016

బొట్టు


 “ఒక్ఖ రోజు డ్రైవర్ లేని పాపానికి పూజ సామాను తెమ్మంటే ఏదీ సరిగ్ఘ తేలేదు! పటిక బెల్లం తెమ్మంటే తాటి బెల్లం తెచ్చారు. కేజీ నుపప్పు అని రాస్తే పావు కేజీనే తెచ్చారు. ఏవిటి చేస్కోటానికిట? తెలిసి తెలిసి చేయరాని తప్పు చేసి ఇప్పుడనుకునేం లాభం?నాది బుద్ధి తక్కువ! మళ్ళీ నేనే మార్కెట్ కెళ్ళాలి!”   

అసలే కాలేజీ టైం అయిపోతుందని హడావిడిగా తయారవుతున్న కామాక్షికి సరిగ్గా బయల్దేరేటప్పుడే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయి పాపం! రేపు వరలక్ష్మి వ్రతం. ఈ రోజు  సాయంత్రం ఆమె పని చేసే డిగ్రీ మహిళా కళాశాలలో స్టాఫ్ మీటింగ్ పెట్టాలి. ప్రిన్సిపాల్ ఆమే కాబట్టి తప్పించుకునే ప్రశ్నే లేదు. ఇంటికొచ్చేసరికి ఏ ఏడో ఎనిమిదో అవుతుంది. అలసట! నీరసం! అందులోనూ ఆమె కార్ డ్రైవర్ సెలవు! ఈ కష్టాలన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది కామాక్షికి!!

“నువ్విచ్చిన లిస్టే కదా కామాక్షీ పట్టుకెళ్ళి ఇచ్చాను. వాడవే ఇచ్చాడు”. జరిగింది పెద్ద సమస్య కాదన్నట్టు కార్ తాళాలు గోడకి తగిలిస్తూ అన్నాడు భర్త సుబ్రహ్మణ్యం.

“ఇస్తాడు!వాడికేం నొప్పిట? రెండు రెట్లు డబ్బులూ నొక్కుతాడు వెధవ ! చూసేవాళ్ళు మిమ్మల్ని ‘దేవుడు’ అని ఇందుకే అంటారు కాబోలు!! కాని కుటుంబానికి కావాల్సింది ‘భర్త’! దేవుడ్ని నేనేం చేస్కోను? ఉన్న ముక్కోటిమంది చాలదన్నట్టు! ఇంటికి, ఇల్లాలికేం కావాలి? పిల్లల్ని ఏ బళ్ళో చదివించాలి? ఏం చదివించాలి? ఏ బట్టలు వేయాలి ?ఏం తినిపించాలి?...ఇవన్నీ దేవుళ్ళు చేయరు!పెళ్ళాంతో బాటు మొగుడు కూడా చెయ్యాల్సుంటుంది. నా ఖర్మ కాలి ఈ ఇంట్లో మొగుడున్నా అన్నీ నేనే చేస్కుని ఛావాలి! నా పిల్లలకి, వాళ్ళ ఇంటి పేర్లకి తప్ప దేనికి పనికొచ్చారుట? బ్యాంకు ఉజ్జోగం, ఇల్లు తప్ప మరొక్కటి తెలిస్తే ఒట్టు! ‘మంచోడు మంచోడు’ అంటే మా నాన్నారు  ఒక్క గెంతు గెంతి ఈ పెళ్లి చేశారు. ఎన్నేళ్ళు గడిచినా ‘మంచోడు’ మంచోడి లానే ఉన్నారు గాని భర్తగా, తండ్రిగా మారనేలేదు! ఛ! ఇప్పుడు నే కాలేజీకెళ్ళాలి గా!మళ్ళా తాళాలు తగిలించేస్తారేవిటి? ఇలా తగలబెట్టండి.” మొహం చిట్లిస్తూ విసురుగా సుబ్రహ్మణ్యం చేతిలోంచి తాళాలు లాక్కుంది కామాక్షి.

సుబ్రహ్మణ్యం ఏదో పక్క గ్రహం నుంచి వచ్చిన వాడిలా ఏ స్పందనా లేకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.
‘డ్రైవర్ లేడు, పెళ్ళాన్ని కాలేజీలో దింపుదామన్న ఆలోచనే రాదు ఈ మనిషికి!’ మనసులో తిట్టుకుంటూ “హలో!మీ టూ వీలర్ మీద ఎంత దుమ్ముందో చూశారా? అది కూడా నేనే చెప్పాలిటా?”
భర్త మీద అరుస్తూ కార్లో హ్యాండ్ బాగ్, లంచ్ బాక్స్ పెట్టుకుంది కామాక్షి.

“చూశాను కామాక్షి,ఇప్పుడే తుడిచేస్తాను. పాత గుడ్డ ఎక్కడుందో వెదుకుతున్నా.” ఎప్పటిలా అమాయకంగా సమాధానమిచ్చాడు సుబ్రహ్మణ్యం.

“చాలు! ఇహ మూస్తారా నోరు? నా ఫోన్ మోగుతోంది.” హ్యాండ్ బాగ్లోంచి తన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతోంది కామాక్షి...

“హలో! గరికపాటి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేశారే?”
ఫోన్లో ఆయన గొంతు కొద్దిగా కామాక్షి కోపాన్ని పక్కన పెట్టింది.
“ఆ! బావున్నానండి. మీరు, సారు, పిల్లలు బావున్నారా?”
“ఆ! మావూలే గా! పిల్లలిద్దరూ అమెరికా లోనే చదువుకుంటున్నారు. మేవిక్కడ! వాళ్ళక్కడ! ఏవిటి మీ లేటెస్ట్ నవల?ఈ మద్జ పెద్దగా రాస్తున్నట్టు లేరు?”
“కాస్త ఇంటి పనుల్లో పడి తీరిక దొరకడం లేదండి! మా ఆవిడ పెద్దగా చదువుకోలేదు! పిల్లల చదువులూ అవీ నేనే చూస్కోవాలి! ఇప్పుడా పని మీదే ఫోన్ చేశాను. పెద్ద పాప ఆశ ఇంటర్ పాసైంది మేడం. బిటెక్ లో జాయిన్ చేయమంటుంది కానీ నాకు అంత సంపాదనెక్కడిది?! ఎప్పుడో ఒక్క నవల రాస్తే నాలుగు డబ్బులొస్తాయి గాని చేసే సబ్ ఎడిటర్ ఉద్యోగం చిన్నదేగా! ఇంజినీరింగ్ కాలేజి అంటే ఫీజు కాక మిగతా ఖర్చులూ అవీ ఎక్కువే ఉంటాయి. చిన్న పాపనీ, బాబుని కూడా చదివించాలి కదండీ! అందుకే అమ్మాయిని మీ కాలేజీలో డిగ్రీ చేర్పిద్దామని..”

“సరే సరే! అంతగా చెప్పాలేవిటండి? ఎంత గొప్ప నవలలు రాశారు మీరు! మర్చిపోగలమా మీ ‘ఆకాంక్ష’, ‘సంధ్య వేళలో ఎదురీత’ ముక్ష్యంగా మీ ‘పది ప్రమాణాలు’! ఇంకా ఎన్నో! మీ వీరాభిమానిని! అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. తప్పకుండా తనకిష్టమైన గ్రూప్ లోనే సీట్ చూస్తాను. ప్రముఖ నవలా రచయత కూతురు మా కాలేజీ పిల్ల అంటే మాకూ గర్వంగా ఉంటుంది. పైగా కాలేజీ ఫంక్షన్స్ కి మిమ్మల్నే వక్తగా, అధితి గా పిలవచ్చును!ఎప్పుడొస్తారు? ఒక గంటలో వచ్చేస్తారా కాలేజీ కి?”

తనకిష్టమైన రచయిత గరికపాటి సుందర్ ని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది కామాక్షి. ఆయన నవలలంటే ప్రాణం పెడుతుంది. ఎప్పుడో ఏదో సాహిత్య సభ లో ఇద్దరికీ పరిచయమైంది. తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశారు. ఎంతో ఆత్మీయంగా, స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడుతాడు సుందర్. సుబ్రహ్మణ్యం అంత కాకపోయినా కాస్త అందగాడే!
          అమాయకుడైన చేతగాని అందగాడికంటే; చిన్న జీతగాడై, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ,అద్భుతమైన నవలలు రాసే తెలివైన సంసారి నయం అన్న అభిప్రాయం కలిగేది సుందర్ తో మాట్లాడిన ప్రతిసారి! పైగా పేరు కూడా మనిషికి తగ్గట్టే వినసొంపుగా ఉంటుంది. ఆయన కూతురు తన కాలేజీ లోనే చేరితే అడపాదడపా ఆయన కనపడతాడన్న చిన్న ఆలోచన.

ఆమె ఆలోచనల్ని చెదిరిస్తూ “లేదండి కామాక్షి గారు క్షమించాలి!ఇవ్వాళ విజయవాడ లో ఒక సాహిత్య సభ కి పిలిచారు. ఎవరిదో కథా సంపుటి ఆవిష్కరించాలి. ఆ పని మీద వెళుతున్నాను. అసలే రేపు సెలవు కదా! సీట్లు ఉంటాయో అయిపోతాయో అని మా పాపని, వాళ్ళమ్మని పంపిస్తున్నాను. కొంచెం ఈ సాయం చేసిపెట్టాలి.”

‘హ్! నా మొగుడల్లె రోజూ ఇంటికి ఆఫీసుకి మధ్యలో మాత్రమే కొట్టుమిట్టాడే టెన్నిస్ బంతా ఈయన?ఎన్నో పనులుంటాయి!’ అనుకుని
 “తప్పకుండా అండి.ఇక గరికపాటి వారి గాలి వీస్తుంది మా కళాశాలలో! ఉంటానండి.కాలేజీ కి బయల్దేరుతున్నాను.” అని ముగించి మెల్లగా కార్ స్టార్ట్ చేసి ముందుకి సాగింది కామాక్షి. సుబ్రహ్మణ్యం కనీసం ఆమె వెళ్లేది గమనించలేదు. ఆమె ‘ వెళ్ళొస్తానని’ చెప్పడం ఎప్పుడో మానేసింది.

కామాక్షి కార్ నడిపి చాలా రోజులైంది. అందువల్ల కాస్త ఆలస్యంగా చేరుకుంది. ఆమె ఆఫీసు రూమ్ కి వెళ్ళే సరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అడ్మిషన్స్ అవుతుండడంతో కళాశాల విద్యార్దినులతో, వారి తల్లిదండ్రులతో చాలా రద్దీగా ఉంది. కామాక్షి పనులు మొదలు పెట్టేలోపే అటెండర్ ఒక చీటీ ఇచ్చాడు. మడతలు విప్పి చూస్తే ‘గరికపాటి సుందర్’ అని ఉంది. వెంటనే వాళ్ళని లోనికి పంపించమంది .  అటెండర్ బయటకు వెళ్ళగానే తన కళ్ళజోడూ ముంగురులూ సర్దుకుని, పెదాలు తడిచేసుకుని చేత్తో పెన్ పట్టుకుని అవసరం లేకున్నా ఎదురుగా ఉన్న కాగితాల మీద ఏదో రాస్తున్నట్టు భంగిమ పెట్టింది.
గరికపాటి వారి భార్యా కూతురు లోనికి రావడం గమనించి కాగితాలలోంచి ముఖం పైకెత్తి నివ్వెరబోయింది!! వాళ్ళిద్దరూ ఆమె ముందుకొచ్చి నిలబడ్డారు. కూర్చోమని చెప్పడానికి బదులు ఆమే ఆశ్చర్యంతో లేచి నిలబడింది. అర నిమిషం పాటు నిశ్శబ్దం!ఇక చేసేది లేక కామాక్షి తేరుకుని “మీరూ...?” అని అడిగింది అనుమానంగా.
సుందర్ భార్య, కూతురు నమస్కరించారు.
“గుడ్ మార్నింగ్ మేడం!మై నేమ్ ఈజ్ గరికపాటి ఆశాజ్యోతి . డాడీ మిమ్మల్ని కలవమన్నారు. ఈవిడ మా అమ్మగారు కరుణ.నేను ఇంటర్ మీడియట్ యం పి సి నైంటీ టు పర్సెంట్ తో పాసయ్యాను మేడం. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ బి యస్సి కెమిస్ట్రీ. మిగతా గ్రూప్స్ లో ఆల్రెడీ సీట్స్ అయిపోయాయంట మేడం.
‘ఇక చెప్పాల్సింది మీరే’ అన్నట్టు కామాక్షి సమాధానం కోసం ఎదురు చూస్తోంది ఆశాజ్యోతి. కరుణ ప్రేక్షక ప్రాతకే పరిమితమైంది.
కామాక్షి వాళ్ళని ఎగా దిగా చూసి “నీ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా” అని అడిగింది.
ఆశా జ్యోతి చాలా ఆశ గా ఫైల్ ఇచ్చింది. కామాక్షి కూర్చోలేదు, వాళ్ళని కూర్చోబెట్టలేదు. సర్టిఫికెట్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తోంది... ‘స్కూల్ ,ట్రాన్స్ఫర్,మైగ్రేషన్...ఆ...కాస్ట్! దొరికింది.’
కామాక్షి మనసులోనే నిర్ణయం ధృడంగా తీసుకుంది.
అందంగా నవ్వుతూ “సారీ రా తల్లీ! కెమిస్ట్రీ లో సీట్స్ ఇందాకే అయిపోయాయి. సివిక్స్, హిస్టరీ లో ఆఖరి సీట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా ఉంటాయో లేదో చెప్పలేం. నాన్నగారితో నేను మాట్లాడుతాను. వేరే కాలేజీ లో సీట్స్ ఉన్నాయేమో నేనే కనుక్కుని చెప్తాను . ఆల్ ది బెస్ట్ అమ్మా!” అని చెప్పి ఫైల్ వెనక్కి ఇచ్చేసి ‘వెళ్ళండి’ అనే నమస్కారం చేసింది.
ఆశా జ్యోతి ఆశలు అడియాసలై ఆమె నుదుటి మీద లేని కుంకుమ బొట్టు కళ్ళల్లోంచి కన్నీటి బొట్టై రాలింది. వాళ్ళు వెనుతిరగగానే కామాక్షి గబగబా ఫోన్ ఆన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ తీసి ‘జి’ లో గరికపాటి నెంబర్ డిలీట్ చేసింది. అతన్ని కలిసిన రెండు సార్లూ మొహానికి బొట్టెందుకు  లేదో ఇప్పుడు అర్ధమైంది! ఈ గరికపాటి ఆమె అనుకున్న ‘ఘనాపాటి’ కాదని తెలుసుకుంది!!
                                                                                                       -ఎండ్లూరి మానస          
                                                  2 July 2015, సారంగ సాహిత్య అంతర్జాల వార పత్రిక
             
http://magazine.saarangabooks.com/2015/07/02/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/









1 comment: