నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

17 Mar 2016

అబద్ధం


“నీకే భయమూ లేదు అను! మీ అమ్మా నాన్నా మా అమ్మానాన్నా నీ తోనే ఉంటారు. కాలేజీ పని మీద కచ్చితంగా హైదరాబాదు వెళ్ళక తప్పడం లేదు. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నా మనసంతా నీ మీదా మహి మీదా మనకు పుట్టబోయే బిడ్డ మీదే ఉంటుంది. అక్కడ పనవ్వగానే బస్సో రైలో పట్టుకుని నీ ముందు వాలిపోతాను. ఈ సారి నాకు స్వాగతం కొడుకుతో ఇస్తావో మళ్ళీ కూతురుతో ఇస్తావో..ఎవరైనా ఒకటే అనుకో”
ఎంతో మురిపెంగా తన భార్య అనురాధ నిండు గర్భాన్ని ముద్దుపెట్టుకున్నాడు సురేష్.
“అత్తయ్య రేపే మంచిరోజు అని చెప్పారు సురేష్. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. మహికి నువ్వు ఊరెళుతున్నావని తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. త్వరగా వచ్చేయ్! మహలక్ష్మి పుట్టినప్పుడు నార్మల్ డెలివరీనే కాబట్టి రెండో కాన్పు కూడా అలాగే అవుతుందేమో అనుకున్నా. కానీ...ఆపరేషన్ అంటే చాలా భయంగా ఉంది సురేష్.”
అంతా బానే జరుగుతుంది. దిగులు పెట్టుకోకు అనూ. మన మహాలక్ష్మి బజ్జుంది. ట్రైన్ కి టైం అవుతుందిక నేను బయల్దేరుతాను మరి. జాగ్రత్త
అమ్మ నాన్నలకి, అత్త మామలకి వీడ్కోలు చెప్పి హైదరాబాదు బయలుదేరాడు సురేష్. ఆటోలో కూర్చుని ఇంటికి దూరమయ్యే కొద్దీ కన్నీళ్లు బొట బొటా రాలాయి...భౌతికంగా ప్రయాణం చేస్తున్నాడు కానీ మానసికంగా మూడేళ్ళ కూతురు మహి పక్కనే పడుకొని జో కొడుతూ లాలి పాడుతున్నాడు!      
అనురాధకు ఆపరేషన్ లో పండండి ఆడబిడ్డ పుట్టింది. సురేష్ రెండ్రోజుల తరవాత బయల్దేరాడు. వచ్చీ రాగానే పెద్ద కూతురు మహిని పది నిమిషాల సేపు హత్తుకునే ఉన్నాడు. ఆ తర్వాతే భార్యైనా ఎవరైనా. పురిటి బిడ్డను చేతుల్లోకి తీసుకున్న వెంటనే మహి పుట్టిన క్షణాలు జ్ఞాపకమొచ్చాయి అతడికి.
అనూరాధ ఆసుపత్రి నుంచీ ఇంటికొచ్చిన నాలుగవ రోజు సురేష్ సహుద్యోగులు వచ్చారు.    
“రండ్రండి! చాలా రోజులైంది చూసి. బావున్నారా?” నవ్వుతూ ఆహ్వానించింది అనూ.
వచ్చిన స్త్రీలిద్దరూ అయోమయంగా మొహాలు చూసుకుని కూర్చున్నారు.
“ఇంట్లో ఎవరూ లేరండి. మహి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. మీరు కాలేజికి వెళ్ళలేదా ఇవ్వాళ?” మంచినీళ్ళు అందిస్తూ అడిగిoది అను.
“వెళ్ళలేదండి. ఇవ్వాళ మాకు పక్క ఊరిలో ఆన్ డ్యూటీ ఉంది. వెళ్ళొస్తూ మిమ్మల్ని చూసెళదామని ఇలా వచ్చాం. ఆరోగ్యం అదీ బానే ఉందా మీకు?”  
“బానే ఉన్నానండి” కుర్చీలో కూర్చుంటూ చెప్పింది అనూ.
“విషయం తెలియగానే వద్దామనుకున్నాం గానీ పని వత్తిడి వల్ల రాలేకపోయాం. సురేష్ గారు చెప్పగానే చాలా బాధపడ్డాం. అందరికీ కన్నీళ్లు వచ్చేశాయి. పాపం! ఆశ పడినట్లే మగపిల్లాడు పుడుతున్నాడని తెలుసు. కానీ పుట్టకముందే కడుపులో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ బాధలోంచి బయటకు రావడం కష్టమే! కానీ ఏం చేస్తాం!”   
“దేని గురించి మాట్లాడుతున్నారు మీరు?” అయోమయంగా అడిగింది అనురాధ.
“సురేష్ గారు మీ కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా తెల్సుకోడం కోసం విశ్వ ప్రయత్నాలూ చెయ్యడం, అవి ఫలించడం కాలేజీలో అందరికీ తెలుసులెండి! ఉమ్మనీరు తాగకుండా ఉంటే బాబు బతికే వాడే పాపం! మీ అమ్మాయి మహాలక్ష్మికి ఖచ్చితంగా తమ్ముడే పుడతాడని ఎంతో సంబరపడిపోయేవారు. ‘ఇంటికి ‘మహాలక్ష్మి’ ఎప్పుడూ ఒక్కత్తే ఉండాలి’ అంటుండే వారు. బాబు చనిపోయినా ఆయన లెక్క మాత్రం తప్పలేదు! చాలా తెలివైన వారండి సురేష్ గారు”
లోపలి గదిలో నిద్రిస్తున్న రోజుల పాప ‘కేర్ కేర్’ మని ఇంటి కప్పెగిరిపోయేలా ఏడుపందుకుంది. అనూ గబుక్కున లేచి లోనికి వెళ్ళింది. లోపల ఏడ్చేదెవరా అని వచ్చిన స్త్రీలిద్దరికీ మతిపోయినంత పనైంది!
అనురాధ భుజం మీద టవల్ వేసుకుని పాపకి పాలు పడుతూ వచ్చి కూర్చుంది. వాతావరణం గజిబిజిగా ఉందక్కడ.
‘ఇంతసేపూ తను చెప్పింది సురేష్ భార్యా బిడ్డల గురించేనా?’ చెప్పినామెకే అనుమానం! రెండో ఆమె నోరు విప్పింది.
“ఈ బాబూ...?”
“బాబు కాదండి పాప. మీరేమనుకోకపొతే...నాకు కాస్త నీరసంగా ఉంది. కాసేపు పడుకుంటాను.” మొహమాటంగా అనింది అను.
“ఏం పర్లేదు. మళ్ళీ కలుస్తాం. వెళ్ళొస్తామండి” మనసులో అనేక ప్రశ్నలతో వెనుదిరిగారు ఆ ఇద్దరూ.
బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు పాలిస్తున్న తల్లి ఎంతటి మధురానుభూతికి లోనౌతుందో అందుకు పూర్తి విరుద్ధoగా అనురాధ తల్లి మనసు ముక్కలు ముక్కలై గుండెలవిసేలా రోదిస్తోoది. వచ్చిన వాళ్ల ముందు ఆ కన్నీటి ప్రవాహాన్ని ఆపుకోవడానికి ఎంత నరకం అనుభవించిందో ఆమెకే తెలుసు. వాళ్ళు చెప్పిన ఒక్కో విషయానికీ అనూ గుర్తు తెచ్చుకుంటున్న ప్రతీ సంఘటనకీ సరిగ్గా పొంతన కుదిరింది!
కడుపుతో ఉన్నప్పుడు అనూ తల వెంట్రుకకి వారి పెళ్లి ఉంగరం కట్టి ఆమె గర్భం పై గాల్లో ఊపేవాడు సురేష్. అడిగితే ‘బిడ్డ ఎదుగుదల తెలుసుకోడానికి ఇదో కిటుకు. ఇంటర్నెట్ లో చదివాను’ అనేవాడు! చిన్న పిల్లలా మురిసిపోయేది అను. మరో సారి చైనీస్ క్యాలెండర్ అని ఏవేవో లెక్కలు వేశాడు. ఎందుకంటే ‘వాళ్ల పద్ధతుల ప్రకారం కూడా బిడ్డ మంచి రోజు పుట్టాలి కదా ఆడపిల్లైనా మగపిల్లాడైనా’ అని బొంకాడు. ఎన్నో సార్లు యూరిన్ టెస్ట్ చేయించాలని సాంపుల్స్ తీసుకున్నాడు. వాటితో ఇంకెన్ని సొంత ప్రయత్నాలు చేశాడో తెలీదు! ఈ అత్యాధునిక అంతర్జాల అక్షయ పాత్రలో తవ్వే కొద్దీ సమాచారం దొరుకుతూనే ఉంటుందిగా. ఫోన్లంత స్మార్ట్ గా మనుషులూ వారి మనసులూ స్మార్ట్ గా ఉంటే బావుణ్ణు!
ప్రసవం అయిన వెంటనే వస్తానన్న సురేష్, మొహంలో ఎటువంటి సంతోషం లేకుండా రెండ్రోజుల తరువాత వచ్చాడు. పని వత్తిడి, ప్రయాణం వల్ల అలసట అనుకుoది అనురాధ. అష్టలక్ష్ముల్ని పూజించే సురేష్ కేవలం ఆదిలక్ష్మినే కూతురిగా స్వీకరించడానికి సిద్ధమయ్యాడు తప్ప రెండవ కూతురిని ధనలక్ష్మిగా అంగీకరించలేకపోయాడు. మగపిల్లాడు కావాలని ఏనాడూ బయటపడకుండా నటనతో నమ్మించాడు. ఆడపిల్ల పుట్టిందని కాలేజీలో తెలిస్తే వేసిన లెక్కలన్నీ తప్పాయనీ, అందరి ముందూ మళ్ళీ ఆడపిల్లే పుట్టిందనీ చెప్పుకోడానికి నామోషీ పడి బాబు పుట్టి చనిపోయాడని అబద్ధం చెప్పాడు! నిజానికి చనిపోయింది బిడ్డ కాదు, సురేష్ లోని తండ్రి! ఒక ప్రేమించే భర్తగా, కూతురంటే ప్రాణoగా చూసుకునే తండ్రిగానే అందరికీ తెలుసు తప్ప తనలో ఒక ‘మగ పిచ్చి’ తో రెండో కూతుర్ని ద్వేషించే తండ్రి ఉన్నాడని ఇప్పటి వరకూ అతనికి మాత్రమే తెలుసు!
అనూ ఆలోచనల్లో తల మునకలై ఉండగా సురేష్, అత్తా మామలు, అమ్మా నాన్నలు, మహి వచ్చారు.
అనురాధ తల్లి చిన్న పాపని సురేష్ చేతుల్లో పెట్టి “అల్లుడు గారూ! మీ ఇంటికి మీ పెద్దకూతురు మహాలక్ష్మి అయితే చిన్నది ధనలక్ష్మి! పుట్టుక తోనే మీకు హైదరాబాదులో ఉద్యోగం తీస్కొచ్చింది. చూశారా” అంది.
సురేష్ ఆశ్చర్యoగా మావగారి వైపు చూశాడు. ఆయన పొద్దున్న పోస్ట్ లో వచ్చిన ఉత్తారాన్ని సురేష్ చేతికిచ్చారు. రెండో పాప పుట్టినప్పుడు హైదరాబాద్ కాలేజీలో సురేష్ ప్రతిభ చూసి అనుకోకుండా పెద్ద జీతంతో ఉద్యోగావకాశo వచ్చింది.
సురేష్ తన చేతుల్లో ఉన్న పాప కళ్ళలోకి చూశాడు. మల్లెపూవంత స్వచ్ఛంగా నవ్వుతోంది! ఆ నవ్వు సురేష్ కల్మషంతో నిండిన మనసుని కడిగేసింది. తను చెప్పిన అబద్ధానికి పశ్చాత్తాప్పడుతూ పాపని గుండెలకు హత్తుకుంటూ మోకాళ్ళపై పడి అందరి ఎదుటా కన్నీరు మున్నీరయ్యాడు. అందరూ అవాక్కయ్యారు...అనురాధ మటుకు అసహ్యంతో సురేష్ వైపు నుండీ చూపులు తిప్పుకుంది.
“నా రక్తాన్నే నేను చీదరించుకున్నాను. నేను పాపత్ముడ్ని! కొడుకు పుట్టలేదనే కోపంతో నామోషీతో అందరికీ బాబు పుట్టి చనిపోయాడని చెప్పాను. ఆ విషయాన్ని నిజం చేద్దామనుకున్నాను కూడా!! నన్ను క్షమించు అనూ!‘విష’యమంతా బయటపెట్టాడు సురేష్.
అందరికీ కాళ్ళ కింద భూమి కంపించినట్టైంది! వాళ్లు విన్నది నమ్మలేకపోతున్నారు. సురేష్ సహుద్యోగులు వచ్చి చెప్పిన విషయమంతా వివరించింది అనురాధ.
సురేష్ చెంప చెళ్ళుమనిపించింది అతని తల్లి! కొడుకు మొహం చూడ్డానికి కూడా చీదరించుకుంది!
“నలుగురికీ విద్యను బోధించే పవిత్రమైన వృత్తిలో ఉన్న వాడి బుద్ధే ఇంత వక్రంగా ఉంటే ఇక మిగతా వారి సంగతేమిటి? మేము ఎప్పుడూ కొడుకూ కూతురూ అని తేడాలు చూపలేదు. మరి నీకేలా వచ్చిందిరా ఇలాంటి నీచమైన ఆలోచన?” తల బాదుకున్నాడు సురేష్ తండ్రి.
“అమ్మా అనూ! తల్లిగా వాడ్ని నేను ఎన్నటికీ క్షమించలేను. కానీ నువ్వు భార్యగా వాడ్ని ఏం చేస్తావో నీకే వదిలేస్తున్నాను! వాడి బదులు మేము నీకు క్షమాపణ చెబుతున్నాం తల్లీ” సిగ్గుతో చితికిపోతూ అంది సురేష్ తల్లి.
“నేను అతనితో బతకలేను. అతని వల్ల నా పిల్లలకు ప్రాణహాని ఉంది. ఈ రోజు రెండో కూతుర్ని ద్వేషించిన వాడు రేపు పెద్ద కూతుర్ని కూడా ద్వేషించడని ఏంటి నమ్మకం? నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను” దృఢంగా చెప్పింది అనురాధ.
ఈ మాటలు వినగానే సురేష్ గుండె చెరువైంది.
“అంత మాట అనకు అనూ! నువ్వూ పిల్లలూ లేకపోతే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? దయచేసి నన్ను పెద్ద మనసుతో క్షమించు” కుమిలిపోయాడు సురేష్.
“చూడమ్మా! నీ భర్త తనంతట తనే చెప్పిన అబద్ధాన్ని, చేయాలనుకున్న పాపాన్ని ఒప్పుకుని మన్నిoచమన్నాడు. మంచివాడికంటే తప్పు చేసి మారినవాడు గొప్ప వాడు. క్షమించడానికి కొంత సమయం పట్టినా అల్లుడిని దూరం చేసుకోకు.” వివరంగా చెప్పాడు అనూ తండ్రి.
ఆ తరువాత నుండీ సురేష్ చిన్నపాపను కూడా పెద్దకూతురు మహలక్ష్మితో సమానంగా అల్లారు ముద్దుగా పెంచసాగాడు. తన కాలేజీ వారందిరినీ పిలిచి పెద్ద ఎత్తున బారసాల జరిపి చిన్న పాప కి ‘ధనలక్ష్మి’ అని పేరు పెట్టాడు.   
ఇప్పడు సురేష్ కి రోజూ భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడంతో పాటు మరో దినచర్య కూడా ఉంది. అది...ప్రతి పది నిమిషాలకీ కూతుళ్ళిద్దరితోనూ ‘స్వయం చిత్రాలు’ దిగి ముఖ పుస్తకంలో పెట్టడం.
                                                          **************
                                                                                      -మానస ఎండ్లూరి    
                                                                       విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, మార్చ్ 2016



5 comments:

  1. message is gud. but the story is just normal. he started loving his daughter only after believing that she brought him fortune... how sad!

    ReplyDelete
  2. message is gud. but the story is just normal. he started loving his daughter only after believing that she brought him fortune... how sad!

    ReplyDelete
  3. ఈరొజుల్లో కోడుకే కావాల‌నుకుంటున్నా చాల‌ మందికి
    మీ క‌ధ‌ ఆలొచింప‌జేస్తుంది
    చాలా బాగుంది మాన‌స‌ గారు

    మీరు‌ SCఉప‌ కులాల‌ గురించి కుడ‌ రాయ‌ల‌ని కోరుకుంటున్నాను
    – రాజేష్ గోసాయ్

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా రాస్తాను. thank you రాజేష్ గారు

      Delete