నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

11 Mar 2016

అర్ధజీవి


ఈ మధ్య కాస్త ఒళ్ళు చేశాను.
దానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధమమైనది పనిమనిషిని పెట్టుకోవడం!
లేకపోతే?శ్రీపాద వారి కథలు చదువుదామంటే అంట్లు గుర్రున చూస్తుంటాయి!విశ్వనాథ గారి రచనలు తిరగేద్దామంటే వంట ఠoగున గంట కొడుతుంది!తిలక్ తో ఊరి చివరి దాకా వెళ్ళొద్దామంటే గంపెడు బట్టలు బిక్కుబిక్కుమంటుంటాయి!పోనీ తాపీగా ధర్మారావు గారిని పలకరిద్దామంటే, ఊడవమని నా ఇల్లు చీపురు కట్ట తిరగేస్తుంది!
అందుకే, బరువు నేను తీస్కోని బాధ్యతలు పనమ్మాయికిచ్చాను. కానీ ఎక్కడా!? రెండు నెలలు చేసిందో లేదో జీతం పెంచమనీ, కొత్త చీర కొనివ్వమనీ నానా హైరానా చేసింది!చేస్తే చేసింది.పనిమానేసి వెళ్ళిపోయింది!మళ్ళీ కథలు కంచికి, బాధ్యతలు నెత్తి మీదకి, బరువు గాల్లోకి! నా భర్తకి ఈ తేడాలేవీ కనబడవు!రుచులకు వంకలు పెడుతూ టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళడం తప్ప ఏ పాపం పుణ్యం ఎరుగడు!
ఒళ్ళు పెరిగాక ఓట్స్ తినడం ప్రారంభించాను!
‘ఎంత తక్కువ తిన్నా, కూర్చుని చదవడం, రాయడం మాత్రమే చేస్తుంటే ఒళ్ళు పెరక్క ఏమౌతుంది!?’ మనసులో ఏమీ దాచుకోకుండా నిష్కపటంగా అన్న నా భర్త మాటకి లోబడి కథలు రాయడం కాస్త పక్కన పెట్టాను, గదులు ఊడ్చి, తడి గుడ్డ పెట్టడానికి!సరిగ్గా అప్పుడే వాకిట్లో ఓ దేవదూత ప్రత్యక్షమైంది! ఆమె పేరు నాగమణి అని తెలిసింది అడిగాక.
‘రెండు వేలు!’ అనగానే పనిదూత పోయి దగాకోరు వెలిసింది!
“ఏవమ్మా? ఇంత అన్యాయంగా అడుగుతారు? ఉన్నది నాలుగు గదులు, ఇద్దరు మనుషులు!అంట్లు,బట్టలు, గదులూడ్చి తడిగుడ్డ పెట్టడానికి రెండు వేలా?” గట్టిగా అడిగాను.
ఆమె ముఖంలో ఏ భావనా లేదు. కేవలం నిర్లిప్తత అలుముకుంది. పీలగా, మొహం పీక్కుపోయి, కళ్ళు నిర్జీవంగా, బేల చూపులు, ఎముకలు బయటపడి ఉంది ఆమె శరీరం. ఏదో కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. కానీ ఆమె చీరకున్న పట్టంచు మాత్రం ఆశాజ్యోతిలా వెలుగుతోంది!
‘బతికి చెడైనా అయ్యుండాలి లేదా ఎవరో ఆ చీర ఇచ్చుండాలి! అయినా ఈ మధ్య పనిమనుషులు నెట్ చీరలు లేందే బయటకి రావడం లేదు.వాళ్ళూ బానే సంపాదిస్తున్నారు!’ అనుకున్నాను మనసులో.
“ఎంతిస్తారండీ?”
ఆ మాటలో యాసలేదు!మెళ్ళో తాడు లేదు, చేతులకు రెండు మట్టి గాజులు, ఖాళీ నుదురు, చెవులకి, ముక్కుకి రంధ్రాలు తప్ప లోహాలు లేవు! చర్చికెళుతుందేమో అనుకున్నాను. ఆ విషయం వెంటనే అడక్కుండా ఉండనూ లేను!
“దేవుడ్ని నమ్ముకున్నావా?”
మళ్ళీ సమాధానం లేదు! ఆమె మౌనానికి కారణాలూ, ఆమె కష్టాలూ నష్టాలూ నాకెందుకూ?
ఆ మౌనాన్నే అదనుగా తీసుకుని వెయ్యి రూపాయలకి రమ్మన్నాను. బేరాలు చేయడం రాదో ఏమో! మారు మాట్లాడకుండా రేపట్నుంచీ వస్తానంది!
పనిమనిషికి రెండు వేలివ్వలేని పరిస్థితి కాదు గానీ వాళ్ళడిగినంతా ఇవ్వకూడదు కదా! అసలు రేటుకి ఐదారొందలు ఎక్కువేసి అడుగుతారు!మనం బెరమాడాలి!అదేగా ఏళ్ళ తరబడి నడుస్తున్న ఆచారం!
మరుసటి రోజు నుండీ నాగమణి పనిలోకొస్తుంది.
మాటా పలకరింపు లేకుండా మొహమాటంగా ఇల్లూడ్చి పాత్రలు తోమి బట్టలుతికి చెప్పకపోయినా సాయంత్రం పూట ఉతికిన బట్టలు మడత పెట్టి ఒద్దిగ్గా పని చేసుకుని వెళ్తుంది. అప్పుడప్పుడు మిగిలిన ఇడ్లీలు, దోశెలు, అన్నం, కూరలు ఇస్తున్నాను. అవి మాత్రం వద్దనకుండా పట్టుకెళుతుంది. నేనిచ్చేవి కూడా కేవలం మేం తిననివేలే!
పాత పనిమనిషి చక చకా పనులు చేస్తూ లొడలొడా కబుర్లు చెప్పేది. వాళ్ల కుటుంబ రాజకీయాలు, బకాయిలు, మొగుడి రంకు వేషాలు, ఇంకా ఏవేవో చెప్పేది. అంతా చెప్పి ఓ పది వేలు అప్పడుగుతుందేమోనని  నాకు ఓ పక్క కంగారుగా ఉండేది!కానీ ఈ మణి ఒక్క మాటా మాట్లాడదు. ఈమెనీ కదిలిస్తే కష్టాలన్నీ ఏకరువు పెట్టి ఎక్కడ అప్పడుగుతదో అని చిన్న భయం లోలోపల!
 ఏదేమైనా నేను మటుకు ఇప్పుడు సంతోషంగా చీపురు పడేసి కలం పట్టుకున్నాను. చాట వదిలేసి పుస్తకం తీసుకున్నాను. మొన్న రాస్తూ వదిలేసిన ఓ కథ పూర్తి చేసే పనిలో పడ్డాను. కథ ముగింపుకి దగ్గరలో ఉన్నా, సమయం మించిపోతున్నా మణి ఇంకా రాలేదు. గంటన్నర ఆలస్యంగా వచ్చింది.
“ఏం మణి? ఇంత ఆలస్యం ఐతే ఎలా?పనులన్నీ అలాగే నిలిచిపోయాయి!”ఆమె ఆలస్యం వల్ల కొంపలంటుకుపోవని నాకూ తెలుసు, ఆమెకీ తెలుసు!
మౌనంగా వెళ్లి అంట్లు తోమడం మొదలు పెట్టింది. పడగ్గదిలో నేను కథ రాస్తూ తిని వదిలిపెట్టిన ఓట్స్ గిన్నె వేశాను తోమడానికి.
అప్పడిగే వాడికి ఒకే దారుంటే ఇవ్వనని తప్పించుకు తిరిగే వాడికి వంద దార్లుoటాయి! ఆ ధైర్యంతో మణి కుటుంబ విషయాలు అడిగాను. అంతే తప్ప నలతగా ఉన్న ఆమె మొహం చూసి ‘ఒంట్లో బాలేదా?’ అని మాత్రం అడగలేదు! ‘అవునండీ రేపు రాను!’ అని రెండ్రోజులు పని మానేస్తుందేమోనని!
“నేనూ, నా ముగ్గురు కూతుళ్ళు ఉంటామండీ.ఈ ఊరొచ్చి నెల రోజులౌతుందండీ” గదులూడుస్తూ చెప్పింది మణి.
“మరి మీ ఆయన..?”
“లేరండి” కచ్చిగా కసిగా కోపంగా చెప్పింది.
అంటే ఆమె నిరాడంబర ఆహార్యానికి కారణం దేవుడు కాదు, ఆమె మొగుడు! కుతూహలానికి ఆడా మగా తేడాలుండవుగా! వెంటనే అడిగేశాను.
“ఎక్కడికెళ్ళాడు?”
మొదటి సారి ఓ పనిమనిషి తన భర్తని ‘రు’ అని సంబోధించడం విన్నానని నా అమర్యాద అలవాటుని నేనెలా మార్చుకుంటాను? అతన్నీ ‘రు’ అనీ నా మొగుడ్నీ ‘రు’ అంటే! తేడా ఉండొద్దూ...!? అంటే ఎదురింటి ఆయన్ని కూడా నేను ‘రు’ అని పిలిచినంత మాత్రాన ఆయనా, నా మొగుడూ ఒకటే కాదనుకోండి!
“చచ్చిపోయారండీ” ఊడ్చిన చెత్త బుట్టలోకి ఎత్తి పోస్తూ చెప్పింది.
‘తాగి తాగి చచ్చుంటాడు వెధవ!పెళ్ళాం పిల్లల్ని బాధపెట్టడమే వీళ్ళ పని!’ అనుకుని
“ఎలా?” అని అడిగాను సిగ్గులేకుండా.
“అప్పులెక్కువయ్యాయండీ, వరి పంట వరదలో మునిగిపోయింది.”
నేను అనుకున్న మాటలు మళ్ళీ గుర్తు చేసుకుంటే పశ్చాత్తాప్పడి, మనసు బరువెక్కుతుంది, మనిషినని గుర్తొస్తుంది! ఎందుకొచ్చిందని, ఇవ్వాళ చేసిన నా ప్రియాతి ప్రియమైన గుత్తి వంకాయ కూరను తలచుకున్నాను. ఎప్పుడెప్పుడు మణి వెళుతుందా వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ వేస్కొని లాగించేద్దామా అని మనసు ఉవ్విళ్ళూరితే, నోరు నీళ్ళూరుతోంది!
‘గుత్తి వంకాయ కూరోయి బావా...కోరి వండినానోయి బావా
కూరలోపల నా వలపంత బావా కూరి పెట్టి నానోయి బావా...’
బసవరాజు అప్పారావు గారి పాట పాడుకుంటుండగా ఏదో గుర్తుకు రావాలన్న విషయం గుర్తొచ్చింది! అదేంటి...ఆ! ‘నా బావ కాని మొగుడు ఈ పాటికి భోజనం ముగించి నాకు ఫోన్ చేయలే!’ అనుకుంటుండగానే ఫోన్ చేశాడు...
“ఏంటి!కూర బావుందా?” వయ్యారాలుపోతూ అడిగాను.
“ముందు ఒట్టి వంకాయల్ని వేయించేసి తరువాత  మసాలా కలిపి వండేశావు కదూ!?”
ఏదో క్రిమినల్ ని పట్టుకున్న సిఐడి లా ప్రశ్నించాడు!
“మరి ముందే అడిగాను కదా! ఎలా చెయ్యాలి అని!”
“వంకాయలు కొశాక, పల్లీలు, నువ్వులు, మాసాలు వగైరా అన్నీ వేయించి, నూరి, కాయల్లో కూరి, అప్పుడు నూనెలో వేయించాలి! ముందెవడూ వంకాయల్ని వేయించడు!”
“ఆ మాటేదో అడిగినప్పుడే ఏడవాలి!”
“ఏడిశావ్! అందుకే మా అమ్మనడగమంటాను!”
“ఎలా ఉన్నా నోర్మూసుకుని తింటానoడీ...రుచుల మీద ఆసక్తి లేదన్నావనే కదా పెళ్లి చేసుకున్నాను!!”    
 “ఇప్పుడు నోర్మూసుకునేగా తిన్నాను!వదిలేయ లేదు కదా!”
“వంకలు పెట్టకుండా ఎపుడు తిన్నావనీ?ఉంటాను!”
వంటకి రుచున్నా లేకున్నా మా మాటల్లో మాత్రం ఆప్యాయతలుండవ్!వాడి ఖర్మ!ఎంత బాగా చేసినా చచ్చు నాలుక్కి రుచులేం తెలుస్తాయి?!
పనికిమాలిన ఆలోచనలు వదిలిపెడుతూ టీవీ ముందు కూర్చున్నాను.
‘ప్రియుడితో కలిసి ఏడేళ్ళ కొడుకుని కిరాతకంగా హత్య చేసిన తల్లి’ వార్త చూసి గుండె పగిలిoది!
ఇటువంటి తల్లుల వార్తలు చూడడం ఇది మొదటి సారి కాదు!ఆ తల్లిని పచ్చి బూతులు తిట్టుకోడం, ఆ చనిపోయిన పిల్లాడ్నో, పిల్లనో మనసులోతుల్లోంచి జాలి పడ్డం కూడా మొదటి సారి కాదు!
అసలు ఆ పసిప్రాణం ఆ మరణబాధను చివరి నిమిషంలో ఎలా భరించిందోనని వీలైనన్ని రకాలుగా ఊహించుకుని, గుండె బరువు చేసుకుని, కళ్ళల్లో నీళ్ళు నింపుకుని దిగ్భ్రాంతిలో ఉండగా “ఆoటీ!” అనే కొత్త పిలుపుకి ఉలిక్కిపడి గుమ్మంలోకి చూశాను.
తొమ్మిది, పదేళ్ళ పిల్ల నిలబడి ఉంది. బక్క చిక్కి, చింపిరి జుట్టుతో మాసిన గౌనుతో ముఖం లోపలికి పెట్టి
“మా అమ్మొచ్చిందా ఆంటీ గారూ?” అంది.
పుట్టి బుద్ధి ఎరిగిన్నాటి నుంచీ నన్నెవరూ ‘ఆంటీ’ అని పిలవలేదు!! ఎక్కడ్నుంచూడి పడిందీ పిల్ల??నన్ను ఆంటీ అని పిలిచి నాకు పెళ్ళైoదీ, నేనిక ‘స్త్రీ’ ని అని గుర్తు చేయడానికే వచ్చిందనిపించింది నాకు!
‘లోపల బట్టలుతుకుతుంద’ని చెప్పాను.లోపలికి రాకుండా బయట నుంచే అరుస్తోంది...
“అమ్మా! ఏమీ పెట్టకుండా వచ్చేశావేంటి?చెల్లి స్కూల్ కెళ్ళలేదు.ఆకలితో పడుకుంది.”
ఆ మాటలు నా చెవులు వింటున్నాయి...మెదడు అందుకుంటే పర్వాలేదు.మనసు స్పందిస్తేనే కష్టం! మణికి వయసూ తెలివీ ఉన్నాయి కాబట్టి నా ముందు వారి పేదరికం బయట పడడం నామోషీగా అనిపించింది ఆమెకు!
“చెల్లినొదిలేసి వచ్చేశావా? ఇంటికెళ్ళు!వచ్చేస్తున్నాను కొంచెం సేపట్లో అయిపోద్ది పని!” బయటకొచ్చి చెప్పింది మణి.
“ఆకలేసేస్తుంది!ఏదోకటి పెట్టు...!”
నా గుండె ద్రవిస్తున్నా ముఖం గంభీరంగా ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర కావొస్తోంది!ఓట్స్ లాంటి తేలికపాటి తిండి తిని ఇంకా భోజనం చేయలేదని నాకు తెలియకుండా ఇందాకటి నుంచీ నా మీద నేనే జాలిపడిపోతున్నాను!ఈ పిల్లలు రాత్రనగా తిని ఇప్పటి దాకా తిండీ తిప్పలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు?
దారిద్య్రం ఉండనిస్తుంది!!
“రాత్రి కూడా ఒక ఇడ్లీయే పెట్టావ్!ఐదు రూపాయలివ్వి ఏదైనా కొనుక్కుంటా!”
నేనిచ్చిన మూడు ఇడ్లీలు రాత్రి తలోకటి తిన్నరన్నమాట!అంటే మణి నిన్నటి నుంచీ ఏమీ తినలేదు!
ఆ పిల్ల ఆకలి పలుకులు నా కడుపులో పేగుల్ని మెలిపెడుతున్నాయి...ఇవ్వడానికి కూడా ఏమీ లేవు!రాత్రి అన్నం గానీ పొద్దుటి ఇడ్లీలు గానీ!పోనీ ఓ పది రూపాయలిద్దామంటే రోజూ అలవాటైపోతుందని అదో భయం!
ఇక్కడ కాకపొతే ఆమె పని చేసే వేరే ఇళ్ళల్లో తినడానికి ఏదోకటి పెడతార్లే అనుకున్నాను రాత్రి! వాళ్ళూ అలాగే అనుకున్నారేమో!
ఊరికే అన్నారా గుర్రం జాషువా గారు! ‘పేదరికం పెద్ద వింత విశ్వవిద్యాలయం, అందులో లజ్జ కనబడ’దనీ!లజ్జ ఉండనిది పేద వారికే కాదు. నాలాంటి పిసినారులకు కూడా!ఏ మాత్రం సిగ్గు పడకుండా ఉన్నవి దాచి పెట్టుకుని ఒట్టి చేతులు చూపించడంలో మేం ఆరి తేరిన వాళ్ళం!!
ఆ పిల్ల గౌను మాసిందని గమనించాను గానీ దాని ఎండుకుపోయిన డొక్కల్ని చూడలేకపోయాను!చింపిరి జుట్టుని చూశాను గానీ లోతు కళ్ళని పసిగట్టలేకపోయాను.
“నువ్వెళ్ళు!నేనొచ్చేస్తాను!” అని లోపలికొచ్చింది మణి.
పిల్ల గుమ్మం బైటే నిలబడి ఉంది. అది ఎదురు చూసేది అమ్మ కోసం కాదు అన్నం కోసం!
ఆ పిల్ల రాకపోయ్యుంటే రెండో ఆలోచన లేకుండా ఖాళీ చేతుల్తో పంపేదాన్ని మణిని. కానీ రెండు నిమిషాల్లో పని ముగించుకుని వెళ్ళిపోయే మణికీ ఆమె ముగ్గురు పిల్లలకి తినడానికీ ఏం ఇవ్వాలి?ఉన్నదల్లా అన్నం, గుత్తొంకాయ కూర!
కొడుకు పీక కోసి చంపిన తల్లినీ,ఆమె ప్రియుడ్నీ, పసిపిల్లోడి శవాన్నీ పదే పదే పోటీలు పడి చూపిస్తున్నాయి ప్రసార మాధ్యమాలు! శవాన్ని తెరపై చూసి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్న నేను, రెండడుగుల దూరంలో ఆకలికి ఏడుస్తున్న పిల్లను చూసి ఎన్ని విధాలుగా ఆమె ఆకలి తీర్చకుండా వెనుకంజ వేయాలా అని ఆలోచిస్తున్నాను!
ఆకలికి ఏడుస్తున్న పిల్ల బతికే ఉంది!స్వార్ధంతో ఉన్న నేనే పది రూపాయలివ్వడానికీ ఆలోచించిన క్షణంలోనే చచ్చిపోయాను!! ఇష్టపడి చేసుకున్న గుత్తి వంకాయ కూర మీద ప్రేమను పెంచుకుని వాళ్ళకివ్వడానికి సంశయించినప్పుడే మనిషిగా మరుగున పడ్డాను!తండ్రి లేని పిల్లలని తెలిసీ కనీసం ఎంగిలి చేయి కూడా విదల్చలేక పోతున్నాను!నాకు అన్నం పెట్టిన రైతు బిడ్డలకే అన్నం పెట్టాలా వద్దా అన్న మీమాంసలో పడ్డప్పుడే నేను నీచురాలినయ్యాను!
నేనా ఒక రచయిత్రిని? నేనా ఇన్ని పుస్తకాలు చదివి మేధావిలా ప్రముఖులతో ఫోటోలు దిగి పత్రికల్లో వచ్చేది?! నేనా అనర్గళంగా ఆకలిపోరాటాల గురించి అరపూట సేపు గొంతు చించుకుని వేదికపై మాట్లాడింది? అయితే మాత్రం..?రచయితలకు స్వార్ధాలు, పిసినారితనాలు ఉండవా ఏంటి!రచన వేరు జీవితం వేరు!!కానీ...ఆ అమ్మాయి ఆకలి చూపులు నా పిసినారి నరాల్ని నిద్రలేపుతున్నాయి!
జీవితంలో ఎన్ని కోట్ల కోళ్ళు, లక్షల రొయ్యలూ  తిన్నా, జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆ ఒక్క కోడి కూర ఊరించినంతగా ఏ పులస కూరా ఊరించదు కదా!
వారానికోసారి గుత్తొంకాయ వండుకునే స్థితి గల నేను ఏదో ఈ రోజు మాత్రమే అరుదైన అవకాశం వచ్చినట్టు హైరానా పడిపోడం నా లోభి బుద్ధికి పరాకాష్ట!వంకాయ తొడిమ పట్టుకుని అమాంతం నోట్లో వేసుకుని తినడం నాకో అభిరుచి.కానీ వాళ్ళకది ఓ పూట ప్రాణం నిలబెడుతుంది!
గొప్ప వాడి గంజి నీళ్ళే కదా ఓట్స్ అంటే!రెండో పూటా ఓట్సే తింటే ఎవడన్నా నన్నిప్పుడు కొరడా దెబ్బలు కొడతాడా!?
వెంటనే లేచి అన్నం, గుత్తొంకాయ కూర డబ్బాలో సర్ది మణికిచ్చాను. ఓట్స్ ఒక గిన్నెలో వేసి పాలు పొయ్యి మీద పెట్టాను.
బయటకెళ్ళిన మణి చేతిలోంచి డబ్బా లాక్కోబోయింది కూతురు. దాని చేతి మీద చిన్న దెబ్బ వేసింది మణి.
“మొత్తం నేనే తినేస్తాను!”
“తప్పు!చెల్లికీ, అక్కకీ పెట్టాలి!”
ఆ మాటలు వింటూ సంతృప్తిగా ఓట్స్ కలుపుకుంటూ హాల్లోకొచ్చి కూర్చున్నాను.  
రోజూ కంటే ఈ వేళ ఓట్స్ మంచి సువాసన వెదజల్లుతున్నాయి! బహుశా అది నా మానవీయతా గర్వం వల్ల కాబోలు!స్పూన్ నోటి వరకూ తెచ్చుకొని వేడి వేడి ఓట్స్ ఊదుతున్నప్పుడు ఎందుకో ఆ సువాసన రాలేదు!
‘ఎందుకనా?’ అనుకుంటుoడగా నా మెదడు నా మనసుకేదో చెబుతోంది...
నేను అన్నం వండిందే ఇద్దరికి! అందులో సగం నా మొగుడికి పెట్టాక మిగతా సగం మణికిచ్చాను. ఒక్కరు తినే అన్నం నలుగురి కడుపులు నింపడానికిచ్చాను!
దుర్మార్గురాలిని!! రెండో పూటా ఓట్స్ తిని ఏదో వీర త్యాగం చేస్తున్నట్టు విర్రవీగాను కానీ నా అర్ధశాస్త్రం వాళ్ళ కడుపుల పరిణామాల్ని అంచనా వేయనివ్వలేదు! కాస్తాగమని చెప్పి ఓ పావు సేరు బియ్యమన్నా వండనివ్వలేదు!
నాలాంటి అర్ధజీవి జీవితంలో ఓ రోజు మరీ ఇంత అర్ధరహితంగా గడుస్తున్నందుకు నా జన్మ మీద నాకే సిగ్గనిపించింది.
స్పూన్ తిరిగి గిన్నెలోకి జారి పడింది!
బయటకెళ్ళి చూస్తే మణి ఆలోచనలతో నిండిపోయిన నా మనసు తప్ప ఆమె కనిపించలేదు!
                                                            ****************
                                                                                        -మానస ఎండ్లూరి
                                                         March, 2016  సాహిత్య ప్రస్థానం మాస పత్రిక 
       
http://prasthanam.com/node/721

      

5 comments:

  1. ilaanti kathalaku mana routine alochalni maarchese shakti undi.

    ReplyDelete
  2. అవునండి. ధన్యవాదాలు

    ReplyDelete
  3. chaal bagundhi manasa garu

    ReplyDelete
  4. Chaalaaaa bagumdi so nice ..

    ReplyDelete