నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

17 Mar 2016

అబద్ధం


“నీకే భయమూ లేదు అను! మీ అమ్మా నాన్నా మా అమ్మానాన్నా నీ తోనే ఉంటారు. కాలేజీ పని మీద కచ్చితంగా హైదరాబాదు వెళ్ళక తప్పడం లేదు. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నా మనసంతా నీ మీదా మహి మీదా మనకు పుట్టబోయే బిడ్డ మీదే ఉంటుంది. అక్కడ పనవ్వగానే బస్సో రైలో పట్టుకుని నీ ముందు వాలిపోతాను. ఈ సారి నాకు స్వాగతం కొడుకుతో ఇస్తావో మళ్ళీ కూతురుతో ఇస్తావో..ఎవరైనా ఒకటే అనుకో”
ఎంతో మురిపెంగా తన భార్య అనురాధ నిండు గర్భాన్ని ముద్దుపెట్టుకున్నాడు సురేష్.
“అత్తయ్య రేపే మంచిరోజు అని చెప్పారు సురేష్. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. మహికి నువ్వు ఊరెళుతున్నావని తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. త్వరగా వచ్చేయ్! మహలక్ష్మి పుట్టినప్పుడు నార్మల్ డెలివరీనే కాబట్టి రెండో కాన్పు కూడా అలాగే అవుతుందేమో అనుకున్నా. కానీ...ఆపరేషన్ అంటే చాలా భయంగా ఉంది సురేష్.”
అంతా బానే జరుగుతుంది. దిగులు పెట్టుకోకు అనూ. మన మహాలక్ష్మి బజ్జుంది. ట్రైన్ కి టైం అవుతుందిక నేను బయల్దేరుతాను మరి. జాగ్రత్త
అమ్మ నాన్నలకి, అత్త మామలకి వీడ్కోలు చెప్పి హైదరాబాదు బయలుదేరాడు సురేష్. ఆటోలో కూర్చుని ఇంటికి దూరమయ్యే కొద్దీ కన్నీళ్లు బొట బొటా రాలాయి...భౌతికంగా ప్రయాణం చేస్తున్నాడు కానీ మానసికంగా మూడేళ్ళ కూతురు మహి పక్కనే పడుకొని జో కొడుతూ లాలి పాడుతున్నాడు!      
అనురాధకు ఆపరేషన్ లో పండండి ఆడబిడ్డ పుట్టింది. సురేష్ రెండ్రోజుల తరవాత బయల్దేరాడు. వచ్చీ రాగానే పెద్ద కూతురు మహిని పది నిమిషాల సేపు హత్తుకునే ఉన్నాడు. ఆ తర్వాతే భార్యైనా ఎవరైనా. పురిటి బిడ్డను చేతుల్లోకి తీసుకున్న వెంటనే మహి పుట్టిన క్షణాలు జ్ఞాపకమొచ్చాయి అతడికి.
అనూరాధ ఆసుపత్రి నుంచీ ఇంటికొచ్చిన నాలుగవ రోజు సురేష్ సహుద్యోగులు వచ్చారు.    
“రండ్రండి! చాలా రోజులైంది చూసి. బావున్నారా?” నవ్వుతూ ఆహ్వానించింది అనూ.
వచ్చిన స్త్రీలిద్దరూ అయోమయంగా మొహాలు చూసుకుని కూర్చున్నారు.
“ఇంట్లో ఎవరూ లేరండి. మహి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. మీరు కాలేజికి వెళ్ళలేదా ఇవ్వాళ?” మంచినీళ్ళు అందిస్తూ అడిగిoది అను.
“వెళ్ళలేదండి. ఇవ్వాళ మాకు పక్క ఊరిలో ఆన్ డ్యూటీ ఉంది. వెళ్ళొస్తూ మిమ్మల్ని చూసెళదామని ఇలా వచ్చాం. ఆరోగ్యం అదీ బానే ఉందా మీకు?”  
“బానే ఉన్నానండి” కుర్చీలో కూర్చుంటూ చెప్పింది అనూ.
“విషయం తెలియగానే వద్దామనుకున్నాం గానీ పని వత్తిడి వల్ల రాలేకపోయాం. సురేష్ గారు చెప్పగానే చాలా బాధపడ్డాం. అందరికీ కన్నీళ్లు వచ్చేశాయి. పాపం! ఆశ పడినట్లే మగపిల్లాడు పుడుతున్నాడని తెలుసు. కానీ పుట్టకముందే కడుపులో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ బాధలోంచి బయటకు రావడం కష్టమే! కానీ ఏం చేస్తాం!”   
“దేని గురించి మాట్లాడుతున్నారు మీరు?” అయోమయంగా అడిగింది అనురాధ.
“సురేష్ గారు మీ కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా తెల్సుకోడం కోసం విశ్వ ప్రయత్నాలూ చెయ్యడం, అవి ఫలించడం కాలేజీలో అందరికీ తెలుసులెండి! ఉమ్మనీరు తాగకుండా ఉంటే బాబు బతికే వాడే పాపం! మీ అమ్మాయి మహాలక్ష్మికి ఖచ్చితంగా తమ్ముడే పుడతాడని ఎంతో సంబరపడిపోయేవారు. ‘ఇంటికి ‘మహాలక్ష్మి’ ఎప్పుడూ ఒక్కత్తే ఉండాలి’ అంటుండే వారు. బాబు చనిపోయినా ఆయన లెక్క మాత్రం తప్పలేదు! చాలా తెలివైన వారండి సురేష్ గారు”
లోపలి గదిలో నిద్రిస్తున్న రోజుల పాప ‘కేర్ కేర్’ మని ఇంటి కప్పెగిరిపోయేలా ఏడుపందుకుంది. అనూ గబుక్కున లేచి లోనికి వెళ్ళింది. లోపల ఏడ్చేదెవరా అని వచ్చిన స్త్రీలిద్దరికీ మతిపోయినంత పనైంది!
అనురాధ భుజం మీద టవల్ వేసుకుని పాపకి పాలు పడుతూ వచ్చి కూర్చుంది. వాతావరణం గజిబిజిగా ఉందక్కడ.
‘ఇంతసేపూ తను చెప్పింది సురేష్ భార్యా బిడ్డల గురించేనా?’ చెప్పినామెకే అనుమానం! రెండో ఆమె నోరు విప్పింది.
“ఈ బాబూ...?”
“బాబు కాదండి పాప. మీరేమనుకోకపొతే...నాకు కాస్త నీరసంగా ఉంది. కాసేపు పడుకుంటాను.” మొహమాటంగా అనింది అను.
“ఏం పర్లేదు. మళ్ళీ కలుస్తాం. వెళ్ళొస్తామండి” మనసులో అనేక ప్రశ్నలతో వెనుదిరిగారు ఆ ఇద్దరూ.
బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు పాలిస్తున్న తల్లి ఎంతటి మధురానుభూతికి లోనౌతుందో అందుకు పూర్తి విరుద్ధoగా అనురాధ తల్లి మనసు ముక్కలు ముక్కలై గుండెలవిసేలా రోదిస్తోoది. వచ్చిన వాళ్ల ముందు ఆ కన్నీటి ప్రవాహాన్ని ఆపుకోవడానికి ఎంత నరకం అనుభవించిందో ఆమెకే తెలుసు. వాళ్ళు చెప్పిన ఒక్కో విషయానికీ అనూ గుర్తు తెచ్చుకుంటున్న ప్రతీ సంఘటనకీ సరిగ్గా పొంతన కుదిరింది!
కడుపుతో ఉన్నప్పుడు అనూ తల వెంట్రుకకి వారి పెళ్లి ఉంగరం కట్టి ఆమె గర్భం పై గాల్లో ఊపేవాడు సురేష్. అడిగితే ‘బిడ్డ ఎదుగుదల తెలుసుకోడానికి ఇదో కిటుకు. ఇంటర్నెట్ లో చదివాను’ అనేవాడు! చిన్న పిల్లలా మురిసిపోయేది అను. మరో సారి చైనీస్ క్యాలెండర్ అని ఏవేవో లెక్కలు వేశాడు. ఎందుకంటే ‘వాళ్ల పద్ధతుల ప్రకారం కూడా బిడ్డ మంచి రోజు పుట్టాలి కదా ఆడపిల్లైనా మగపిల్లాడైనా’ అని బొంకాడు. ఎన్నో సార్లు యూరిన్ టెస్ట్ చేయించాలని సాంపుల్స్ తీసుకున్నాడు. వాటితో ఇంకెన్ని సొంత ప్రయత్నాలు చేశాడో తెలీదు! ఈ అత్యాధునిక అంతర్జాల అక్షయ పాత్రలో తవ్వే కొద్దీ సమాచారం దొరుకుతూనే ఉంటుందిగా. ఫోన్లంత స్మార్ట్ గా మనుషులూ వారి మనసులూ స్మార్ట్ గా ఉంటే బావుణ్ణు!
ప్రసవం అయిన వెంటనే వస్తానన్న సురేష్, మొహంలో ఎటువంటి సంతోషం లేకుండా రెండ్రోజుల తరువాత వచ్చాడు. పని వత్తిడి, ప్రయాణం వల్ల అలసట అనుకుoది అనురాధ. అష్టలక్ష్ముల్ని పూజించే సురేష్ కేవలం ఆదిలక్ష్మినే కూతురిగా స్వీకరించడానికి సిద్ధమయ్యాడు తప్ప రెండవ కూతురిని ధనలక్ష్మిగా అంగీకరించలేకపోయాడు. మగపిల్లాడు కావాలని ఏనాడూ బయటపడకుండా నటనతో నమ్మించాడు. ఆడపిల్ల పుట్టిందని కాలేజీలో తెలిస్తే వేసిన లెక్కలన్నీ తప్పాయనీ, అందరి ముందూ మళ్ళీ ఆడపిల్లే పుట్టిందనీ చెప్పుకోడానికి నామోషీ పడి బాబు పుట్టి చనిపోయాడని అబద్ధం చెప్పాడు! నిజానికి చనిపోయింది బిడ్డ కాదు, సురేష్ లోని తండ్రి! ఒక ప్రేమించే భర్తగా, కూతురంటే ప్రాణoగా చూసుకునే తండ్రిగానే అందరికీ తెలుసు తప్ప తనలో ఒక ‘మగ పిచ్చి’ తో రెండో కూతుర్ని ద్వేషించే తండ్రి ఉన్నాడని ఇప్పటి వరకూ అతనికి మాత్రమే తెలుసు!
అనూ ఆలోచనల్లో తల మునకలై ఉండగా సురేష్, అత్తా మామలు, అమ్మా నాన్నలు, మహి వచ్చారు.
అనురాధ తల్లి చిన్న పాపని సురేష్ చేతుల్లో పెట్టి “అల్లుడు గారూ! మీ ఇంటికి మీ పెద్దకూతురు మహాలక్ష్మి అయితే చిన్నది ధనలక్ష్మి! పుట్టుక తోనే మీకు హైదరాబాదులో ఉద్యోగం తీస్కొచ్చింది. చూశారా” అంది.
సురేష్ ఆశ్చర్యoగా మావగారి వైపు చూశాడు. ఆయన పొద్దున్న పోస్ట్ లో వచ్చిన ఉత్తారాన్ని సురేష్ చేతికిచ్చారు. రెండో పాప పుట్టినప్పుడు హైదరాబాద్ కాలేజీలో సురేష్ ప్రతిభ చూసి అనుకోకుండా పెద్ద జీతంతో ఉద్యోగావకాశo వచ్చింది.
సురేష్ తన చేతుల్లో ఉన్న పాప కళ్ళలోకి చూశాడు. మల్లెపూవంత స్వచ్ఛంగా నవ్వుతోంది! ఆ నవ్వు సురేష్ కల్మషంతో నిండిన మనసుని కడిగేసింది. తను చెప్పిన అబద్ధానికి పశ్చాత్తాప్పడుతూ పాపని గుండెలకు హత్తుకుంటూ మోకాళ్ళపై పడి అందరి ఎదుటా కన్నీరు మున్నీరయ్యాడు. అందరూ అవాక్కయ్యారు...అనురాధ మటుకు అసహ్యంతో సురేష్ వైపు నుండీ చూపులు తిప్పుకుంది.
“నా రక్తాన్నే నేను చీదరించుకున్నాను. నేను పాపత్ముడ్ని! కొడుకు పుట్టలేదనే కోపంతో నామోషీతో అందరికీ బాబు పుట్టి చనిపోయాడని చెప్పాను. ఆ విషయాన్ని నిజం చేద్దామనుకున్నాను కూడా!! నన్ను క్షమించు అనూ!‘విష’యమంతా బయటపెట్టాడు సురేష్.
అందరికీ కాళ్ళ కింద భూమి కంపించినట్టైంది! వాళ్లు విన్నది నమ్మలేకపోతున్నారు. సురేష్ సహుద్యోగులు వచ్చి చెప్పిన విషయమంతా వివరించింది అనురాధ.
సురేష్ చెంప చెళ్ళుమనిపించింది అతని తల్లి! కొడుకు మొహం చూడ్డానికి కూడా చీదరించుకుంది!
“నలుగురికీ విద్యను బోధించే పవిత్రమైన వృత్తిలో ఉన్న వాడి బుద్ధే ఇంత వక్రంగా ఉంటే ఇక మిగతా వారి సంగతేమిటి? మేము ఎప్పుడూ కొడుకూ కూతురూ అని తేడాలు చూపలేదు. మరి నీకేలా వచ్చిందిరా ఇలాంటి నీచమైన ఆలోచన?” తల బాదుకున్నాడు సురేష్ తండ్రి.
“అమ్మా అనూ! తల్లిగా వాడ్ని నేను ఎన్నటికీ క్షమించలేను. కానీ నువ్వు భార్యగా వాడ్ని ఏం చేస్తావో నీకే వదిలేస్తున్నాను! వాడి బదులు మేము నీకు క్షమాపణ చెబుతున్నాం తల్లీ” సిగ్గుతో చితికిపోతూ అంది సురేష్ తల్లి.
“నేను అతనితో బతకలేను. అతని వల్ల నా పిల్లలకు ప్రాణహాని ఉంది. ఈ రోజు రెండో కూతుర్ని ద్వేషించిన వాడు రేపు పెద్ద కూతుర్ని కూడా ద్వేషించడని ఏంటి నమ్మకం? నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను” దృఢంగా చెప్పింది అనురాధ.
ఈ మాటలు వినగానే సురేష్ గుండె చెరువైంది.
“అంత మాట అనకు అనూ! నువ్వూ పిల్లలూ లేకపోతే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? దయచేసి నన్ను పెద్ద మనసుతో క్షమించు” కుమిలిపోయాడు సురేష్.
“చూడమ్మా! నీ భర్త తనంతట తనే చెప్పిన అబద్ధాన్ని, చేయాలనుకున్న పాపాన్ని ఒప్పుకుని మన్నిoచమన్నాడు. మంచివాడికంటే తప్పు చేసి మారినవాడు గొప్ప వాడు. క్షమించడానికి కొంత సమయం పట్టినా అల్లుడిని దూరం చేసుకోకు.” వివరంగా చెప్పాడు అనూ తండ్రి.
ఆ తరువాత నుండీ సురేష్ చిన్నపాపను కూడా పెద్దకూతురు మహలక్ష్మితో సమానంగా అల్లారు ముద్దుగా పెంచసాగాడు. తన కాలేజీ వారందిరినీ పిలిచి పెద్ద ఎత్తున బారసాల జరిపి చిన్న పాప కి ‘ధనలక్ష్మి’ అని పేరు పెట్టాడు.   
ఇప్పడు సురేష్ కి రోజూ భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడంతో పాటు మరో దినచర్య కూడా ఉంది. అది...ప్రతి పది నిమిషాలకీ కూతుళ్ళిద్దరితోనూ ‘స్వయం చిత్రాలు’ దిగి ముఖ పుస్తకంలో పెట్టడం.
                                                          **************
                                                                                      -మానస ఎండ్లూరి    
                                                                       విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, మార్చ్ 2016



15 Mar 2016

బొట్టు కుక్క

టింగ్ టింగ్! టింగ్ టింగ్!!
అసహనంగా తలుపు తెరిచాను.
అమ్మా నాన్నలకి ప్రతి రోజూ ఏవో ఒక పోస్టులు, కొరియర్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళని కలవడానికి కూడా పద్దాక ఎవరోకరు వస్తూనే ఉంటారు. అదీ సరిపోక, అపార్ట్మెంట్స్ లో మొదటిల్లు మాదే కాబట్టి అడ్రెస్సులు అడిగే వాళ్ళూ, పుస్తకాలూ వంట సామాగ్ర్ర్రీ అమ్మేవాళ్ళూ, వివాహ పత్రికలు చూపించి భిక్షాటన చేసేవాళ్ళూ, కరపత్రాలు ఇచ్చేవాళ్ళూ, వీళ్ళూ వాళ్ళూ అందరూ గంటకో సారి మా ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తూనే ఉంటారు!
పోనీ తలుపు తెరిచే పెడదామా అంటే వచ్చే పోయే వాళ్ళందరూ మా ఇంట్లో ఏదో దొంగ పెళ్లి జరుగుతున్నట్టు అనుమానంగా, నిస్సిగ్గుగా, అనాగరికంగా గుమ్మంలోంచి పడగ్గది దాకా తొంగి చూస్తూ వెళుతుంటారు!వాళ్లు చూసే చూపులకి మాకే మేమేదో తప్పు చేస్తున్నామన్న సందేహమొచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు!
ఇంతకీ ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టింది మా వాచ్ మాన్ అప్పారావు, ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి.
‘కాలింగ్ బెల్ వద్దు, తలుపు తట్టు చాలు’ అంటే వినడు. కావాలని టకీ టకీ మని రెండు సార్లు కొట్టి విసిగిస్తుంటాడు డాక్టర్ అంకుల్ లాగ!
అప్పుడు గుర్తొచ్చింది! వేసవి సెలవులు కదా! చాలా మంది లేరు అపార్ట్మెంట్స్ లో.జనం తక్కువే ఉంటారు కాబట్టి కాస్త స్వేఛ్చగా ఉండొచ్చని తలుపు బార్లా తెరిచాను. ఎన్నాళ్ళకి గాలీ వెలుతురూ వస్తోందో ఇంట్లోకి! చాలా రోజుల తరువాత పట్టపగలు ట్యూబ్ లైట్ ఆపేసాను!
నేనూ నాన్నా టీవీ చూస్తూ ఉన్నాం. బయటంతా రణగొణ శబ్దాలు...రెండిళ్ళవతల ఇంట్లోకి కొత్త వాళ్లు దిగుతున్నారు. నిన్న కొంత సామాను తెచ్చారు. ఇవ్వాళ మిగతా సామాను దింపుతున్నట్టున్నారు.
కొద్దిసేపటికి ఆ ధ్వనుల్లోoచి ఓ చిన్న పాప ఏడుపు వినిపించింది. పిల్లలందరూ సెలవులకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ కాదనుకున్నాను. మళ్ళీ అదే ఏడుపు. నాన్ననడిగితే ఏం లేదంటాడు. అమ్మ లోపలెక్కడో ఉంది. కానీ ఎంతసేపటికీ ఏడుపాగట్లేదు!
వెంటనే బయటకెళ్ళి చూస్తే రెండు మూడేళ్ళ పాప! కొత్త పాప! కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తూ ఉంది. అప్పారావు కోసం చూశాను. లేడు.
పాప దగ్గరికెళ్ళాను. పిల్ల నల్ల బంగారం! నేరేడు పండు రంగులో నిగనిగలాడిపోతుంది. బొద్దుగా ముద్దుగా బత్తాయిల్లాంటి బుగ్గలు, చక్రకేళీల్లాంటి జబ్బలూ, చిట్.....ట్టి మూతి, నుదుటి మీంచి కళ్ళలోకి జారిపడే మొక్కజొన్న పీచు లాంటి మెత్తని వెంట్రుకలు, నడి నెత్తి మీద చిచ్చుబుడ్డీ వెలుగుల్లాంటి పిలక! ఆ పాప వెనుకే ఓ బుజ్జి తెల్లని బొచ్చు కుక్క పిల్ల. దాని కళ్ళ మధ్యన ఎర్రని కుంకుమ బొట్టు. ఆ బొట్టు దాని మతాన్నైతే చెప్పింది కాని కులాన్ని చెప్పలేదు. పాపకీ బొట్టుంది. ఆ బొట్టు కూడా మతాన్నే చెప్పింది.
పాప ముందు మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు తుడిచి మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఏడుపు తప్ప ఒక్క మాటా రావడం లేదు.
కుక్క పిల్ల నా పాదాల దగ్గరగా వచ్చి ముక్కుతో పరీక్షిస్తోంది! కొంపదీసి కరవదు కదా!ఇంట్లో ఎప్పుడూ కుక్కల్ని పెంచనందు వల్ల నాక్కాస్త బెరుగ్గా ఉంది. కొన్ని నిమిషాలకి అలవాటు పడ్డాను. ఎంత చక్కగా ఆడుకుంటుందో!
పాప మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. బైటికి తీస్కెళ్ళి వాళ్ల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో చూద్దామా అంటే ముట్టుకోనివ్వట్లేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అష్టకష్టాలు పడి లోపలికి తీస్కొచ్చి మంచినీళ్ళు తాగించాను.
ఆ ఏడుపుకి అమ్మ హాల్లోకొచ్చింది. అమ్మా నాన్నా ఏవేవో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరాశే మిగిలింది! నేను మాత్రం కుక్కపిల్లతోనే ఆడుతున్నా. గుండెల మీద పసిపాపలా కొద్దిసేపు, భుజాలమీద గుమ్మడికాయలా కొద్దిసేపు, చంకలో కోడిపిల్లలా కొద్దిసేపు వళ్ళో చంటి బిడ్డలా కొద్దిసేపు మారిపోతోంది కుక్కపిల్ల.
పాపని ఏవేవో అడుగుతున్నారు అమ్మా నాన్న...‘నీ పేరేంటి పాపా?’ , ‘ఎక్కడుంటారు?’ ‘స్కూల్ కెళుతున్నావా?’ , ‘మీ అమ్మా నాన్నా పేర్లేంటి?’ ఊహు ఏవీ చెప్పట్లేదు. ఏడుపూ ఆపట్లేదు!
కుక్కపిల్లని నా భుజానేసుకుని “ఎవరమ్మాయివి రా తల్లీ?” అని అడిగాను నా వంతు ప్రయత్నం చేస్తూ.
ఠక్కున ఏడుపాపి “కమ్మోలమ్మాయిని” అంది. కుక్కపిల్ల నా భుజమ్మీంచి వళ్ళో పడింది.
నాన్నా అమ్మా నేనూ అవాక్కైయ్యాం! ఎందుకో కుక్కపిల్ల నా కళ్ళలోకి చూస్తోంది. నేను దాని బొట్టు వైపు చూశాను. మతమే కాదు ఇప్పుడు కులం కూడా తెలిసింది. కమ్మోరమ్మాయి వెంట వచ్చిన కుక్క పిల్ల. దాని జాతి కుక్కల్ని అది గుర్తుపడుతుందేమో! పాపం మనుషులే ఇంకా వారి వారి జాతుల్ని ఇప్పటికీ చెప్తే గానీ గుర్తుపట్టలేక పోతున్నారు!!
కులాన్ని ఉగ్గు గిన్నెతో పట్టించి, పాలసీసాలో పోసి, కాస్త ఎదిగాక కాంప్లాన్ లో కలిపిచ్చి కులాంగ సౌష్టవాన్ని పెంచి రేపటి సమాజానికి కులపౌరులుగా తీర్చిదిద్దుతున్న వైనం చూసి ఆశ్చర్యపోయాను. పేరు, ఊరు, తల్లి దండ్రుల పేర్లు, వారి చదువులూ ఉద్యోగాలూ ఏవి అడిగినా పనికి రాని ప్రశ్నలు గానే మిగిలిపోయాయి!
మూడేళ్ళ వయసుకే ‘గుర్తింపు’ అంటే కులం అని నేర్చుకున్న పసిపాపకి నా కుల నిర్మూలనా పోరాటం ఏం అర్ధమవుతుంది? కానీ ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న ఈ పసి చిలుకను కూడా నేను ఎదుర్కోవాలన్నది విషాద వాస్తవం!
“అక్కా! వాతల్”
ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయినట్టుంది. మరికొన్ని నీళ్ళు తాగించాను.
ఆ షాక్ లోంచి తేరుకోడానికి నేను కూడా కొన్ని తాగి పాపను ఎత్తుకున్నాను. కొంచెం బెదురు తగ్గింది దానికి.
“మీ ఇంత్లో బొమ్మల్లీవా??” అడిగింది గదంతా చూపుల్తో ఒక చుట్టు చుట్టి.
కొంతమంది మా ఇల్లు చూసి పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీ యేమో అనుకునేవాళ్లు. అలాంటి ఇళ్ళు అంతరించి పోయాక ‘పాత పుస్తకాలు అమ్ముతారా?’ అని అడిగే అమాయకులూ లేకపోలేదు! ఈ పాపకి కూడా అలాంటి అనుమానమే కలిగినట్టుంది.
“నువ్వున్నావుగా చిన్ని బొమ్మవి!” అన్నాను దాని బుగ్గలు పిండుతూ.
“నువ్వు బెద్ద బొమ్మవా?” చెవిలో బెల్లం పాకం పోస్తున్నంత తియ్యగా ఉన్నాయి పాప మాటలు.
కొంచెంసేపు పాపా...కుక్కా...నేనూ పార్కింగ్ లో ఆడుకున్నాం.
సాధారణoగా నాకు కుక్కలంటే చచ్చే భయం. కుక్కపిల్లలంటే కూడా! కానీ ఇలాంటి చిట్టి కుక్కపిల్లతో ఇంతగా ఆడడo ఇదే మొదటిసారి. యేసయ్య ఒళ్ళో గొర్రె పిల్లలా ఉందీ కుక్కపిల్ల. క్రిస్మస్ ట్రీ మీద పడిన మంచులా దాని తెల్లని బొచ్చూ, సవ్వడి లేకుండా చర్చి గంటల్లా లయబద్ధంగా ఊగే దాని బుల్లి తోకా, ‘అక్కా! ఆడుకుందాం దా’ అన్నట్టు దాని చూపులు...అబ్బ! భలే ఉంది బుజ్జి కుక్క. దాని మొహానికున్న బొట్టు చూస్తుంటే మొన్న సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దు గుర్తొచ్చింది. బొట్టు పెట్టుకున్న వాటిల్లో నేను చూసిన రెండో జంతువు ఇది.
అమ్మ లోపలికి పిలిచి కుక్కపిల్లకి కొన్ని బిస్కెట్లు, పాపకి బొబ్బట్లు పెట్టింది. ఎవరో మా గుమ్మంలోంచి తొంగి చూస్తున్నట్టు అనిపించి తల తిప్పాను. ఆ కళ్ళూ, చూపులూ పరిచయం లేనివి.
గొంతుకి వజ్రాల నల్లపూసలు, పదివేళ్ళలో ఆరిoటికి నాజూకైన బంగారం ప్లాటినం ఉంగరాలు, ఖరీదైన జీన్స్, కుర్తీ, మొహంలో ఆధునికత, మరింకేదో కళ.
“మీరూ..?” అన్నాను సందిగ్ధంగా.
వెంటనే అర్ధమై ''మీ పాపని వెతుక్కుంటూ వచ్చారు కదా! లోపల ఆడుకుంటుంది. రండి. బాగా టెన్షన్ పడ్డట్టున్నారు'' అన్నాను.
పిల్లకీ, కుక్కపిల్లకీ ఏం తెలుసు?! నుదురు చూసి వర్గాన్ని అంచనా వేసే విద్య! నా మొహం చూడగానే ఏదో అసంతృప్తి నొక్కి పెట్టి-
''చాలా భయపడ్డాను'' అంది.
''లోపలికి రండి'' అంటూ గుమ్మం దగ్గర నుంచే సోఫా చూపించాను.
''లేదండి వెళ్ళాలి. ఇల్లు మారుతున్నాం. చాలా పనులున్నాయి. మా పాపేది?'' అందామె.
లోపలికెళ్ళి పాపని ఎత్తుకుని హాల్లోకి వచ్చాను.
“సంజూ!” ఆమె చేతులు చాచింది.
“మమ్మీ...!” నా చేతుల్లోంచి దూకి వెళ్ళింది పాప, దాని వెంటే కుక్కపిల్ల.
సంజూని ఎత్తుకుని “హే పప్పీ! దా! ఏంటి తింటున్నవ్?” అని పప్పీ నోట్లో ఆమె చూపుడు వేలు పెట్టి నానిపోయిన బిస్కెట్టు ని బయటకు తీసి విదిల్చింది.
“ఇది చాలా కాస్ట్లీ డాగ్ అండి. స్పెషల్ ఫుడ్ ఉంటుంది. అదే పెడతాం” పళ్ళు బయటకు రాకుండా నవ్విoది.
ఆ కుక్కపిల్లకి నేను నచ్చానేమో! వదలడం లేదు, నా చుట్టూ తిరుగుతోంది.
“నేనిక్కళే ఆదుకుంతా...” నన్నే చూస్తూ అంటోంది సంజూ.
“తప్పు! ఇంటికెళ్ళాలి. దా పప్పీ”
నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్న పప్పీని ఎత్తుకున్నాను.
“వద్దండి...వచ్చేస్తుంది. దింపేయండి!”
ఓ వెర్రి నవ్వు నవ్వి పప్పీ ని వదిలేసి లోపలికెళుతూ చూశాను...కుల బుజ్జాయిని ఓ భుజాన ఖరీదైన జాతి కుక్క పిల్లని మరో భుజాన వేసుకుని వెళుతోంది నేటి ఆధునిక మహిళ.
మౌనంగా నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. బుట్ట బొమ్మలాంటి పసి పాప కన్నా బొచ్చుతో ఉన్న బొట్టు కుక్కే ఎక్కువగా మెదులుతోంది గుండెల్లో...
-మానస ఎండ్లూరి, అరుణతార డిసెంబర్ - జనవరి 2016

13 Mar 2016

దొంగ బొట్టు

అది ప్రభుత్వ పాఠశాల...
ఉపాధ్యాయుల గదిలో ఎవరికి వారు హడావుడిగా పరీక్షా పత్రాలు దిద్దే పనిలో ఉన్నారు. మా లెక్కల పంతులు ప్రసాద్ మా అందరికంటే ముందే కాగితాలన్నీ దిద్దేసి తన బల్ల మీద తల వాల్చి నిద్రకీ మెలకువకీ మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు.
“ఏవండీ ప్రసాద్ గారు! ఈ వారం కథేవిటి? ప్రతి సోమవారం ఈ పాటికి మీరు మా అందరికీ కథంతా చెప్పేయడం, అందరం దాని మీద చర్చ చేసుకోవడం కూడా అయిపోయేది కదా! ఈ వేళ ఇంకా మొదలుపెట్టలేదేవిటో!” అన్నాడు రామశాస్త్రి దిద్దే కాగితాలలోంచి ముఖం పైకెత్తి.
“అవున్నిజమే! పనిలోపడి మర్చేపోయాం. ఈ వారం కథేంటి ప్రసాద్ గారు? ఎవరు వ్రాశారు?” అడిగింది సువర్ణ కుమారి.
పరిక్షా పత్రాలు దిద్దుతూ అడగలేకపోయాను గానీ, నాకూ కూతూహలంగానే ఉంది ఆయన చెప్పే కథ వినాలని!
ఆదివారం పత్రికల్లో వచ్చే ఏదోక కథ సోమవారం భోజన సమయంలో మా అందరికీ చెప్తాడు ప్రసాద్. ఆ కథ మీద చర్చ, వాదన, అభిప్రాయాలు, కొట్లాటలు, అలకలు సాగుతూనే ఉంటాయి మళ్ళీ తరగతి గంట కొట్టే దాకా.
“ఈ వారం కథ నాకు నచ్చలేదులెండి! వదిలేయండి!” విసుగ్గా అన్నాడు ప్రసాద్.
“అదేంటి? ఇన్ని రోజులగా ఎప్పుడూ ఇలా అనలేదే! ఏం కథ అది?” మల్లికార్జున రావు.
“ఏదో! పిచ్చి కథ. ఏం బాలేదు” ప్రసాద్
“హహ్హహ్హ! ఏ సరస కథో అయ్యుంటుంది! సిగ్గు పడుతున్నాడు ప్రసాద్” జగదీశ్వర్
“కాదు కాదు! విప్లవ కథ అయ్యుంటుంది. ఆయనకవి అస్సలు నచ్చవుగా” తులసి కుమారి
“చెప్పండి ప్రసాద్ గారు! మీకు నచ్చకపోయినా ఇక్కడ ఎవరోకరికి నచ్చుతుందేమో చూద్దాం” ఆత్రంగా నేను.
“దళిత కథలెండి. ఎవరో జోసెఫ్ కోడూరి అట! ఇప్పటికీ దళితులు వివక్ష అనుభవిస్తున్నారని, అవకాశాలు లేవని, మొహానికి బొట్టు లేకపోతే తక్కువగా చూస్తారని, మొహం మీదే కులం అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని...ఎప్పుడో తాతల కాలం నాటి కష్టాలు నేటి కాలంలో ఉన్నట్టు రాసుకొచ్చాడు. అసలు ఇంకా ఈ రోజుల్లో కులమెక్కడుందండీ!?”
ప్రసాద్ చెప్పింది విని అప్పటిదాకా ఆ గదిలో గలగలమన్న మాటలన్నీ మౌనాసనం వేశాయి! ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా వారి వారి పనుల్లో పడ్డారు.
“కోడూరి జోసెఫ్ అంటే...ఆయన కాకినాడలో ప్రొఫెసర్ కదా! ఆయన ఎప్పుడో రాసిన క్రైస్తవ పాటలు ఇప్పటికీ చర్చిల్లో పాడుతుంటారు! ఆయన మేనకోడలు చంద్రకుమారీ నేనూ, చిన్నప్పుడు ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళం! ఈ ఊళ్లోనే పెద్ద ఆఫీసర్ ఆమె. ప్రసాద్ గారూ! మీరు ఇంటికి వెళ్ళాక, కథ చివర్లో ఆయన ఫోన్ నెంబర్ ఉంటే నాకు కాస్త పంపండి.” అన్నాను ఉత్సాహంగా.
“ఆ...అదిగో చూశారా! ఆయన ప్రొఫెసర్! మేనకోడలు ఆఫీసర్! ఇంకేం కష్టాలుంటాయండి వీళ్ళకి?” అసహనంగా అన్నాడు ప్రసాద్.
ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. సువర్ణ కుమారి అసలు వంచిన తల ఎత్తట్లేదు. ఆమె కాళ్ళకి కేజీడు పసుపు, నుదురంతా నిండేలా రూపాయకాసంత కుంకుం బొట్టు పెట్టుకున్నది దళితురాలిగా దాక్కోడానికి కానీ పోరాటం చేసి ప్రశ్నించడానికి కాదుగా!
ప్రతి కథ మీదా పోటీలు పడి చర్చించే వారంతా తరగతి గదిలో టీచర్ గారు ఎవర్ని లేపి ఏం ప్రశ్నలేస్తారో అని భయంతో నక్కి నక్కి దాక్కునే పిల్లల్లా ఉండిపోయారు. నాతో సహా!
వాతావరణం తేలిక చేయడానికి కాబోలు, సరస్వతి గొంతు సవరించుని “తోటకూర వడలు తినండి సువర్ణ గారు” బాక్స్ అందిస్తూ అంది.
“వద్దండి! సోమవారాలు తోటకూర అవీ తినను” బాపూ బొమ్మలా నవ్వుతూ సున్నితంగా తృణీకరించింది సువర్ణ కుమారి.
“నాకివ్వండి! నేను లాగించేస్తాను” ఆబగా బాక్స్ లాక్కున్నాడు రామశాస్త్రి.
*** *** *** ***
“హలో సార్! జోసెఫ్ గారు బావున్నారా? నేను రాజమండ్రి నుంచీ నిర్మలని! మీ కథ చదివాను సార్. చాలా బాగా రాశారు. ఆధునిక కాలంలో దళితులు పడే అవమానాలను బాగా చెప్పారు” ఫోన్ చేసి ఉద్వేగంగా అభినందించాను.
“థాంక్స్ అమ్మా! అర్ధమయ్యే ఉంటుందిగా అవన్నీ రోజూ నేనూ నా సోదరులూ పడే అవమానాలే. ఎన్ని చదువులు చదువుకుని, ఎంత సంపాదించినా పై కులస్తుడైన ఒక ప్యూన్ ముందు దళితులమేగా!”
“అలా ఎందుకు అనుకుంటారు సార్” ఓదార్పుగా అన్నాను.
“నేను అనుకోను. వాడనుకుంటాడు! కావాలని ఎంత పిలిచినా రాడు. చెబితే గానీ నా గది తుడిపించడు, సమాధానాలు సరిగ్గా చెప్పడు. ముఖ్యమైన విషయాలు నాకు తప్ప అందరికీ చెప్తాడు. వాడి అహంకారమంతా వాడి చూపుల్లోనే ఉంటుంది...అదీ నాకే కనబడుతుంటుంది! ఇంకా చాలా ఉన్నాయిలే. చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగదు”
“చాలా మందికి ఇవి కష్టాల్లా కనబడవు సార్. మా సహోద్యోగుడు ఒకడు ఉన్నాడు లెండి ప్రసాద్ అని! ‘ఇలాంటివేవీ ఇప్పుడు లేవు’ అని విసుక్కుంటున్నాడు మీ కథ చదివి. పైగా మనోడే!”
“హ్మ్...నిద్రకీ మెలకువకీ మధ్యలో ఉండేవాడిని బాగుచెయ్యడం చాలా కష్టం! చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇంతకీ మా మేనకోడలు చంద్రకుమారిని కలుస్తుoటావామ్మా? మీ ఊళ్లోనేగా ఉంటుంది.”
“చదువుకునే రోజుల్లో కలవడమే! మళ్ళీ కలుసుకోలేదు సార్. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. రేపు పొద్దున్న తనని ఆఫీసులో కలిసిన తరువాత బడికెళతాను...”
“అలాగే మంచిదమ్మా! ఉంటాను”
*** *** *** ***
మరుసటి రోజు చంద్ర కుమారి ఆఫీస్ రూమ్ ఎదురుగా బెంచ్ మీద కూర్చుని తన కోసం ఎదురు చూస్తున్నాను. పదిహేను నిమిషాలలో వస్తానంది. చాలా కాలం తరువాత ఈ రోజు కలుసుకుంటున్నాం.
చిన్నప్పుడు ఓ సారి...చర్చిలో ఉన్నప్పుడు మా పాస్టర్ గారి కొడుకు...అతని పేరు ఏదో ఉండాలబ్బా...ఆ...మోషే! ఆ మోషే గాడు ఎవరికీ తెలియకుండా చంద్రకుమారి బైబిల్ లో ప్రేమలేఖ పెట్టాడు! ఆ ప్రేమలేఖ చంద్రకుమారి కంటే ముందే ఆమె అమ్మమ్మ కంట పడింది! దాన్లో ‘నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాను’ అని రాశాడు ఊరు పేరూ లేకుండా. అంతే! అమ్మమ్మ సాక్షాత్తూ యేసు ప్రభువే రాసి పెట్టాడనుకుని అందరికీ చూపించి చర్చిలో రెండు గంటలు కన్నీటి సాక్ష్యం కూడా చెప్పేసింది! చాలా కాలం అదే విషయం గుర్తు చేసుకుని పడీ పడీ నవ్వుకునే వాళ్ళం చంద్ర కుమారీ నేనూ.
ఆ జ్ఞాపకంతో నా ముఖం పై చిన్న నవ్వు మెరిసే లోపే అటెండర్ వచ్చి చంద్రకుమారి గది తాళం తీసి శుభ్రం చేస్తున్నాడు.
కొద్ది నిమిషాలకి చంద్రకుమారి వచ్చే అలికిడి వినబడింది. దారిపొడవునా ఉద్యోగులందరూ ఆమెకు వినయంగా ‘గుడ్ మార్నింగ్’ చెబుతున్నారు. హుందాగా నడుచుకుంటూ వచ్చి ఆప్యాయంగా నన్ను వాటేసుకుంది. అదే స్వచ్ఛమైన నవ్వు, కల్మషం లేని మనసు.
నా భుజం మీద నుంచి తన ముఖం తీసి నా మొహంలోకి చూస్తూ నవ్వింది చంద్రకుమారి. ఒక్కసారిగా హతాశురాలినయ్యాను! పెద్దగా...ఎర్రగా...గుండ్రంగా...తన నుదుటన బొట్టు!! గొంతులో మాట ఆగిపోయింది నాకు! నన్ను తన గదికి తీసుకెళ్ళింది. అటెండర్ ఇంకా లోపలే ఉన్నాడు. చంద్రకుమారి టేబుల్ మీద వస్తువులన్నీ తుడుస్తున్నాడు. అప్పటికే గదంతా అద్దంలా శుభ్రం చేసేశాడు. ఫిల్టర్ లో మంచినీళ్ళు నింపాడు. కంప్యూటర్ కూడా ఆన్ చేసి పెట్టాడు.
గదిలో ఓ మూల దేవుడి విగ్రహం, పూలు, పూజా సామగ్రి, అగరబత్తి వెలిగించి పెట్టున్నాయి. వెళ్లి గంట కొడుతూ ఏదో శ్లోకం చదువుతూ దేవుడికి హారతి ఇచ్చింది చంద్రకుమారి. అటెండర్ ని హారతి తీస్కోమంది. నాకేదో రంగస్థలం మీద పద్యనాటకం చూస్తున్నట్టుంది! అటెండర్ ఏసి ఆన్ చేసి వెళ్ళిపోగానే తన సీట్లో కూర్చుంటూ నన్నూ కూర్చోమంది. నా మతి ఎలాగూ పనిచెయ్యట్లేదు కాబట్టి నడుం కైనా పని చెబుదామని మెల్లగా కూర్చుంటూ ఒకే ఒక్క ప్రశ్న వేయగలిగాను అతి కష్టం మీద.
“ఏంటి చంద్రా ఇదంతా?”
“పోరాడలేక!” ఆమె సమాధానం.
అటెండర్ ఇద్దరికీ చల్లని బాదంపాలు తీస్కొచ్చాడు..!
*** *** *** ***
ఎందుకో ఈ సాయంత్రం చాలా నిర్లిప్తంగా ఉంది. వేడి వేడి నీటితో స్నానం చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్ళాను. పార్క్ ఎప్పటిలా రద్దీగా లేదు. అందుకే పదిమంది ఉన్న గుంపులో కూర్చున్నా చటుక్కున కనిపెట్టాను మా కుటుంబానికి సన్నిహితుడైన జాన్సన్ గారిని. అందరూ మగవాళ్ళే. వెళ్లి పలకరిస్తే బావుంటుందో లేదో అని చూసీ చూడనట్టు ముందుకి నడిచాను. కానీ ఆయనే నన్ను పిలిచి పలకరించారు. దగ్గరికి వెళ్లి కాసేపు పిచ్చాపాటీ మాట్లాడాను. ఆయన చుట్టూ కూర్చున్న స్నేహితులందరికీ నన్ను పరిచయం చేశారు.
‘ఇక బయల్దేరుతాను’ అనే సమయానికి జాన్సన్ గారు ఇటీవలే తను రాసిన కవితా సంపుటి మొదటి పేజీ మీద సంతకం పెట్టి ఇచ్చారు. ముచ్చటగా పుస్తకం తెరిచి చూశాను.
‘చిరంజీవి నిర్మలకి...ప్రేమతో యార్లగడ్డ జనార్ధన్’ అని రాశారు! ‘అదేంటి? ఈయన పేరెప్పుడు మార్చుకున్నారు!?’ అని అదిరి పడ్డాను! కానీ ఇంటి పేరు మారలేదు. మార్చనవసరం లేదు కూడా! రెండో పేజీ తిప్పి చూశాను. పుస్తకం అంకితం ఇచ్చిన దంపతులు కనబడ్డారు. ఇప్పటిదాకా ఈ గుంపులో ఉన్న ఆయనే! ఫోటోలో భార్యతో సహా ఉన్నాడు.
పుస్తకంలోంచి తల పైకెత్తే సరికే జనార్ధన్ గా మారిన జాన్సన్ గారు తన మనుషులతో దూరంగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు...
ఎందుకో ఈ సాయంత్రం త్వరగా చీకటి పడుతున్నట్టుoది!
*** *** *** ***
“అమ్మా నిమ్మీ! మన స్వీటీ మెచ్యూర్ అయింది. వెంటనే బయల్దేరి హైదరాబాద్ రావాలి నువ్వు. ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం ఎల్లుండి”
“ఓణీల ఫంక్షన్ మనమెప్పుడూ చెయ్యలేదు కదా మావయ్యా? ఏదో మన పాస్టర్ గారిని పిలిచి చిన్న ప్రార్ధన పెట్టుకుంటే పోయేదానికి ఎందుకివన్నీ?!”
“అబ్బే! అదేం కాదులేవే...ఏదో పిల్ల మీద ముచ్చట తీర్చుకోవాలిగా! అందుకే...”
ఎప్పుడూ లేనిది ఈ కొత్త ముచ్చట్లేమిటో అర్ధం కాలేదు నాకు. అయినా మావయ్య దగ్గరికెళ్ళి రెండేళ్ళవుతోంది. అందుకోసమైనా తప్పకుండా వెళ్లి తీరాలి.
*** *** *** ***
“అబ్బా..!! బైటికెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళమని ఎన్ని సార్లు చెప్పాలి నీకు!”
అప్పటికే మా మేనమామ ఇంట్లో ప్రతి గోడ మీదా కొత్త పటాలను చూసి నివ్వెరబోయిన నేను ఆయన మాటలకి ఉలిక్కిపడ్డాను!
“నో డాడీ ప్లీజ్! జీన్స్ మీద బొట్టు పెట్టుకోడం నా వల్ల కాదు! అయినా అలవాటు లేని పని ఎలా చేస్తారు? ఇంకా నయం జడగంటలూ పట్టీలు పెట్టుకోమనలేదు!” హడావుడిగా తన బ్యాగ్ లో సెల్ ఫోన్, చిన్న వాటర్ బాటిల్, పెన్స్, పేపర్స్ పెట్టుకుంటూ అంది స్వీటీ.
“ఏది ఉన్నా లేకపోయినా బొట్టు ఉండాలమ్మా, పెట్టుకుని వెళ్లు” ఆదేశించాడు మావయ్య
“నేను వెళ్లేది పేరంటాలకి కాదు డాడీ! నిన్న ఒక దళిత్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసా అసలు?! మా స్కూల్ లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. అక్కడికే వెళుతున్నా. బై!”
వెంటనే టీవీ పెట్టాను. ‘ఆ అబ్బాయిది ఆత్మహత్య కాదు! కుల వివక్ష, కుల రాజకీయాలు చేసిన హత్య అనీ, మనిషి ఎంత ఘనత సాధించినా కులానికి బలౌతున్న దళితులు, మైనారిటీలూ ఎంతోమంది ఉన్నార’ని ఉద్యమకారులూ, విద్యార్ధి సంఘాలూ పదే పదే చెప్తున్నారు. దేశం నలుమూలల నుంచీ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. వందలమంది విద్యార్ధులు, విద్యావేత్తలూ, సంఘాలూ వీధుల్లో భైఠాయించి ఆ కుర్రాడి కుటుంబానికి న్యాయం జరగాలని దీక్ష చేస్తున్నారు.
న్యూస్ చానల్స్ అన్నీ తిప్పుతూ ఎవరివో తెలిసిన మొహాల్లా కనబడి చప్పున ఆగాను. మా ఊరు వాళ్ళూ...మా స్కూల్ స్టాఫ్! వందలమంది ప్లకార్డ్స్, బానర్స్ పట్టుకుని ర్యాలీ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. వారిలో మొదటి వరుసలో ఖాళీ నుదురులతో ఉన్న చంద్రకుమారి, సువర్ణ కుమారి కనబడ్డారు!! దళితుల న్యాయం కోసం మీడియాతో మాట్లాడుతూ తన అసలు పేరును చెప్పిన జాన్సన్ గారు!
“మా దళితుల చావుకి విలువ లేదా?” అని నిలదీస్తూ మొద్దు నిద్ర లోంచి మేల్కొన్న మా లెక్కల ప్రసాదు!!
అతని మరణం లోకమంతట్లోని కుల హీనులనే కాదు, దైనందిన జీవితాల్లో పైకులాలతో పోరాడలేక నిద్రని నటిస్తున్న నా అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళలని కూడా తట్టి లేపింది! మమ్మల్ని ఏకం చేసింది!!

ఎన్ని యువ తారలు నింగికెగిరితే గానీ నుదిటి మీంచి ఈ దొంగ బొట్లు కిందికి రాలవేమో! ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే గానీ ఈ కుల జాడ్య సమాజం తెరలు తొలగించుకుని నగ్నంగా కనబడుతుందో!
ఏదో చప్పుడవుతున్నట్టు అనిపించి టీవీ మీద నుండి కళ్ళు మరల్చాను. మా మావయ్య ఇంట్లో గోడలూ, భరిణెలు కూడా ఖాళీ అవుతున్నాయి...
-మానస ఎండ్లూరి
https://www.facebook.com/manasa.evangeline.9/posts/745914338879031

11 Mar 2016

కరెక్టివ్ రేప్ Corrective Rape


 ‘పిల్ల కాలేజికెళ్ళిపోగానే రమ్మంటాను. ఎప్పుడూ ఆలస్యమే ఛ! అనుకుంటూ చికాగ్గా వరండాలో పచార్లు కొడుతున్నాను...గడియారం యాభై సార్లు చూసినా రాడు. పది మెటికలు విరిచినా రాడు. ఇరవై కూని రాగాలు తీసినా రాడు. ఫోన్ చేద్దామా అంటే బండి నడిపిస్తుంటాడేమోనని భయం!
కాసేపటికి లీలగా టీవీ చప్పుళ్ళలో వినబడుతోంది అతనొచ్చే బుల్లెట్ ధ్వని. ఎన్నిసార్లు ఆ శబ్దం విన్నా అలజడే నాకు! చివాలున లేచి ఫ్రిజ్ తెరిచి మల్లెపూలు జళ్ళో తురుముకున్నాను. చల్లని బిందువులు నా వీపుని తమాషాగా తాకాయి. మరో సారి అద్దం చూసుకుని ముంగురులు తిప్పుకుని పరుగు పరుగున వెళ్లి తలుపు తెరిచాను.  
పాలలాంటి తెల్లని ఖద్దర్ చొక్కా, మెళ్ళో నాలుగు బంగారు గొలుసులు, వేళ్ళకి ఏడు ఉంగరాలు, బంగారు వాచీ...అతని వంటి మీద ఎన్ని అలంకరణ ఆభరణాలున్నా తన కళ్ళలో ఉండే ఆ కొంటె చూపుతో ఏమాత్రం పోటీ పడలేవు! వచ్చీ రాగానే చటుక్కున తన బలమైన చేతుల్లో నన్ను బిగించి నా పెదవులను గాఢoగా...
ఆలస్యమైన ప్రతిసారీ ఇంతే. ఛీ పో! కుమార్ ని విడిపించుకుని దూరం జరిగాను.
నా వెనుక నుండి హత్తుకున్నాడు...
మల్లెపూలు ఇప్పుడే పెట్టుకున్నావు కదూ! నా కోసమేగా! రా మరీ..
భోజనాలు చేయాల్సిన సమయంలో దాహాలు తీర్చుకున్నాం...
ఏమీ లేని నా నడుం పై చెయ్యి వేసి నొక్కుతూ అన్నాడు కుమార్-
అబ్బ! ఎంత అందం! ఇంత అందగత్తెను కష్టపెట్టినందుకే నీ మొగుడు పుటుక్కుమనుంటాడు!
ఆ మాట నాకు నచ్చలేదు. బతికున్నప్పుడు నా మొగుడు నన్ను కష్టాలు పెట్టిన మాట నిజమే అయినా, ప్రమాదవసాత్తూ వచ్చిన ఆయన చావుని హేళన చేయడం బాధ కలిగించింది. గొంతు తడవక ముందు కుమార్ మాటల్లో ఉండే తియ్యదనం దాహం తీరిపోయాక కరిగిపోతుంటుంది.
వదిలేసిన విలువల్ని ఎటూ తొడుక్కోలేం కాబట్టి ఆ అవకాశం వలువలకిచ్చాం. భోం చేసి కాసేపలా నడుం వాల్చాం. కాకపోతే ఒకరి దాని పై మరొకరిది.
ఇంతకీ నీ కూతురి సంగతేం ఆలోచించావ్ విజయా? అడిగాడు కుమార్.
ఏముంది ఆలోచించడానికి? ఈ నెలతో దాని పరీక్షలైపోతాయి. వెంటనే మా తమ్ముడు కొడుకు శరత్ తో పెళ్లి
అదేంటి అంత త్వరగా! పై చదువులూ, ఉద్యోగం చేయించవా? డబ్బుకేం ఇబ్బంది? నేనున్నాను కదా
లేదు కుమార్! స్పందన ఎవరితోనో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుంది. అదీ, దాని ఫ్రెండ్ శిరీష పద్దాక తలుపులేసుకుని ఏంటేoటో చర్చలు నడిపిస్తున్నారు. కచ్చితంగా స్పందన ఎవరో అబ్బాయితో ప్రేమలో ఉంది! ఆ విషయమే మాట్లాడుకుంటారనుకుంటా. మేనల్లుడికిచ్చి చేస్తే మా వాళ్ళందరూ దాన్ని బంగారంలా చూసుకుంటారు. అదీ కాక మా తమ్ముడికి మూడు తరాలు తిన్నా తరగని ఆస్తి కూడా ఉంది కదా
చిన్న పిల్ల కదా అప్పుడే పెళ్ళెoదుకని. పోనీ వాడెవడో నన్ను కనుక్కోమంటావా?
వద్దొద్దు! మన విషయం బయటపడే ప్రమాదముంది. నేనే కనుక్కుంటా
సరే విజయా నేను టౌన్ షిప్ కి వెళ్ళాలి. రేపు చాలా పనులున్నాయి. ఎల్లుoడొస్తాను
గుమ్మం వరకు నా భుజాల చుట్టూ ఉన్న కుమార్ చేతులు గుమ్మం దాటాక హుందాగా తన ప్యాంట్ జేబుల్లోకి వెళ్ళిపోయాయి...
సాయంత్రం ఐదింటికి వచ్చారు స్పందన, దాని ఫ్రెండ్ శిరీష. ఈ మధ్య నాతో మాటలు కూడా తగ్గించేసింది స్పందన. మరో పక్క కుమార్ సంగతి తెలిసిపోయిoదేమోనని ఒకటే కంగారు నాకు. పెళ్లి గురించి, శరత్ గురించి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు.
కాలేజీ నుంచి అలసిపోయి వచ్చారు కదా అని జీడిపప్పు, కూరగాయలు వేసి ఉప్మా చేసి వేడి వేడిగా చెరో పళ్ళెంలో పట్టుకెళ్ళాను స్పందన గదికి. ఎప్పటిలాగే తలుపేసుంది. ఎప్పుడూ వాళ్ళిద్దరి కబుర్లు పూర్తిగా అర్ధం కాకపోయినా కొద్దో గొప్పో బయటకు వినబడుతూ ఉంటాయి. కానీ ఈ సారి చడీ చప్పుడు లేకుండా నిశ్సబ్దంగా ఉంది. చెవులు తలుపుకు అతికించినా ఫ్యాన్ చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు. ఎందుకో అనుమానం ఎక్కువైంది నాకు. ఉప్మా పళ్ళేలు వంటగదిలో పెట్టి బయట నుండీ ఆ గది కిటికీ దగ్గరకు వెళ్లాను. బిగించి ఉంది. ఏం చేయాలో పాలుపోలేదు. కిటికీలోంచి సన్నని వెలుగు రేఖ ‘నేనున్నానని’ ఆసరా ఇచ్చిoది. చూశాను. అవాక్కయ్యాను...అసహ్యించుకున్నాను!
వెంటనే లోపలికెళ్ళి తలుపులు దబ దబా బాదాను. రెండు నిమిషాలకి తలుపులు తెరిచారు. తోడు దొంగల్లా నిలబడ్డారు, బట్టలూ ఒళ్ళూ నలిగిపోయి. ఇద్దరి చెంపలు వాయగొట్టి శిరీషని మళ్ళీ ఈ చుట్టు పక్కల కనిపిస్తే కాళ్ళిరగ్గొడతానని హెచ్చరించి ఇంట్లోంచి బయటకు గెంటాను. స్పందన ఫోన్ లాక్కుని కాల్ లిస్ట్, మెసేజెస్ అన్నీ చూశాను. స్పందన ప్రేమలో పడింది నిజమే, శిరీషతో!   
“నువ్వు నాకు శరత్ ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావని నాకు తెలుసు! శరత్ అంటే నాకు ఇష్టం లేదు. అసలు ఏ మగాడూ ఇష్టం లేదు! శిరీషతోనే నా భవిష్య...” ఆ మాట పూర్తియ్యేలోపే స్పందన మొహానికి నేను కోపంగా విసిరిన కాఫీ కప్పు తగిలింది! నుదురు చిట్లి కొద్దిగా రక్తం కారింది. వెంటనే తేరుకుని నేను స్పందన దగ్గరకు వెళ్ళినా నన్నసలు ముట్టుకోనివ్వలేదు.
స్పందన అలిగి అన్నం కూడా తినలేదు. ఏడుస్తూనే పడుకుంది. నేనూ తినకపోతే షుగర్ డౌన్ అయ్యి నీరసమొచ్చేస్తుంది. పేరుకి నాలుగు ముద్దలు తిని మాత్రలేసుకుని మంచమెక్కాను. నిద్ర పడితే కదా! స్పందన - దాని సుఖ సంతోషాలు- మంచి వాడైన శరత్- వాడి కోట్ల ఆస్తి- స్పందనకి మగవాళ్ళoటే గిట్టకపోడం- దాన్ని ఎలా మార్చాలి? ఇవే నా ఆలోచనలు.
ఉదయాన్నే లేచి శరత్ కి ఫోన్ చేసి రమ్మన్నాను. స్పందనతో శరత్ కాస్త చనువుగా ఉండడం మొదలు పెడితే సరవుతుందేమో అని నా ఆశ! కుమార్ ఈ రోజు రానన్నాడు కాబట్టి రోజంతా శరత్ స్పందనలని ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను నా స్నేహితురాలింటికి వెళ్లాను. సాయంత్రం వచ్చే సరికి స్పందన ఒకటే ఉంది.
“శరత్ ఏడి? వెళ్ళిపోయాడా?” అడిగాను చీర మార్చుకుంటూ...
“వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు. చదువుకోవాలని చెప్పాను” నా వైపు చూడకుండా పొగరుగా సమాధానం చెప్పింది స్పందన.
“చేస్కోబోయేవాడితో ఇలాగేనా ప్రవర్తించేది? నీ కోసమే అంత దూరం నుంచీ వచ్చాడు! పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా ఇక నుంచైనా శరత్ తో సవ్యంగా ఉండు” గదిమాను.
“అమ్మా!! నాకు శిరీషంటేనే ఇష్టం. మేం కలిసే ఉండాలనుకుంటున్నాo. పెళ్లి కూడా చేసుకుంటాం! ఎవరు ఏమి అనుకున్నా సరే!”
చెంప చెళ్ళుమనిపించాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది.
స్పందన గురించి ఆలోచిస్తుంటే మతిపోతుంది నాకు. ఈ మధ్య ఇలాంటి సంబంధాలు అక్కడా ఇక్కడా విని నవ్వుకునేదాన్ని గానీ, నా దాకా వచ్చేసరికి చాలా ఆందోళనగా ఉంది! ఈ సారి గట్టిగా ఓ నిర్ణయానికి వచ్చి మళ్ళీ శరత్ కి ఫోన్ చేశాను స్పందనకి తెలియకుండా.
“హలో! ఏరా శరత్తూ! ఇంటికెళ్ళిపోయావా?”
“నీ కూతురు ఛీ కొట్టాక కూడా ఉంటాననుకుంటావా? దాని కోసం నా పనులన్నీ పక్కన పెట్టి వెళితే చదువుకోవాలంటుందా! దానికి పరీక్షలున్నప్పుడు నాకెందుకు ఫోన్ చేసి రమ్మన్నావత్తా మరి”
“ఎందుకు రా అంత కోపం! రాత్రి కాస్త కోప్పడ్డానని అలిగింది అంతే”
“అయినా స్పందనకి నా మీద ఇష్టం లేదత్తా. నాకు అదంటే ఇష్టమే గానీ ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ సుఖం ఉండదు. నాన్నతో ఈ విషయం మాట్లాడుతా త్వరలో”
“ఒరే ఒరేయ్! అంత పని చెయ్యకు రా బాబు! తండ్రి లేని పిల్ల. మనింట్లోనే ఇస్తే సుఖంగా ఉంటుందని నా ఆశ రా”
“అంతేలే! నా గురించి ఆలోచించడం లేదు నువ్వు. పో అత్తా”
“అబ్బా! అది కాదు రా. స్పందన గురించి నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎవరితో చెప్పకు మరి”
“సరే చెప్పు! ఎవడినైనా ప్రేమించిందా?”
“అవును. కానీ దాని ఫ్రెండ్ శిరీషని! దాన్నే పెళ్లి చేసుకుంటాను అని ఏదేదో మాట్లాడుతుంది రా. నాకంతా గందరగోళంగా ఉంది!”
“వామ్మో! మన స్పందనేనా??”
“ఆ! అందుకే నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతూ దాంతో చనువుగా అక్కడా ఇక్కడా తాకుతూ ఉంటే దానిలో మార్పు వస్తుంది రా! ఏదో తెలియక అలా ప్రవర్తిస్తుంది గానీ మగ గాలి తగలితే అన్నీ అవే సర్దుకుంటాయి! ఎంత దూరమైనా వెళ్ళు! ఎలాగూ నిన్నేగా చేస్కోవాలి. కొద్దిగా మారాం చేసినా బలవంతంగా అయినా పని కానివ్వు. అర్ధమయ్యిందా!”
“అత్తా అంతేనంటావా?”
“అబ్బా! అది తప్పు చేస్తోంది, మనం సరి చేస్తున్నామంతే! ఏం సందేహాలు పెట్టుకోకు. రేపు ఇంటికి రా చెప్తాను”
“సరే అత్తా ఉంటాను”
శిరీష వెళ్ళిపోయిన రోజు నుండీ స్పందన తిండీ నిద్రా లేకుండా ఉంది. దాన్ని చూస్తే ఒక పక్క జాలి మరో పక్క కోపం!
మరుసటి రోజు వచ్చాడు శరత్. స్పందన దగ్గరకెళ్ళి సర్ది చెప్పాను. ‘శరత్ తోనే నీ జీవితం. అతన్ని కాదనకు’ అని. వాడ్ని లోపలి పంపించి నేను కుమార్ దగ్గరకు బయల్దేరాను.
“అబ్బ! ఏంటా కంగారు? వస్తుంటేనే లాగేస్తున్నావ్!” అన్నాను కుమార్ ఇంటి వాకిట్లో అతని చెయ్యి వదిలించుకుంటూ
“ఎవరైనా చూస్తే కొంపలంటుకుంటాయి! ఇంట్లో భార్యా పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ల కళ్ళన్నీ నా పైనే”
“నేను మీ ఇంటికి రావడం ఇదే మొదటి సారి కదా! ఇంతకు ముందు ఇంకెవరైనా వచ్చారా ఏంటి?” హాల్లోకెళ్ళి చెప్పులిప్పుతూ అన్నాను.
“అవన్నీ ఇప్పుడెందుకు. రా లోపలికి”
పడగ్గదిలోకి నడిచాం ఇద్దరం.
ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటూ స్పందన విషయాలన్నీ చెప్పాను. కుమార్ ఆశ్చర్యపోయాడు.
“సరేలే! దిగులు పెట్టుకోకు. మెల్లగా మారుతుంది. పోనీ తనతో నన్ను మాట్లాడమంటావా?”
“నువ్వా? యేమని పరిచయం చెయ్యను నిన్ను? దానికి అనుమానమొస్తే తలెత్తి నిలబడలేను ఇంట్లో”
“అదీ నిజమేలే”
సాయంత్రం ఇంటికెళ్ళే సరికి శరత్ హాల్లో టీవీ చూస్తున్నాడు.
“ఏరా శరత్తూ! ఏంటి విషయం? ఏమైనా మాట వినిందా స్పందన”
“లేదు! చెయ్యాల్సింది చేశాను. బాగా ఏడ్చింది. ఇంకో రెండ్రోజులు ఇదే పని మీద ఉంటే తనే దార్లోకొస్తుంది!” భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శరత్.
బత్తాయి రసం చేసి స్పందనకి తీసుకెళ్ళాను. చాలా కోపంగా ఉంది నా మీద. ఒంటి మీద సరిగ్గా దుస్తుల్లేకుండా ముఖం దాచుకుని పడుకుంది మంచమ్మీద. అక్కడక్కడా పళ్ళ గాట్లు కూడా ఉన్నాయి. “స్పందూ! లేమ్మా కొద్దిగా బత్తాయి రసం తాగు”  
ఒక్కసారిగా లేచి విరుచుకుపడింది!
“నాకు అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు. నువ్వెంతమంది మగాళ్ళతో నన్ను పాడుచేయిoచినా నాకు వాళ్ళు నచ్చరు! నాకు శిరీషంటేనే ఇష్టం. శిరీష లేకుండా నేను బ్రతకలేను! నన్నర్ధం చేస్కోడానికి ప్రయత్నించు” ఇల్లు అదిరిపడేలా అరిచింది స్పందన.  
కూతురు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలనే నా కోరిక ముందు దాని తాత్కాలిక బాధ నన్ను పెద్దగా స్పృశించలేదు! ఈ రాత్రి కూడా స్పందన అన్నం తినలేదు. అది ఈ ‘ఆడ’ ప్రేమ మాని బాగుపడితే అదే పదివేలు!
శరత్ మరో రెండ్రోజులు స్పందనని ‘బాగు’ చేసే పనిలోనే ఉన్నాడు. కానీ ఏం లాభం? ఉండేకొద్దీ మరీ మొండిగా తయారైంది. శరత్ కూడా విసుగు చెందుతున్నాడు. కుమార్ భార్యా పిల్లలు ఇంకా ఊళ్లోకి రాలేదు. వాళ్లు వచ్చే వరకు నేనే కుమార్ ఇంటికి వెళ్తున్నాను. స్పందనని శరత్ కి అప్పగించి.
“ఏంటి నీ కూతురు ఇంకా మారలేదా?”
“లేదు. దాని మనసు అంతేనట! మారనని తెగేసి చెప్పింది. నాకు చాలా భయంగా ఉంది కుమార్. పోనీ డాక్టర్ దగ్గరకు తీస్కెల్దామంటే ఇల్లు కదిలితే ఒట్టు!”
“అయ్యో!! రేపు నా భార్యా పిల్లలు ఊర్నుండి వచ్చేస్తున్నారు! మరి మనం కలవడం ఎలా?”
ఇల్లు కాలి బూడిదవుతుంటే మొహానికి విభూదడుగుతున్నాడు కుమార్.
మరుసటి రోజు ఉదయాన్నే ఓ స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లాను. స్పందనని ఎంత బతిమిలాడినా రాలేదు. శరత్ కూడా ఊళ్ళో లేడు.
ఫంక్షన్ లో ఉన్నాననే మాటే గానీ మనశ్శాంతే లేదు! వచ్చి చాలా సేపవుతున్నా అందరితో కలవలేకపోయాను. వచ్చిన వాళ్ళందరూ ఎవరి మాటల్లో మునిగిపోయారు. నాకు బోర్ కొట్టి టీవీ పెట్టాను. స్పందన మృతదేహం!!! నా ఇంటి చుట్టూ జనం, పోలీసులు, మీడియా! హుటాహుటిన ఇంటికి పరిగెత్తాను.
గుమ్మంలో టీవీ రిపోర్టర్-
“రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్పందన అనే యువతి పై పొద్దున్నుంచీ అనేక సార్లు అత్యాచారం జరిపి ఆ పై ఆమెకు ఊపిరాడకుండా దిండుతో ముఖంపై నొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె వెంటనే మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. కుమార్ పరారీలో ఉన్నాడు. ఆమెకీ కుమార్ కీ ఏంటి సంబంధ..”
ఇక నాకేమీ వినిపించలేదు...
ఎదురుగా శవమైన నా కూతురు స్పందన, కళ్ళ ముందు కుమార్ రూపం, పోలీసుల మాటలు, మీడియా యక్ష ప్రశ్నలు...
నా మెదడు పని చేయడం ఆగిపోయింది...కానీ వెంటనే విన్న మరో వార్తకు నా నరాలు తెగిపోయాయి...
“స్పందన మరణ వార్త విని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన ఆమె ప్రాణ స్నేహితురాలు శిరీష!”   
స్నేహితురాలు కాదు, ఎవరికీ తెలియని ప్రేమికురాలు..!
***********
మానస ఎండ్లూరి
8 March 2016, విహంగ అంతర్జాల పత్రిక
http://vihanga.com/?p=16779#sthash.xvhcnxSd.vMP8WARb.dpbs










అదే ప్రేమ!


           ‘ఇది తీయని వెన్నెల రేయి...మది వెన్నెల కన్నా హాయి...నీ ఊహల జాబిలి రేఖలు మురిపించెను ప్రేమ లేఖలు...’
                నేనూ అర్జున్, ఒకే ఇయర్ ఫోన్స్ లో ఏ వెయ్యో సారో వింటున్నాం ఈ పాట! మా తోట ఊయలలో...నా ఒళ్ళో అర్జున్!అతని గుండెల మీద నా చేతిని తన చేత్తో పెనవేసుకున్నాడు. తను కళ్ళు మూసుకుని పాటని ఆశ్వాదిస్తున్నాడు..నేను అర్జున్ స్పర్శలో కరిగిపోతున్నాను...ఊయలకి అల్లుకున్న సన్నజాజులు నా చెక్కిలిని ముద్దాడుతున్నాయి. ఈ రేయి...ఈ సన్నజాజులు పెట్టే గిలిగింతలు...ఈ ఊయల...ఈ పాట...నా అర్జున్!అబ్బ! ఎంత అదృష్టం! ఈ రాత్రి ఇంకా ఉండాలి.సూర్యుడు కాస్త మెల్లగా ఉదయిస్తే ఎంత బావుడ్ను!ప్చ్!
           అర్జున్ ని ఈ పాట నా కోసం ఎన్ని సార్లు పాడమన్నా పాడడు.ఇప్పుడైనా అడగాలి! చల్లగాలికి మల్లె రేకలు సీతాకోకచిలుక రెక్కల్లా రెపరెపలాడుతున్నాయి..కాస్తంత దూరంగా మరువం సువాసన వాతావరణాన్ని ఇంకాస్త మత్తెక్కిస్తోంది..వెన్నెల కాంతిలో అర్జున్ ముఖం మరింత మెరిసిపోతోంది!కోటేరు ముక్కు..చిన్ని నుదురు..అందమైన పెదవులు..వాటిపై తన మగసిరి చూపించే మీసం...అసలు అర్జున్ అందమంతా ఆ మీసంలోనే ఉంది!
          మెల్లగా ఒంగి పెదాల చివరన ముత్యమంత ముద్దు పెట్టాను తన మీసానికి తగిలీ తగలకుండా!చిత్రం!!అర్జున్ లెగలేదే?!నిద్రలోకి జారుకున్నాడా ఏంటి?!అరె!పాట పాడమని అడుగుదామనుకున్నాను కదా!మీసం చివర నుంచి తన చెంపను స్పృసిస్తూ చెవి వెనుక మృదువైన ఒక ముద్దు!కిందకి జారుతూ మెడ మీద ఒక ముద్దు!నా కోసం కట్టిన గుడిని పదిలపరిచిన తన గుండెకి ఒక చిన్న ముద్దు!నా ప్రేమనంతా కలబోసి తన అరచేతిలో ఒక సున్నితమైన ముద్దు!నా ప్రేమను అంగీకరించినందుకు నుదుటి మీద మరో ముద్దు! మూతలు పడ్డ కనురెప్పల మీద లేలేత ముద్దు!
          అర్జున్ కి ఇంకా మెలకువ రావడం లేదే?నా తాకిడిలో జీవం లేదా?లేక ఆట పట్టిస్తున్నాడా?!
“అర్జున్!అర్జున్!” పిలుస్తున్నా లేవడం లేదే! ఇక లాభం లేదు!గట్టిగా తట్టాల్సిందే!
“అర్జున్ లే!” గట్టిగా ఊపుతూ కింద పడ్డాను!!
“డార్లింగ్!”
‘నడి రాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు...’
ఇయర్ ఫోన్స్ లో పాట...మంచం కింద నడ్డి విరిగి నేను!!
“ఛ!ఇదంతా కలా!?ఆఖర్లో ‘డార్లింగ్’ అని అర్జున్ నన్ను పిలిచినట్టు కూడా అనిపించిందే! దెబ్బకి మత్తు వదిలిపోయింది” అనుకుంటూ పైకి లేచాను.
          ఫోన్ లో పాట ఆపేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి నీళ్ళు గొంతులో పోస్కోబోయి ఒళ్ళంతా తడుపుకున్నాను! స్వయకృతాపరాధానికి తిట్టుకుంటూ తడంతా తుడుచుకునొచ్చి బట్టలు మార్చుకుని ఈ సారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచినీళ్ళు తాగి మళ్ళీ మంచమెక్కాను.కళ్ళు మూసుకోగానే అర్జున్!ఎందుకు ఈ అబ్బాయి ఇలా నన్ను చిత్రవధ చేస్తున్నాడు!మనసులో మాట చెప్తే ఎలా తీసుకుంటాడో!ఏమనుకుంటాడో!ఆఫీస్ లో తన కంటే సీనియర్ ని!పైగా టీం లీడర్ ని!!చులకనై పోతానేమో అని ఒక బాధ!ఒక వేళ తనకీ నా లాంటి ఉద్దేశమే ఉంటే?! ఉన్నట్టే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అతను నన్ను చూసే  చూపులకి!!
            అర్జున్ ఆఫీస్ లో చేరి పదకుండు నెలలవుతుంది.అంటే దాదాపు ఏడాది కాలంగా నా ప్రేమను నా లోనే దాచుకొని మధన పడుతున్నాను!రేపు ఎలాగోలా చెప్పేస్తాను!అసలే అందగాడు అందులోనూ మంచివాడు!ఇంకెవరైనా ఎగరేసుకుపోతారు! నిద్రపోదామని కళ్ళు మూశాను.కొంటెగా కన్ను గీటుతూ అర్జున్!చప్పున లేచి కూర్చుని సెల్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్ పిన్ కొట్టి అర్జున్ కి తెలియకుండా తీసిన తన ఫొటోస్ చూసుకున్నాను.
 “ఎంత ముద్దుగా ఉన్నావు రా!కల్లో కూడా అచ్చం ఇలాగే ఉన్నావే!” నా పిచ్చి చేష్టలకి నేనే నవ్వుకుని ఫోన్ ఆఫ్ చేసి అర్జున్ తలపులతోనే నిద్రపోయాను.
              రోజూ పొద్దున్నే నిద్రలేచి తయారై ఆఫీసుకి వెళ్ళడమంటే మహా విసుగ్గా ఉండేది అర్జున్ రాకముందు. కానీ ఇప్పుడు? పొద్దెప్పుడెక్కుతుందా అని, అప్పుడే అస్తమిస్తున్నవా అని సూర్యుడ్ని రోజుకి రెండు సార్లు తిట్టుకోవాల్సి వస్తుంది! ఆఫీసు టైం అయిపోతుంది అంటే నేను పడే బాధ స్కూల్ పిల్లలు కూడా పడరేమో!
                                ***           ***             ***
              ఆఫీసు పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి దిగుతూనే ఎదురయ్యాడు అర్జున్!వంగపండు రంగు చొక్కా, గోధుమ రంగు పాంటు...ఆ ఐదడుగుల పదంగుళాల ఎత్తూ...ఆ అందం ఆ మీసం...పైనాపిల్ కేక్ మీద చెర్రీ పండులా ఊరించేస్తున్నాడు! అప్రయత్నంగా పలకరించేశాను!
“హాయ్ అర్జున్!వాట్సప్?”
“హాయ్ టీ యల్!కళ్ళెర్రగా ఉన్నాయండి!నిద్రపోలేదా సరిగ్గా?
‘నీ విరహాగ్నిలో నిద్రెక్కడ పడుతుంది?’ లోపల అనుకుని
“హా!లైట్ గా” అన్నాను పైకి
“ఓ ఐ సీ!ప్లీజ్ టేక్ కేర్ అఫ్ యువర్సెల్ఫ్”
“ష్యూర్” నా వలపులు పైకి కనబడకుండా జాగ్రత్త పడుతూ అన్నాను
“హేయ్!నైస్ గ్లాసెస్!ఎక్కడ తీస్కున్నారు?” అడిగాడు నా కొత్త కళ్ళజోడు చూస్తూ
“నచ్చాయా?ఉంచేసుకోండి!” అనేసాను మనసులోని మాట
“అరెరే!వద్దండి.నేనూ ఇలాంటి వాటి కోసమే వెతుకుతున్నాను.అందుకే అడిగాను.అయినా  మీవి పెట్టుకోడం బాగోదు!”
“ప్లీజ్!తీసుకోండి. మొహమాట పడొద్దు!నా గిఫ్ట్ అనుకోండి అర్జున్” బలవంతంగా అతని చేతిలో పెట్టేశాను.
“అదేంటండీ!అసలే నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు.టీం లీడర్ అయ్యుండి నా పనంతా మీరే చేసేస్తారు.పైగా ఇదొకటి!” చాలా సిగ్గుపడుతూ అన్నాడు.ఎంత ముద్దొచ్చేశాడో!
“నిన్న మీకు ‘బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అండి.నిన్నే చెప్దామనుకున్నా కానీ అందరూ మీ చుట్టే ఉండడం వల్ల చెప్పలేకపోయా!సారీ!రెండేళ్ళ
నుంచీ ఆ అవార్డు మీకే వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా! మీ టీం మెంబెర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది!”
 అర్జున్ కళ్ళు మెరిసిపోతున్నాయి!తన మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. తన చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.
“సరె సరే!ఎక్కువ పొగిడేయకండి!థ్యాంక్ యు!మళ్ళీ కలుద్దాం!”
షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనసు సిద్ధంగా ఉంది కానీ ధైర్యం సరిపోలేదు!
‘ఏమనుకుంటాడో?’ అనే ఒక్క ప్రశ్న అన్నిటికీ అడ్డం పడుతోంది ముందుకి సాగనివ్వక!
***           ***             ***
          మరుసటి రోజు కేఫటేరియాలో బాదంపాలు తాగుతూ కనిపించాడు అర్జున్.నా మనసంతా నిర్లిప్తంగా ఉంది.అర్జున్ని చూస్తుంటే నా మీద నాకే జాలి!సానుభూతి!చెప్పాలనుకున్న మాటలన్నీ పెదవి వెనుకే ఆగిపోతున్నాయి. ఈ జన్మకి చెప్పగలనా?చెప్పడానికి భయం కాదు!మొహమాటం లేదు!సంకోచం మాత్రమే.తరువాత జరిగేది ఊహకి అందడం లేదు!ఔనంటే నా అంత సంతోషించేవారు లేరు.కాదంటే?అదొక ఘోర అవమానం! కళ్ళల్లో నీళ్ళు రానివ్వకుండా ప్రయత్నిస్తున్నాను.
   “మీ పెర్ ఫ్యూమ్ చాలా బావుంది టీ యల్!” చక్కటి చిరునవ్వుతో అన్నాడు అర్జున్.
“ఎందుకు విచిత్రంగా టీ యల్ అని పిలుస్తారు? అందరిలా పేరు పెట్టి ‘నువ్వూ’ అని మాట్లాడొచ్చుగా!నేనూ ఎవరితో ఇంత ఫార్మల్ గా మాట్లాడను. మీతోనే!”
“అంటే ఈ ‘గార్లు’, ‘బూర్లు’ మనిద్దరికే ప్రత్యేకం అన్నమాట!మంచిదేకదండీ!ఇందాక నేను మీకొక కంప్లిమెంట్ ఇచ్చాను!బదులు చెప్పనే లేదు!”
‘నాకు తెలుసు నీకిష్టమైన బ్రాండ్ అని!అందుకే కొనుకున్నాను’ మనసులో అనుకుని
“థ్యాంక్ యు!మీకు నచ్చినందుకు” ఏ ఆర్భాటం లేకుండా అన్నాను అర్జున్ తో
 “మీకు ఏం ఆర్డర్ చెయ్యమంటారు?
“టీ”
“ఓ గుడ్.నేనైతే అస్సలు టీ కాఫీ తాగను టీ యల్” అంటూ లేచి వెళ్ళాడు.  
  ఏంటి?టీ కాఫీ తాగడా?అన్నీ తెలుసుకున్నాను కానీ ఈ విషయం తెలీదే నాకు!ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అంత సులువా?!ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒకరి పట్ల ఒకరికి సరిగ్గా అవగాహన ఉండదు!నేనెంత!అర్జున్ తో మాట్లాడడానికి ఇదే అనువైన సమయం!అడిగేస్తాను!నేనంటే ఇష్టమో లేదో!
   అర్జున్ టీ తీసుకువస్తున్నాడు.బ్లూ జీన్స్,బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ లో అదిరిపోయాడు ఇవ్వాళ!టీ తెచ్చి ఎంతసేపైనా తాగలేదు నేను.
“అదేంటి ఇంకా టీ తాగలేదు మీరు?” కప్పు లోకి తొంగి చూస్తూ అడిగాడు అర్జున్
“మీకిష్టo లేదుగా!” తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాను
“అదేంటి?నాకిష్టం లేకపోతే ఏం?” తటపటాయించాడు
“హహ్హహ!టీ బాలేదు అందుకే”
“అయ్యో!పోనీ కాఫీ తీసుకురానా?
“వద్దు బాదం పాలు ట్రై చేద్దామనుకుంటున్నా!”
“తెస్తాను టీ యల్!ఒక్క నిమిషం” లేవబోయాడు
“ఎందుకు?మీ చేతిలో ఉందిగా బాదంపాల టిన్!” ఎంత ఆపుకున్నా ముఖం లో సిగ్గు తొణికిసలాడుతూనే ఉంది నాకు.
“అదీ...అంటే నేను కొంచెం తాగాను.మీకు వేరేది తెస్తాను!”
“పర్లేదు!మీరు తాగాక ఆఖరిలో జస్ట్ టేస్ట్ చేస్తానంతే!”
అతడి ముఖంలో మార్పులు!కానీ స్పష్టత లేదు!!
                                                ***           ***             ***
“హ్యాపీ బర్త్ డే అర్జున్!”
“థ్యాంక్ యు టీ యల్.నాకు తెలుసు మొదటి కాల్ మీరే చేస్తారని!”
“అదెలా?”
“అదంతే!ఎలాగూ సండే కాబట్టి మీకో చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నాను.మీరు తప్పకుండా రావాలి!”
“అదేం వద్దు కానీ, మీ బర్త్ డే మా ఇంట్లోనే చేసుకోవచ్చు!మీరే రండి!పదకుండు గంటల కల్లా!”
“ఇంట్లో అంటే...మీ పేరెంట్స్ ఉంటారు కదా?పర్వాలేదా...?”
“ఏంటి మీకు తెలీదా?వాళ్ళు అమెరికాలో మా అక్క దగ్గర ఉంటున్నారు.ఇంట్లో నేను మాత్రమే ఉంటాను.వచ్చేయండి!బై”
 ధైర్యం చేసి అర్జున్ ని పిలిచేశాను!అతనికి ఇష్టమైన కేక్ ఆర్డర్ చేశాను.ఇల్లంతా డెకరేట్ చేశాను. తనకి నచ్చే వంటలన్నీ స్వయంగా చేశాను.అన్నీ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళిన ఐదు నిమిషాలకి బెల్ మోగుతోంది!అయ్యో! అర్జున్ వచ్చేశాడే!ఇలాగే టవల్ లో వెళ్లి దర్శనమిస్తే?చిలిపిగా నవ్వుకుని క్షణాల్లో రెడీ అయి తలుపు తీశాను.
          తలారా స్నానం,కొత్త బట్టలు,కొత్త సెంట్,కొత్త వాచ్...సరికొత్త అర్జున్!లోపలికి వస్తూనే డెకరేషన్ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
“ఎందుకు ఇదంతా?”గోముగా అన్నాడు అర్జున్
“ముందు ఇది కట్ చేయండి!” చాకు అందిస్తూ అన్నాను
“నాకు చాక్లెట్ కేక్ ఇష్టమని మీకెలా తెలుసు?” ప్రేమగా అడిగినట్టు అనిపించింది
“ఇంకా చాలా తెలుసు!” ఓరనవ్వు తో సమాధానమిచ్చాను
అర్జున్ కేక్ కట్ చేశాడు.ఆ తర్వాత కట్ చేసిన కేక్ నాకు తినిపిస్తాడనే తలపే నాకు ఊపిరాడకుండా చేస్తుంది!అతని ముని  వేళ్ళు నా పెదాలకి, మునిపంటికి తగిలాయి!గుండె ఝల్లుమంది!!చిరు చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా.అరచేతులు సన్నగా వణుకుతున్నాయి.తనకివ్వాల్సిన కానుక నా గుప్పిట్లో ఊపిరాడక అవస్థ పడుతోంది!అర్జున్ ఎదురుగా నిలబడి ఒక్కొక్క వేలూ తెరిచి కానుక చూపించాను.అతడి కళ్ళు చెమర్చాయి!అమితాశ్చర్యంగా దాన్ని అందుకున్నాడు.
“నాకా?” ఉవ్వెత్తున ఎగిసే ఆనందం నిండిన కళ్ళతో అడిగాడు అర్జున్.
అవునన్నట్లు తలూపాను.
“మీరే పెట్టండి”
ఆ బంగారపుటుంగరం మా బంగారు భవిష్యత్తుకి పునాది అని నా ఆలోచన. కానీ ఆ మాట బయటకు చెప్తేగా తనకీ తెలిసేది!అర్జున్ చేతుల్లోంచి ఉంగరం తీసుకుని తన కుడి చేతి ఉంగరపు వేలికి తొడిగాను. నా చేతులు చల్లగా, తడిగా...వణికిపోతున్నాయి!అర్జున్ చేతికి చాలా అందంగా ఉందా ఉంగరం. నాకు మాటలు రావడం కష్టంగా ఉంది.
“భోం చేద్దాం పదండి” అన్నాను. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.
డైనింగ్ టేబుల్ మీద పన్నీర్ కోఫ్తా,మటన్ ఫ్రై,చికెన్ బిర్యానీ,డబల్ కా మీఠా,అన్నం, పప్పు, గోంగూర పచ్చడి,ములక్కాడ జీడిపప్పు కూరలు చూసి అవాక్కయాడు!
“ఏంటండీ ఇవన్ని ఎవరితో చేయించారు?”
“ఎవరు చేస్తారు?నేనే” దొంగ కోపంతో అన్నాను.
“మీరా టీ యల్!నా కోసం మీరు చేశారా?నాకిష్టమైనవన్నీ నాకు తెలియకుండా కనుక్కుని ఇంత సర్ప్రైస్ ఇచ్చారు!నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇది!మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు.బహుశా బ్యాచిలర్ గా ఇదే నా ఆఖరి పుట్టినరోజు అనుకుంటా!”
        కాళ్ళకింద భూమి కంపించినట్టైంది నాకు!పెళ్ళా??అంటే అర్జున్ కి నా మీద ప్రత్యేకాభిమానం లేదనమాట!ఇంత తేలిగ్గా చెప్పేశాడేంటి?ఎంత దిగమింగడానికి ప్రయత్నించినా దుఃఖం,బాధ బొట్టు బొట్టుగా కళ్ళ వెంబడి కారుతూనే ఉన్నాయి...నా ఆవేదన దాచుకోడంలో విఫలమై అర్జున్ ముందు కన్నీటి పర్యంతమయ్యాను.అర్జున్ ఆందోళన పడుతున్నాడు.
“అరెరే!ఇప్పుడేమైందని?కళ్ళు తుడుచుకోండి ప్లీజ్!” తన జేబులోంచి రుమాలు తీసి నా కళ్ళు తుడవబోయాడు.    
  “ఏం లేదు సారీ!ఏదో గుర్తొచ్చి...సడన్ గా...అలా ఇమోషనల్ అయ్యాను.ఏం అనుకోకండి” ఏడుస్తూనే చెప్పాను.
 అర్జున్ తన చేతుల్లోకి నా ముఖాన్ని తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను నమ్మలేని ప్రశ్న సూటిగా అడిగాడు!
“ఇంత పెద్ద అబద్ధం చెప్పినా నా మీదున్న ప్రేమని వ్యక్తపరచరా?”
నేను విన్నది నిజమేనా??కల కాదు కదా!!వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అర్జున్ నోరు తెరిచి నన్ను అడిగాడా?!నిర్ధారించుకోడానికి మళ్ళీ చెప్పమని అడిగాను.
“మీరు విన్నది నిజమే!నేనంటే మీకిష్టం లేదూ?”
“అదీ...” నీళ్ళు నమిలాను
“నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం!కానీ పైకి చెప్పాలంటే సిగ్గు!మీరేమనుకుంటారోనని భయం!ఈ రోజు ఎలాగైనా చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా!చెప్పేశా!అయినా మీ మనసులో ఏముందో తెలీదే!”
అర్జున్ ఆ మాటలు చెప్తున్నంత సేపూ నా గుండె వేగం పెరిగిపోయింది.నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.నా కల,నా ఆశ, నా అర్జున్...నిజమైన వేళ అది!
“నాకూ మీరంటే చాలా ఇష్టం!పిచ్చి!!” నిర్భయంగా చెప్పేశాను.
“ఈ మాట కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంటూ నాకు తెలియకుండానే నన్ను కౌగలించుకున్నాడు!అలాగే బెడ్ రూమ్ లోకి తీస్కెళ్ళాను.కౌగిలి బిగుసుకుంది.వచ్చీరాని ధైర్యం కూడగట్టుకుని తన బుగ్గ మీద నా మొదటి ముద్దు పెట్టాను!
“అర్జున్...”
“మ్!చెప్పండి”
“ఇంకా అండి ఏంటి?పేరు పెట్టి పిలిచి మనస్పూర్తిగా ఏదైనా చెప్పొచ్చుగా!”
“గోపాల్...ఐ లవ్ యూ!”
“ఐ లవ్ యూ టూ అర్జున్!”
                                         **************
                                                    -ఎండ్లూరి మానస
                                                            September 2015, సారంగ సాహిత్య అంతర్జాల పత్రిక
   http://magazine.saarangabooks.com/2015/09/24/%E0%B0%85%E0%B0%A6%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE/