నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

21 Oct 2016

నేనెందుకు రాస్తున్నాను?!

           ‘కథలు ఎందుకు రాస్తున్నాను?’ అనే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ‘ఎందుకు చదువుతున్నాను’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. మనకు తెలియని భిన్నమైన జీవిత పార్శ్వాలను తెలుసుకోవడం కోసం, కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా ఆ కథా వాతావరణంలో ఉండడం కోసం, ఆ కథా పాత్రల్లో లీనమవడం కోసం చదువుతుంటాం. నేనూ అందుకే చదువుతుంటాను.
                                 నాకు చిన్నప్పటినుంచి నవలలు, కథలు చదివే అలవాటుంది. రెండేళ్ళ క్రితం రాయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి పత్రికల్లో వచ్చే ప్రతి కథనూ వదలకుండా చదువుతున్నాను. నేను చదివిన కనీసం వంద కథల్లో ఎక్కడా నేనా పాత్రల్లో, ప్రదేశాల్లో, సంఘటనల్లో కనిపించలేదు. వాటిలో నన్ను నేను చూసుకోలేకపోయాను. ఒకటీ రెండు కథలు తప్ప అన్నీ నన్ను అసుంట ఉంచాయి. ఆ అక్షరాలు లోపలికి తీసుకువెళ్లలేకపోయాయి. కొన్ని కథలైనా ఏదోక పాత్రలో నన్ను చూపిస్తాయని ఆశించి చదువుతూనే ఉన్నాను. అరుదుగా నాకు నేను కనిపించాను కానీ అవి బహుతక్కువ. ఇక్కడ ‘నేను’ అంటే ఏకవచనం కాదు. ఒక సమూహం, ఒక వర్గం, ఒక కులం, ఒక జాతి. ఎప్పుడైతే పాఠకుడు గాఢత అనుభవించలేకపోతాడో అప్పుడు తన సొంత గొంతుక వినిపించేందుకు ప్రయత్నిస్తాడు. ఇవే కాదు, వేరే జీవితాలున్నాయి, వేరే పార్శ్వాలున్నాయి అని చెప్పాలనుకుంటాడు. నేనూ అదే చేశాను. ఇది విషయానికి సంబంధించింది. ఇక రాయడం అనే విద్యకు చోదకశక్తి ఏమిటి అనుకుంటే అమ్మానాన్నల వల్ల నాకు చిన్నప్పటినుంచే సాహిత్యంతో అనుబంధం ఏర్పడింది. చిన్నప్పడు హైకులు, చిన్న చిన్న కవితలు, కథలు నా డైరీలో రాసుకునేదాన్ని. అదే ఈ రోజు కథలు రాయడానికి సాయపడింది.
                                         ముఖ్యంగా మూడు అంశాల మీద కథలు రాస్తున్నాను. దళిత క్రైస్తవ జీవిత పార్శ్వాలు, స్వలింగ సంపర్కంలో ఉండే సంక్లిష్టమైన అంశాలు, స్త్రీ పురుషులకు సంబంధించిన మానవసంబంధాల్లో తలెత్తుతున్న కొత్త కొత్త సమస్యలు.
                           జీవన యానంలో అనేకానేక అనుభవాలు ఎదురవుతాయి. మన చుట్టూ ఉన్న సమాజంతో సంబంధాల్లోంచి అంతకంటే ఎక్కువ అంశాలు మన ఎరుకలోకి వస్తాయి. చుట్టుపక్కల సమాజాన్ని పరిశీలించే కొద్దీ అనేక అంశాల మధ్య ఉన్న అంతర్గత సంబంధాలు అర్థమవుతాయి. కొన్ని ప్రశ్నలు కొడవళ్లై వెంటబడతాయి. ఇంకొన్ని అలజడి రేపుతాయి. మరికొన్ని దిగ్ర్భాంతి కలిగిస్తాయి. ఇదిగో ఈ అలజడి నుంచే కొత్త ఆలోచన మొదలవుతుంది, అక్షర రూపం తీసుకుంటుంది. అదే కథ. ఎంతవరకు సమర్థంగా అక్షర రూపం ఇవ్వగలిగానో లేదో తెలీదుకానీ నా కథ అయితే ఇదీ!
                                    నిర్దుష్టంగా చెప్పుకుంటే ఆడవారిపై సాగే అఘాయిత్యాలు, సమాజం మోపిన ముళ్లకిరీటం మోస్తున్న మగవారి వేదన, దళిత క్రైస్తవ స్త్రీ పురుషులు ఎదుర్కునే సమస్యలు, దుర్మార్గమైన వివక్షనూ వెలి నీ ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్కుల యాతన వంటి అంశాలు కుదురుగా ఉండనివ్వవు. లోపలా బయటా ఘర్షణ. అదే నన్ను ఈ కథల వైపు నడిపిస్తుంది.
                                              మా తాతయ్యలు, అమ్మానాన్నలు చూసిన దళిత జీవితాన్ని నేను చూసుండకపోవచ్చు. రూపం మారి ఉండొచ్చు. కానీ దళిత సమస్యలకు దళిత అవమానాలకు నేను అతీతురాలిని, అపరిచితురాలినీ కాను. స్త్రీగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాను. దళిత స్త్రీగా అవమానాలకు గురవుతుంటాను. రెండు భారాలను ఏకకాలంలో మోస్తుంటాను.
                                             దళిత సామాజిక సమస్యలు ఒకప్పుడు పచ్చిగా జుగుప్సాకరంగా ఉంటే ఇప్పుడు ‘ఇంకేవేవో అందమైన ముసుగులు కప్పుకుని మమ్మల్ని పలకరిస్తుంటాయి. అప్పట్లో మొహం మీదే అవమానిస్తే ఇప్పుడు సెటైర్ల మాటున, పొగడ్తో తెగడ్తో తెలియని మోసపు మాటల మాటున ఎదురవుతున్నాయి. వర్తమాన దళిత సమస్యల్లో వచ్చిన ఈ మార్పును, మార్పుకు కారణాలను పట్టుకుని అందివ్వాలన్నదే నా దళిత కథలకు ప్రేరణ.
                                              ముఖ్యంగా దళిత క్రైస్తవ మైనారిటీ కథలను బొట్టు కోణంలోంచి రాస్తున్నాను. బొట్టు లేని మొహాలతో క్రైస్తవులు పడే అవమానాలనూ, బొట్టు లేకపోవడం వలన పోగొట్టుకునే అవకాశాలనూ అక్షరీకరిస్తున్నాను. ఈ రోజుల్లో అవకాశాలను ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేదానికి బొట్టూ కాటుక కారణం కాలేదని విమర్శలు వచ్చినా నేను రాయడం మానలేదు. కులం సోషల్‌ కేపిటల్‌గా ఎలా పనిచేస్తుందో నాకు కొంతలో కొంతైనా తెలుసు. బొట్టు లేని స్త్రీల పై జరిగే వివక్ష ఆగలేదు. వర్గాన్ని బట్టి నివాసమున్న ప్రాంతాన్ని బట్టి ఆ అవమానంలో డిగ్రీలు వేరే ఉండొచ్చు. బొట్టు లేని క్రైస్తవురాలు జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ కులాహంకార ప్రపంచాన్నిబొట్టు లేని మొహంతో ఎదుర్కోవడం తోనే ఆమె పోరాటం ప్రారంభమవుతుంది. నుదుటికి కంది గింజంత బొట్టుంటే కనీసం కులం తెలిసే వరకైనా తాటికాయంత గౌరవం లభిస్తుందన్న ఆశతో లేని భక్తిని నటిస్తూ తమది కాని మతాన్ని భుజాన వేసుకుంటున్నారు కొందరు దళిత క్రైస్తవులు. అదొక విషాద వాస్తవం. తాము దళితులమే కాదని బుకాయిస్తున్నారు. ఈ తీరుని ‘దొంగ బొట్టు’ కథతో ప్రశ్నించాను.
                                        దళితులు అత్యధికంగా ఉన్న మన దేశంలో క్రైస్తవ మరియు ఇస్లాం సంప్రదాయాల గురించి ఎక్కువమందికి తెలియకపోవడం దురదృష్టకరం. వారి జీవన విధానాల గురించి ఎక్కువ సాహిత్యం రావాల్సి ఉంది. నిత్య జీవితాల్లో వారు పడే పాట్లు, తమ ఇళ్ళల్లో స్త్రీలు పడే ఇబ్బందుల గురించి లోకానికి తెలియనివి ఎన్నో ఉన్నాయి. అగ్రవర్ణ హిందూ స్త్రీ తన కుటుంబానికి చేసే చాకిరీని వివరిస్తూ ఆ రకంగా తానూ దళితురాలినేనని ప్రచారం చేసుకునే మూసకథలు చూస్తున్నాం. కానీ ఆ స్త్రీకి కూడా బానిసైన అసలు దళిత స్త్రీ కష్టాలు ఇంకా ఎన్నో వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి. దళిత స్త్రీని వారితో పాటు ఉండే దళిత పురుషులను పైకులాల స్ర్తీ పురుషులు ఏ విధంగా అణచివేస్తారనే కోణం నుంచి నా కథలు పుడుతుంటాయి. స్త్రీలకి రక్షణ అవసరం. దళిత స్త్రీలకి మరింత అవసరం. కులం వలన అత్యాచారం, కులం వలన మొహం మీద మూత్రం పొయ్యడం, కులం వలన కొన్ని అవకాశాలకు దూరమవడం లాంటివి దళిత స్ర్తీ ప్రత్యేకంగా ఎదుర్కొనే సమస్యలు.
                                        కుల మతాల పరంగా మైనారిటీగా ఉన్న నాకు సెక్సువల్ మైనారిటీస్, ట్రాన్స్ జెండర్స్ పట్ల సానుభూతి, అనుకూల భావన ఉండడం పెద్ద వింత కాదు. ఈ సమాజానికి కనబడేది, కావాల్సినది స్త్రీ పురుషులు మాత్రమే. అంతకు మించి ఏ మాత్రం వేరుగా ఉన్నా ఈ సంఘం అవమానిస్తుంది. వెలివేస్తుంది.
                                             ప్రతి మనిషికీ బతికే హక్కున్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. అది స్త్రీ పురుషులకన్నా కాస్త భిన్నంగా ఉన్నవారికి దక్కడం లేదు. వారిని అర్ధం చేసుకోకపోగా చిత్రమైన కారణాలతో వారిని మానసిక శారీరక హింసలకు గురి చేస్తున్నారు. వారి గోడును వినిపించుకోడానికి వారి దగ్గర భాష కూడా లేని వైనాన్ని మనం గమనించాలి. నా కథల ద్వారా స్వలింగులకు, ట్రాన్స్ జెండర్స్ కీ సంఘీభావం తెలుపుతున్నాను. ఇప్పటి వరకు వివిధ వర్గాల స్త్రీలు ఇళ్ళల్లో ఎదురుకునే రకరకాల అసమానతల గురించి, భ్రూణ హత్య, అత్యాచారం, వ్యభిచారం తదితర అంశాల గురించి కథలు రాస్తున్నాను.
                                        మారే కాలాన్ని బట్టీ స్త్రీ వాదానికి సంబంధించిన అంశాల్లో నా ఆలోచనలు కూడా మారుతూ వస్తున్నాయి. స్త్రీలు బయటకు వచ్చేకొద్దీ మగవారి ఆలోచనా విధానం ఎంతో కొంత మారుతోందనే చెప్పాలి. పిల్లల్ని చూపులతోనే బెదిరించే తండ్రులు ఈ తరంలో తక్కువ. వంటగదిలో ప్రధాన పాత్ర కాకపోయినా సహాయ పాత్ర పోషిస్తున్నారు. ఒక పక్క స్త్రీల మీద దాడులు పెరుతున్నా స్త్రీలని గౌరవించి సమానత్వంతో చూసే పురుషులు, యువకులు కూడా ఉన్నారు. సమాజం కుటుంబ పోషణ అనే భారం పురుషుడి మీదే మోపడం వల్ల ఆ భారం మోస్తూ కుటుంబ పరువు మర్యాదలకు బాధ్యుడిగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే మగ బాధితులూ లేకపోలేదు. అటువంటి ఉదంతాలకి నా కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రతీ స్త్రీ దేవతా కాదు ప్రతీ పురుషుడూ రాక్షసుడు కాదు కాబట్టి పురుషులకీ నా కథల్లో గౌరవ ప్రథమైన స్థానం ఉంటుంది.
                                      ఇలాంటి సంక్లిష్టమైన అంశాల మీద కథలు రాసేటప్పుడు ‘కొందరు కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. బాధిత సమూహాలను మంచిగా చూపించాలనేతప్పుడు చైతన్యంతో వచ్చే సమస్య అది. వాస్తవాన్ని వాస్తవంగా చూపించడానికి మనం భయపడనక్కర్లేదని నేను అనుకుంటాను. భిన్నవాస్తవాలు ఉంటాయని అవి మన మూసల్లో ఒదగవని భావిస్తాను. పాఠకులను బాధ పెట్టకూడదని పనిగట్టుకుని కథను సుఖాంతం చేయడం, వాస్తవాలను దాచడం లాంటి వాటికి నేను వ్యతిరేకం. కృత్రిమంగా మంచితనాలు చెడ్డతనాలు కట్టబెట్టే కథలకు వ్యతిరేకం. అణచివేత, దోపిడీ సమూహ జీవనంలో స్థిరపడిన అసమానతలు. అవి రాజకీయ పరమైనవి. దాని కోసం బాధిత సమూహాలను దేవతలుగానో అవతలివారిని రాక్షసులుగానో చిత్రించి కథలు రాయనక్కర్లేదు. మనం చెప్పదల్చుకున్న అంశం చెప్పడానికి పాత్రలను బ్లాక్‌ అండ్‌ వైట్‌గా చిత్రించనక్కర్లేదని మనిషిలోని అన్నిషేడ్స్‌ ఫ్రతిఫలించాలని అనుకుంటాను. అందులో ఎంతవరకు సఫలమయ్యాను విఫలమయ్యాను అనేది వేరే కథ. అదొక నిరంతర ప్రక్రియ. అలాగే ప్రతీ కథలోనూ ‘నేరము-శిక్ష’ లాగ ‘సమస్య-పరిష్కారం’ ఉండాల్సిన పని లేదని నా అభిప్రాయం.
                                          సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు దక్కే రోజు కోసం నేను కలలు కంటాను. కథలు రాస్తాను.
సెప్టెంబర్ 2016 లో పెనుగొండలో ‘తెలుగు మహిళా రచయితల అనుభవాలు- ప్రభావాలు’ అంశంపై జాతీయ సదస్సులో ‘నేను ఎందుకు రాస్తున్నాను’ అనే అంశం పై చేసిన నా ప్రసంగం.

-మానస ఎండ్లూరి

1 comment: